నాకు డబ్బుంది.. కానీ జీవితంలో ప్రశాంతం లేదు: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

నాకు డబ్బుంది.. కానీ జీవితంలో ప్రశాంతం లేదు: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావని అంటుంటారు. కానీ ఇందులో నిజం లేదని అంటున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఎన్ని రూ.కోట్లు సంపాదించినా తన జీవితంలో ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ కండక్టర్‌గా మొదలైన రజినీకాంత్ ప్రయాణం సూపర్ స్టార్ వరకు వచ్చిన వైనం అందరికీ తెలిసిందే. అయితే పేరు, డబ్బు తన మనసుకు ప్రశాంతతనే ఇవ్వలేదని ఆయన చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలో జరిగిన హ్యాపీ సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ త్రూ క్రియ యోగ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నేను మంచి నటుడని అందరు అంటుంటారు. కానీ దాన్ని ప్రశంసగా తీసుకోవాలో, విమర్శగా పరిగణించాలో అర్థం కావడం లేదు. నా సినిమాల్లో నాకు ఆత్మ సంతృప్తిని కలిగించిన సినిమాలు బాబా, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి.. ఈ సినిమాలు చూసి నా అభిమానులు చాలా మంది సన్యాసులుగా మారారు, హిమాలయాలకు వెళ్లారు. కానీ నేను మాత్రం ఇక్కడే కొనసాగుతున్నాను. మధ్యలో వెళ్లి వస్తున్నా.. ఇంకా ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇక అక్కడ దొరికే అమూల్యమైన మూలికలు.. తింటే వారానికి సరిపడా శక్తి వస్తుంది. ఆరోగ్యం చాలా ముఖ్యం.. ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు మనకు ఏదైనా అయితే తట్టుకోలేరు. డబ్బు, పేరు, ప్రఖ్యాతలు ఇవేమి నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. అన్నీ ఉన్నా ప్రశాంతత లేదు నాకు. నా జీవితంలో నేను చాలా చూశాను.. కానీ 10 శాతం కూడా ప్రశాంతంగా జీవించలేక పోయాను. సంతోషం, ప్రశాంతత అనేవి జీవితాంతం వుండేవి కావు’ అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు.

రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. తమిళ సినీ పరిశ్రమను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రజనీదే అనడంలో సందేహమే లేదు. ఆయనకు జపాన్, మలేషియా దేశాల్లోనూ అనేక మంది అభిమానులున్నారు. భారతీయ సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. స్టైల్, మ్యానరిజానికి కేరాఫ్‌గా నిలిచే రజనీకాంత్‌ యాక్షన్‌ సినిమాలతో కోలీవుడ్‌ని ఉర్రూతలూగించారు. ప్రస్తుతం ఆయన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తో ‘జైలర్‌’ మూవీలో నటిస్తున్నారు.


పెళ్లి తర్వాతా తగ్గని క్రేజ్… రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నయన్

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రేంజ్ స్టార్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. తెలుగు, తమిళ బాషల్లో స్టార్ హీరోలందరితో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నయన్.. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకుంది. ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న నయనతారు.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’‌లో కీ రోల్ పోషిస్తోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినా ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. దీంతో పాటుగా హిందీలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ హీరోయిన్ గా నటించింది..ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. అయితే నయనతారకు సంబంధించి ఓ కీలక సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా పెళ్లి తర్వాత క్రేజ్‌తో పాటుగా సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. అయితే ఇందుకు భిన్నంగా నయనతారకి ఇసుమంత కూడా డిమాండ్ తగ్గలేదు. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ షో మాత్రమే కాకుండా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడం నయనతార స్పెషాలిటీ. అందుకే అందరు డైరెక్టర్లు ఆమెతో పని చెయ్యడానికి ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. తనకున్న డిమాండ్‌ని బట్టి నయనతార పెళ్లయిన తర్వాత పారితోషికం బాగా పెంచేసినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటివరకు రూ.4-6కోట్ల పారితోషికం తీసుకునే ఈ బ్యూటీ ఇప్పుడు రూ.10కోట్లు డిమాండ్ చేస్తోందట. అయితే ఆమెకున్న క్రేజ్‌ని బట్టి ఎంత అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు కూడా వెనకడుగు వేయడం లేదట.

కేవలం నయనతార కోసమే సినిమాలు చూసే ప్రేక్షకులు తెలుగు, తమిళ భాషల్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. నయనతార ఒక సినిమా ఒప్పుకుందంటే కచ్చితంగా ఏదో విశేషం ఉంటుందని బలంగా నమ్ముతుంటారు. అందుకే ఆమె తన బ్రాండ్ కి తగ్గ పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నయనతారకి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఈ సంస్థ ద్వారా తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూ కొత్తవాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇస్తోంది నయనతార.


HBD Suriya: వామ్మో… సూర్య ఆస్తి అన్ని రూ. కోట్లా?

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలు పోషిస్తూ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ సూర్య. ఓ వైపు పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు పోలీసులు చేసే తప్పులు ఎత్తి చూపించే పాత్రలు(జైభీమ్) పోషిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాడు. అందుకే సూర్యను తమిళ ప్రేక్షకులతో సమానంగా తెలుగు వారు సైతం ఆరాధిస్తుంటారు. పాత్ర నచ్చితే హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించేందుకు సైతం అంటూ ఇటీవల ‘విక్రమ్‌’ మూవీ రోలెక్స్ పాత్రలో మెరిశాడు. తాజాగా వెలువడిన 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘సూరారై పోట్రు(ఆకాశం నీ హద్దురా)’ కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. జులై 23న 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్న సూర్య ఆస్తుల గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. దీంతో ఆయనకు ఎన్ని ఆస్తులున్నాయో ఓ లుక్కేద్దామా..

ప్రముఖ తమిళ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడైన సూర్య(Suriya) చెన్నైలో పుట్టి పెరిగాడు. కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించాడు. లయోలా కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 1997లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘నందా’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ జ్యోతిక‌ను 2006లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూర్య సోదరుడు కార్తి కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు

ఫోర్బ్స్ లెక్కల ప్రకారం సూర్య ఆస్తి, పాస్తుల విలువ రూ. 186కోట్లు. దక్షిణాదిలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో ఆయనొకరు. ఒక్కో సినిమాలో నటించేందుకు రూ. 20కోట్ల నుంచి రూ. 25కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటాడని సమాచారం. బ్రాండ్‌కు ప్రచారం చేయడానికి రూ.2కోట్లను పారితోషికంగా అందుకుంటాడట. ప్రమోషన్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, టీవీ కమర్షియల్స్ వంటి వివిధ మార్గాల్లో ఏడాదికి రూ. 30కోట్ల వరకు సంపాదిస్తాడని టాక్. సూర్యకు కార్లంటే అంటే చాలా ఇష్టం. అందుకే తన గ్యారేజీలో అనేక విలాసవంతమైన కార్లకు చోటిచ్చాడు. బీఎమ్ డబ్ల్యూ-7 సిరీస్, ఆడి-క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ ఎమ్ క్లాస్, జాగ్వార్ ఎక్స్‌జేఎల్ వంటి కార్లను సొంతం చేసుకున్నాడు.


వన్నియర్‌ vs సూర్య.. వివాదంలో ‘జై భీమ్‌’.. అండగా నిలిచిన కోలీవుడ్

తమిళ హీరో సూర్య నటించిన ‘జై భీమ్‌’ సినిమా ఓవైపు ఓటీటీలో విజయదుంధుబి మోగిస్తుంటే.. మరోవైపు వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. వన్నియర్‌ సామాజికవర్గ నేతలు, చిత్రబృందం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తమ వర్గాన్ని కించపరుస్తూ వాస్తవానికి విరుద్ధంగా చిత్రాన్ని తీశారని వన్నియర్ సామాజిక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మాత్రమేనని, ఇందులోని పాత్రలు, పేర్లు మార్చామని ఆ బృందం చెబుతోంది. మొత్తానికి రోజురోజుకీ ఈ రెండు వర్గాలు పరస్పర ప్రకటనలతో వాదనలు కొనసాగుతున్నాయి.

ఓవైపు వన్నియర్‌ సంఘాలు, పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) ప్రశ్నల అస్త్రాలు సంధిస్తుండగా.. మరోవైపు సూర్య వాటికి సమాధానమిస్తూ వస్తున్నారు. ఆయనకు కోలీవుడ్ అండగా నిలుస్తోంది. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య నటించిన ‘జై భీమ్‌’ దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. 1993లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అప్పట్లో పోలీసు యంత్రాంగం తీరు వల్ల ఓ గిరిజన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, ఆపై అతని భార్య న్యాయపోరాటం చేయడం.. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించడం.. న్యాయానికి హారతులు పట్టడమే చిత్ర అసలు కథ. అయితే ఇందులో పోలీసు అధికారి పాత్రను ‘వన్నియర్‌’ సామాజిక వర్గానికి సంబంధించినట్టు చిత్రీకరించడం, అందుకు ఆధారాలు చిత్రంలో అక్కడక్కడ కనిపించాయి. ఈ అంశాలే ప్రస్తుత రచ్చకు కారణాలుగా మారాయి.

అయితే సదరు సామాజిక వర్గం ప్రశ్నించిన తర్వాత ఆ వర్గానికి సంబంధించిన ఆనవాలను చిత్రంలో నుంచి తొలగించి.. మార్పులు చేసింది ‘జై భీమ్‌’ బృందం. అసలు ప్రశ్న ఏంటంటే?.. అసలు సినిమాలో ఎందుకు తమ సామాజిక వర్గాన్ని ప్రస్తావించాలి? ఆ తర్వాత ఎందుకు తొలగించాలన్నదే. అంతేకాకుండా పోలీసు అధికారి అసలు పేరు ‘ఆంథోని’ పేరును ఎందుకు వాడలేదు’, ‘న్యాయపోరాటం చేసే ఆ మహిళ అసలు పేరు పార్వతి కానీ చిత్రంలో సెంగనిగా’ మతపరంగా మరోరూపం ఇవ్వడం ఎందుకు’.. వంటి ప్రశ్నలను కూడా సంధిస్తున్నారు. ఇందుకు బహిరంగంగా సూర్య క్షమాపణలు చెప్పాలని కూడా పీఎంకే నేత అన్బుమణి రామదాసు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు వన్నియర్‌ సంఘం సూర్యకు లీగల్‌ నోటీసులు కూడా జారీ చేసింది.

అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ‘జైభీమ్‌’ చిత్ర నిర్మాత, నటుడు సూర్యకు చిత్ర పరిశ్రమ అండగా నిలుస్తోంది. ఈ వార్‌ ట్విట్టర్‌కు కూడా ఎక్కింది. సామాజిక వర్గ సంఘాలు, పీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు.. సూర్య అభిమానుల మధ్య ట్వీట్ల ఘర్షణ జరుగుతోంది. సూర్యకు మద్దతుగా నిలిచేవారి #westandwithsuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అలాగే చిత్ర పరిశ్రమలోని నిర్మాతల మండలి కూడా సూర్యకు మద్దతుగా అన్బుమణికి ఓ లేఖ రాసింది. సీనియర్‌ దర్శకుడు భారతిరాజా, నటుడు సత్యరాజ్, నిర్మాత థానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా అన్బుమణికి రాసిన లేఖల ద్వారా సూర్యకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.

సూర్యను ఓ సామాజిక వర్గ విరోధిగా మార్చే ప్రయత్నం చేయకండని భారతిరాజా కోరారు. ఎన్నో సమస్యలుండగా సినిమాలోని ఈ విషయంపై గళమెత్తడం బాధాకరమని తెలిపారు. అలాగే సత్యరాజ్‌ స్పందిస్తూ.. ‘పలు చిత్రాలు అభినందించే రీతిలో ఉంటాయి. వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే కీర్తించదగ్గ చిత్రాలుగా నిలుస్తాయి. ఆ వరుసలో ‘జై భీమ్‌’ ఉంది. సూర్య ‘ఎదర్కుం తునిందవన్‌’ (దేనికైనా రెడీ). ఆయన్ను అభినందించాల్సిన తరుణమి’దని పేర్కొన్నారు. అయితే ఈ వివాదాన్ని దీని రాద్ధాంతం చేస్తూ గోడ పత్రికలను చించడం, సూర్యను కొడితే రూ.లక్ష ఇస్తానని పీఎంకే నేత ప్రకటించడం వంటి పనులు అత్యంత దారుణమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మరి.