శివుడిని మూర్తి రూపంలో పూజిస్తే మంచిదా?… లింగ రూపంలో పూజిస్తే మంచిదా?

శివుడిని మూర్తి రూపంలో పూజిస్తే మంచిదా?… లింగ రూపంలో పూజిస్తే మంచిదా?

శివుడిని మూర్తి రూపంలో పూజిస్తే మంచిదా.. లింగరూపంలో ప్రణమిస్తే మంచి ఫలితాలు కలుగుతాయా? అన్న అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ పరమాత్మ మహాభారతంలో చెప్పారు. శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారి కంటే, శివలింగారాధన చేసేవారిలో తేజస్సు, శక్తి అధికంగా ఉంటాయని స్పష్టం చేశారు. మనకు లోకంలో అనేక రకాల లింగాలు కనిపిస్తాయి. అందులో రెండు లింగాల గురించి చెప్పుకుందాం….

లింగం అంటే గుర్తు, ప్రతిరూపం అని అర్దం. అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది. కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ….. ఇలా కదలని వాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు పరమశివుడు. అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న శివుడికి చేసే అపచారం. అలాగే ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవసరమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం శివుడికి ఇచ్చే గౌరవం. ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం కూడా శివుడికి అపచారమే.

రెండవది జంగమ లింగం. జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమి కీటకాలు లాంటివి. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. ఇక ఇది చలికాలం, అనేకమంది చలికి వణుకుతూ రోడలపై పడుకుంటారు. అటువంటి వారికి దుప్పట్లు పంచడం, ముష్టివారికి కాసింత అన్నం పెట్టడం, చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం, పీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి అర్చన క్రిందే వస్తుంది. మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి కానీ.. అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు.


కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి

దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం
న దేవః కేశవాత్పరః


అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజూ పుణ్యప్రదమే. ఒక్కోరోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం…


కార్తీక శుద్ధ పాడ్యమి: తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్లాలి.. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ: సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.
తదియ: అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.
చవితి : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.
పంచమి : దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.
షష్ఠి : ఈరోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
సప్తమి : ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.
అష్టమి : ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.
నవమి : నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.
ఏకాదశి : దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.
ద్వాదశి : ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.
త్రయోదశి : సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

కార్తీక పూర్ణిమ: కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీ స్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.


కార్తీక బహుళ పాడ్యమి: ఆకుకూర దానం చేస్తే మంచిది.
విదియ : వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.
తదియ : పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.
చవితి : రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.
పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.
షష్ఠి : గ్రామదేవతలకు పూజ చేయాలి.
సప్తమి : జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.
అష్టమి : కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి : వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.
దశమి : అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.
ఏకాదశి : విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.
త్రయోదశి : ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
చతుర్దశి : ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.
అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.


కార్తీక మాసం విశిష్టత.. ముఖ్యమైన తిథులు, పండగలు

స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం “కార్తీకమాసం’. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండో మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి “కార్తీకమాసం” అని పేరు వచ్చింది.

“న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్”

అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.

శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

కార్తీక మాసం… ముఖ్యమైన పండగలు, తిథులు

24 -10- 2022… సోమవారం ఆశ్వీజ బహుళ చతుర్దశి తత్కాల అమావాస్య (దీపావళి అమావాస్య)

25- 10 -2022… మంగళవారం సూర్యగ్రహణం

26- 10- 2022… బుధవారం కార్తీక శుద్ధ పాడ్యమి( కార్తీకమాసం ప్రారంభం) ఆకాశదీప ప్రారంభం

27-10-2022… గురువారం భగినీహస్త భోజనాలు(యమ విదియ)

29- 10- 2022… శనివారం కార్తీక శుద్ధ చవితి ( నాగుల చవితి)

7 -11- 2022… కార్తీక సోమవారం రెండో సోమవారం

14 -11 -2022… కార్తీక సోమవారం మూడో సోమవారం

21 -11 -2022… కార్తీక సోమవారం నాలుగో సోమవారం

4- 11- 2022… శుక్రవారం కార్తీక శుద్ధ ఏకాదశి

5- 11- 2022… శనివారం కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి)

8- 11 -2022… మంగళవారం కార్తీక శుద్ధ పౌర్ణమి

23- 11- 2022… బుధవారం కార్తీక బహుళ అమావాస్య( కార్తీకమాసం ముగింపు)

24 11 2022… గురువారం మార్గశిర శుద్ధ పాడ్యమి (మార్గశిర మాసం ప్రారంభం)


మోకాళ్లపై వంగి శివుడికి దండం పెట్టిన మేక.. నోరెళ్లబెట్టిన భక్తులు

భక్తి. దేవుడి పట్ల ఆరాధన. ఇది కొంతమందికి స్వతహాగా రావచ్చు. మరికొంత మందికి భయం వలన రావచ్చు. ఇంకా కొంతమందికి అవసరం వలన కూడా భక్తి భావన కలగవచ్చు. ఎలా కలిగినా భక్తి అనేది మానవులకు మాత్రమే సొంతమని అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే పశు పక్ష్యాదులు, జంతువులు కూడా అప్పుడప్పుడూ భక్తి తన్మయత్వంలో తరిస్తుంటాయి. దానికి ఉదాహరణే ఈ మేక.


ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ నగరంలోని బాబా ఆనందేశ్వర్ ఆలయం. శనివారం సాయంత్రం వేళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఒక మేక స్వామివారికి వంగి నమస్కరించింది. ఇతర భక్తులతో కలసి శివుడిని ప్రార్థించింది. అచ్చం భక్తుల తరహాలో మోకాళ్లపై పడి ఆ పరమశివుడిని వేడుకుంది ఈ మేక. పాపం ఎన్ని కష్టాలున్నాయో.. ఏమో. మిగతా భక్తులను ఏ మాత్రం పట్టించుకోకుండా భక్తి తన్మయత్వంతో ఆ శివుడికి తన కష్టాలేవో మొరపెట్టుకున్నట్లుంది. మేక భక్తిని గుళ్లో ఉన్నవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. తర్వాత తమ సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాన్ని బంధించారు. ఈ మేక చేసిన పని ఇప్పుడు అందరి నోళ్లల్లోనూ నానుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ మేకపై చర్చ జరుగుతోంది.