జాతిరత్నాలు ‘చిట్టీ’ వీడియో సాంగ్
- March 30, 2021
-
-
- March 13, 2021
-
-
‘జాతిరత్నాలు’ మూవీ రివ్యూ
చిత్రం: జాతిరత్నాలు
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు
సంగీతం: రధన్
కెమెరా: సిద్ధం మనోహర్
ఆర్ట్స్: చంద్రిక – అలీ;
నిర్మాత: నాగ్ అశ్విన్
దర్శకత్వం: కె.వి. అనుదీప్;
నిర్మాణ సంస్థ: స్వప్న సినిమా
విడుదల తేదీ: 11-03-2021
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’తో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ పోలిశెట్టి… ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఫన్నీ ఏజెంట్‌గా తనదైన కామెడీ టైమింగ్‌తో వినోదాన్ని పంచి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. తాజాగా ‘జాతిరత్నాలు’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను గిలిగింతలు ముందుకొచ్చాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ వంటి వైవిధ్యభరిత చిత్రాలతో జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించిన నాగ్‌అశ్విన్ ఈ సినిమా కోసం నిర్మాతగా మారడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను కె.వి.అనుదీప్ దర్శకత్వం వహించారు. మహాశివరాత్రి కానుకగా గురువారం(మార్చి 11) విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం..
స్టోరీ
శ్రీకాంత్ (నవీన్ పొలిశెట్టి), రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి) ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. జోగిపేట గ్రామంలో అల్లర చిల్లరగా తిరుగుతూ అందరి చేత చీవాట్లు తింటుంటారు. శ్రీకాంత్ తండ్రి తనికెళ్ళ భరణి లేడీస్ ఎంపోరియం నిర్వహిస్తూ కొడుకును కూడా అందులోనే సెట్ చేయాలనుకుంటాడు. అయితే ఆ పని ఇష్టం లేని శ్రీకాంత్ రెండు నెలల్లో మంచి ఉద్యోగం సాధిస్తానని సవాల్ చేసి హైదరాబాద్ బయలుదేరతాడు. ఈ విషయం తెలిసిన స్నేహితులు రవి, శేఖర్ కూడా అతడితో హైదరాబాద్ చేరుకుంటారు.
భాగ్యనగరానికి వచ్చాక అనుకోని పరిస్థితుల్లో వాళ్ల జీవితాలు పెద్ద చిక్కుల్లో పడతాయి. మంత్రి చాణక్య (మురళీ శర్మ)పై జరిగిన హత్యాయత్నం కేసులో ఈ ముగ్గురిని అన్యాయంగా జైలుకు పంపిస్తారు. వాళ్లను ఆ హత్యాయత్నం కేసులో ఇరికించింది ఎవరు.. ఆ కేసు నుంచి ముగ్గురు స్నేహితులు ఎలా బయటపడ్డారన్నదే కథ. మధ్యలో చిట్టి ప్రేమను శ్రీకాంత్ గెలిచుకున్నాడా? జోగిపేటలో సవాల్ చేసి వచ్చిన కుర్రాళ్లు హైదరాబాద్‌లో సెటిలయ్యారా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
చెప్పుకోవాలంటే ఇది చాలా చిన్న కథ. జోగిపేటలో సవాల్ చేసిన హైదరాబాద్‌కు వచ్చిన హీరో శ్రీకాంత్(నవీన్ పోలిశెట్టి) ఉద్యోగ వేటలో ఎదుర్కొనే అనుభవాలు సరదాగా నవ్విస్తాయి. మధ్యమధ్యలో హీరోయిన్‌ని ప్రేమలో పడేసేందుకు అతడు పడే సరదా కష్టాలు, స్నేహితులతో కలిసి పండించే హిలేరియస్ కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు. ఫస్టాప్ మొత్తం ఎక్కడా బోర్ కొట్టించకుండా కామెడీ సన్నివేశాలతోనే దర్శకుడు లాక్కొచేశాడు. హీరో, అతడి స్నేహితుడు కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్లిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. దాన్ని నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఆరంభం నుంచి ముగింపు వరకూ సినిమా మొత్తం వినోదం పంచడమే లక్ష్యంగా సాగిపోతుంటుంది.
కథలో ఎక్కడా బలవంతంగా ఇరికించిన కామెడీ ట్రాక్‌లు కనిపించవు. ప్రతి పాత్ర కథలో భాగంగానే వచ్చి వెళ్లిపోతుంటుంది. శ్రీకాంత్, శేఖర్, రవి పాత్రల్ని దర్శకుడు పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలోనే తీర్చిదిద్దాడు. అమాయకత్వంతో నిండిన మొహాలతో తింగరి పనులు చేస్తూ ఆ ముగ్గురు ప్రేక్షకులకు కావాల్సిన దానికంటే ఎక్కువే వినోదం పంచారు. శ్రీకాంత్ తొలి చూపులోనే చిట్టిని ఇష్టపడటం.. అతని అమాయకమైన చేష్టలకు మురిసిపోయి ఆమె కూడా ప్రేమలో పడటం, చిట్టి తండ్రికీ శ్రీకాంత్‌కీ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో ఎలాంటి మలుపులు లేకుండా కథను ముందుకు తీసుకెళ్లాడు డైరెక్టర్.
వచ్చీరాని ఇంగ్లీష్ మాట్లాడుతూ నవీన్ చేసే హంగామా.. ఫోన్‌లో సువర్ణ అనే అమ్మాయితో మాట్లాడుతూ రాహుల్ చేసే అల్లరి.. మధ్యలో వంట పేరుతో ప్రియదర్శి పంచే నవ్వులూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాయి. మంత్రిపై హత్యాయత్నంతో ఇంటర్వెల్ ముందు కథ మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ మొత్తం ఈ కేసుకు సంబంధించిన సన్నివేశాలే ఉండటంతో ప్రేక్షకులు కాస్త బోర్‌గా ఫీలవుతారు. కొన్ని సీరియస్ సన్నివేశాల్లోనూ కామెడీని ఇరికించడం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ ఇంటారాగేషన్ సీన్‌లో, క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సన్నివేశాల్లో నవీన్ కామెడీ టైమింగ్ అందరినీ కట్టిపడేస్తుంది. నిజానికి సీరియస్‌గా సాగాల్సిన ఈ సన్నివేశాల్ని కాస్త పకడ్బందీగా రాసుకునే ప్రయత్నం చేస్తే సెకండాఫ్, క్లైమాక్స్ మరింత ఆసక్తికరంగా ఉండేవి.
నటన పరంగా చూస్తే నవీన్ పోలిశెట్టిని మెచ్చుకోకుండా ఉండలేం. అతడికి ధీటుగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలకు స్క్రీన్ స్పేస్ లభించింది. సినిమా మొత్తం తెలంగాణ యాసలో ఈ ముగ్గురూ చెప్పే డైలాగ్స్ భలే ఆకట్టుకున్నాయి. వన్ లైన్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు ఎపిసోడ్‌లో నవీన్ నటన ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తుంది. శేఖర్, రవి పాత్రల్లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ చెలరేగిపోయారు. మురళీశర్మ చనిపోయాడనుకొని.. ఆయన శవాన్ని మాయం చేసేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక చిట్టి పాత్రలో ఫరియా అబ్దుల్లా అందం.. అభినయాలతో ఆకట్టుకుంటుంది. కోర్టు డ్రామా సినిమాలు చూసి కోర్టులో వాదనలు వినిపించే లాయర్‌గా ఆమె పండించిన వినోదం అలరిస్తుంది.
జస్టిస్ బలవంత్ చౌదరి గా బ్రహ్మానందం తన మార్క్ కామెడీని పండించారు. బ్రహ్మాజీ, నరేష్‌లకు చిన్న పాత్రల్లో కనిపిస్తారు. సెకండాఫ్‌లో సినిమాను బాగా లాగడంతో ప్రేక్షకులకు కాస్త విసుగు పుట్టిస్తుంది. క్లైమాక్స్‌లోనూ కామెడీనే నింపేసి ముగించేశారు. సినిమా మొత్తం ఔట్ అండ్ ఔట్ కామెడీతో హంగామా చేసిన డైరెక్టర్.. సీరియస్ సన్నివేశాలు, హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్‌పై ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే ‘జాతిరత్నాలు’ మరో లెవల్‌కి వెళ్లేది. రధన్ అందించిన పాటలు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి.
జాతిరత్నాలు.. నవ్వించడానికే పుట్టిన హాస్యరత్నాలు