రూ.16వేల కోట్లు చాలవు… ‘అవతార్ 2’ హిట్ కావాలంటే
Category : Behind the Scenes Daily Updates Movie News Sliders
రూ. వంద కోట్ల బడ్జెట్ అంటే మనకు చాలా పెద్ద విషయం, రూ. వెయ్యి కోట్ల వసూళ్లు ఇంకా పెద్ద విషయం. అందుకే ఇలాంటి సినిమా మన దగ్గర వస్తే అదో పెద్ద విశేషంగా చెప్పుకుంటాం. ఎప్పటికప్పుడు ఆ సినిమా కలెక్షన్ల గురించి ఘనంగా చెప్పుకుంటాం. అయితే హాలీవుడ్ దగ్గర ఈ లెక్క బిలియన్ల డాలర్లలో లెక్కేస్తున్నారు. రీసెంట్గా బిలియన్ డాలర్ల వసూళ్లు అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే ‘అవతార్ 2’ వస్తోంది కదా.. దాని సంగతేంటో చూద్దాం అని అనుకుంటే.. ఆ నెంబరు రెండు బిలియన్ డాలర్లు అని తేలింది.
‘అవతార్ 2’ సినిమాకు అయిన బడ్జెట్, ప్రచారానికి చేస్తున్న ఖర్చు ఇవన్నీ కలిపితే.. సినిమాకు సుమారు రెండు బిలియన్ల డాలర్లు రావాలంట. అంటే మన కరెన్సీ ప్రకారం రూ. 16 వేల కోట్లు అన్నమాట. అయితే సినిమాకు ఇప్పటివరకు వచ్చిన బజ్, హైప్ ప్రకారం చూస్తే.. ఈ డబ్బులు రావడం పెద్ద కష్టం కాదు అంటున్నారు. అంటే సినిమా బ్రేక్ ఈవెన్కి కావాల్సిన అమౌంట్ రూ. 16 వేల కోట్లు వచ్చేస్తాయి అంటున్నారు. అయితే అంత ఖర్చు పెట్టి బ్రేక్ ఈవెన్ సాధిస్తే ఏమొస్తుంది. కాబట్టి ఇంకా చాలానే కావాలి. అందుకే ఈ సినిమా కేవలం హిట్ అయితే సరిపోదు. చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి అంటున్నారు సినిమా నిపుణులు. మన దేశంలో ఈ సినిమా రూ. 500 కోట్లకుపైగా వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగులో అయితే రూ. 100 కోట్ల మార్కు లక్ష్యమని చెబుతున్నారు.
అయితే సినిమా టికెట్ ధరల విషయంలో ఆకాశాన్ని తాకుతున్నాయి నెంబర్లు. చిన్న కుటుంబం మొత్తం వెళ్లి సగటు సినిమా చూస్తే అయ్యే ఖర్చుతో ఒకరు సినిమా చూసేలా కొన్ని నగరాల్లో టికెట్ ధరలు ఉన్నాయి. వాటి ప్రకారం చూస్తే వసూళ్లు పక్కా. అయితే సినిమా టాక్ బాగుండాలి అనేది మెలిక. ఇక డిసెంబరు 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ముందు రోజు స్పెషల్ షోస్ కూడా ఉన్నాయి. అన్నట్లు ఈ సినిమా హిట్ అయ్యి డబ్బులు వస్తేనే ‘అవతార్ 3, 4, 5 సీక్వెల్స్ తీస్తానని దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘అవతార్’ కొనసాగుతోంది. 13ఏళ్లయినా ఆ చిత్రం రికార్డులను కొల్లగొట్టే సినిమా మరొకటి రాలేదు. దాని రికార్డును అవతార్ 2 దాటే అవకాశాలున్నాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.