వామ్మో.. 3 నిమిషాల్లో 19 ఇడ్లీలు లాగించేశారు
మనం మామూలుగా 3 నిమిషాల్లో ఎన్ని ఇడ్లీలు తినగలం.. మహా అయితే 2-3 మించి తినలేం కదా.. అయితే తమిళనాడులో జరిగిన ఇడ్లీ పోటీలో మాత్రం ఇద్దరు వ్యక్తులు కేవలం 3 నిమిషాల్లో 19 ఇడ్లీలు చొప్పున ఆరగించి అందరినీ షాక్‌కు గురిచేశారు. తమిళనాడు పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ఇడ్లీ సాంబార్. అయితే ఇటీవల చాలా మంది ఇడ్లీలను కాదని ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇడ్లీలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా.. ఈరోడ్ జిల్లా కడయంపట్టి ప్రాంతానికి చెందిన ‘పట్టాయ కేటరింగ్’ సంస్థ ఇడ్లీలు తినే పోటీ నిర్వహించింది.
ఈ పోటీలో పాల్గొనేవారికి నిర్వాహకులు కొన్ని నిబంధనలు విధించారు. 10 నిమిషాల గడువులో వీలైనన్ని ఎక్కువ ఇడ్లీలు తినాలి. తిన్న తర్వాత 5 నిమిషాల వరకు వాంతి చేసుకోకూడదు. పోటీలో పాల్గొనేవారిని 19-30 ఏళ్లు, 31-40 ఏళ్లు, 41-50 ఏళ్లు.. ఇలా మూడు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో 25 మంది వరకు పాల్గొని ఇడ్లీలు తిన్నారు. 31-40 ఏళ్ల వయసు గ్రూపులో కుమార పాలయం ప్రాంతానికి చెందిన రవి, 41-50 ఏళ్ల వయసు గ్రూపులో భవానీ ప్రాంతానికి చెందిన రామలింగం.. కేవలం 3 నిమిషాల్లోనే 19 ఇడ్లీల చొప్పున తినేసి విజేతలుగా నిలిచారు. మిగిలిన వారెవరూ 19 ఇడ్లీలు తినలేకపోయారు. అదే సమయంలో ప్రతి గ్రూపులో ఎక్కువ ఇడ్లీలు తిన్నవారికి రూ.5వేలు, రెండో విజేతకు రూ.3,000, మూడో విజేతకు రూ.2,000, నాలుగో విజేతకు రూ.1,000 చొప్పున నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు. ఈ ఇడ్లీ పోటీ ఏదో మన దగ్గర కూడా పెడితే బాగుంటుంది కదా..