దట్టమైన అడవిలో మహిమాన్విత క్షేత్రం .. ‘గుండాల కోన’
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
ఎటు చూసినా జలం, ఆకాశం కుండ పోతగా వర్షిస్తోంది… చుట్టూ జీవం నింపుకుని ఆకుపచ్చగా కళకళలాడుతున్న భూమి… కుంభవృష్టిలో తడిసి ముద్దవుతున్న నేలని చూస్తుంటే ఆ నేల ఆసాంతం ఒక పెద్ద శివ లింగంలాగా, ఆకాశం పూజారిగా మారి నిండు గా అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటుంది. చుట్టూ పచ్చిక బయళ్లు… ఆపై జలజల పారే సెలయేళ్లు… ఇదంతా కడప జిల్లాలోని గుండాలకోన గురించే.
కొట్రాల గుండాలు, చెంచమ్మకోన, వాననీళ్ళ గుట్టలు, మలిట్లకోన, పెద్ద కంజులు, చిన్న కంజులు, ముంతతువ్వ బండలు, జాలకోన, యానాది ఊట్ల, దొంగబండలు, ఊరగాయకుంట, కమ్మపెంట, కుందేలుపెంట, ఈతకాయ బండలు, కోటమారుకుంట, ఏనుగుల బావి, స్వామి వారి పాదాలు(ఆ పాదాలు కొలిచే వీలులేని ఎత్తులో అద్భుతంగా ఉంటాయి) కోతులకుప్ప, నెప్పోడిసెల, కందిరేవులు, మట్లకోన, సలీంద్ర కోన.. మొదలైన ప్రాంతాలు ప్రకృతి అందాలకు చిరునామాగా వెలుగొందుతుంటాయి. గుండాలకోనలో గుంజన జలపాతం, ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన గుండాలకోనలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చిట్వేలి మండలం వెంకటరాజు పల్లి, పెద్దూరు, అనుంపల్లె గ్రామాల నుంచి దాదాపు 8కిలోమీటర్ల దూరంలో రిజర్వు ఫారెస్టులో కొండ కోనల నడుమ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ గుండాలకోన ఉంది. వెంకటగిరి కొండలమీదుగా 6 గుండాలను దాటుకుని 7వ గుండంలోనికి సుమారు 30 అడుగుల ఎత్తునుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నది. గుండాల కోనలో వర్షాకాలంలో అతి ఉధృతంగాను, వేసవికాలంలో కూడా బాగానే నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్న గుండం లోతు చూసిన వారు లేరని స్థానికుల కథనం.
కార్తీక మాసంలోనూ, శివరాత్రి పర్వదినాలలోనూ భక్తులు ఈ క్షేత్రాన్ని విశేషంగా దర్శిస్తారు. విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండం పక్కనే గుహ (పేటు)వుంది. ఈ గుహలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. గుహ ద్వారంలో భక్తులు పూజలు, ఫలాలు ఉంచుతారు. వాటిని ఎండ్రకాయ లోనికి తీసుకుపోతే తమ కోర్కెలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు. సంతానం లేని మహిళలు గుండం సమీపంలోని వృక్షాలకు మొక్కుబడిగా ఊయలలు కడుతారు. ఎత్తైన కొండల మధ్యలో భీకర శద్ధం చేస్తూ నీటి ప్రవాహం, సెలయేళ్ల గలగలలు ఆకాశాన్ని తాకినట్టుండే మహావృక్షాలు, పచ్చదనంతో ఈ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
ప్రకృతి అందాలకు నెలవైన ఈ గుండాలకోన దాదాపు 300 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మనుమరాలైన ఈశ్వరమ్మను వివాహం చేసుకోగోరి నిరాకరణకు గురైన రంగరాజు (నగరిపాడు రంగనాయకుల స్వామి) కొంతకాలం ఈ గుండాలకోనలోనే తపస్సు చేశాడట. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎండ్రకాయరూపంలో భక్తులకు దర్శనమిస్తానని చెప్పాడని చెబుతారు. అయితే స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నో ప్రయాసాలకోర్చి భక్తులు 8కిలోమీటర్లు నడవాల్సిందే. కాని దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘనటలు కొన్ని జరిగాయి. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదంటారు అధికారులు. శివరాత్రి పర్వదినాన వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శిస్తారు.