పడమటి ఆంజనేయుడి ఆలయం.. ఇక్కడ గర్భగుడికి పైకప్పు ఉండదు
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
ఏ ఆలయంలోనైనా భక్తులను గర్భగుడిలోకి అనుమతించరు. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోకి భక్తులు వెళ్లడమే కాదు మూలమూర్తి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఈ ఆలయంలో గర్భగుడికి పై కప్పు ఉండదు. స్వామి విగ్రహం కూడా పడమర వైపు తిరిగి ఉంటుంది. ఇతర ఆలయాలకు భిన్నంగా మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈ ప్రత్యేకతలన్నీ కనిపిస్తాయి.
పడమటి ఆంజనేయుడు
శ్రద్ధగా పూజించేవారికి శని దోషాలను పోగొట్టే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లాకు 65 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదీ తీరంలోని మక్తల్ ప్రాంతంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని జాంబవంతుడే స్వయంగా ప్రతిష్ఠించాడని అంటారు. సాధారణంగా హనుమంతుడి ఆలయాల్లో స్వామి విగ్రహాలు తూర్పు, ఉత్తరం, దక్షిణంవైపు తిరిగి భక్తులకు దర్శనమిస్తుంటాయి. కానీ ఇక్కడ స్వామి పశ్చిమ దిక్కును చూస్తూ, ఓ పక్కకు ఒరిగి భక్తులకు దర్శనమివ్వడం విశేషం. అంతేకాదు, ఈ ప్రాంగణంలోని గర్భగుడికి పైకప్పు ఉండదు.
స్థల పురాణం
గర్భగుడిలో పైకప్పు లేకపోవడానికీ ఓ కథ ఉంది. ఇక్కడ గర్భగుడిలోని పైకప్పును ఉదయం నుంచీ సాయంత్రంలోగా నిర్మించాలనేది నియమమనీ… రెండుసార్లు అలా ప్రయత్నించినా పైకప్పు కూలిపోయిందనీ.. దాంతో దాన్ని అలాగే వదిలేశారనీ చెబుతారు స్థానికులు. గర్భగుడిలో సైతం భక్తులు ప్రదక్షిణలు చేసే అవకాశం ఉన్న ఆలయం కూడా ఇదొక్కటే కావం విశేషం.
శనిదోషాన్ని పోగొట్టేస్వామి
త్రేతాయుగంలో జాంబవంతుడు ఇక్కడ స్వామి విగ్రహాన్ని స్వయంగా ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. అదే విధంగా సీతాదేవి జాడ వెదుకుతూ వచ్చిన హనుమంతుడు ఈ ప్రాంతంలో సేదతీరాడనీ.. అలా ఇక్కడ స్వామివారి విగ్రహం వెలసిందనీ అంటారు. స్వామి విగ్రహం ఓ పక్కకు ఒరిగి ఉండటానికీ ఓ కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు స్వామిని పూజించే అర్చకుడు పొట్టిగా ఉండేవాడట. దాంతో రోజూ స్వామికి సరిగ్గా పూజ చేయలేక ఇబ్బంది పడేవాడట. ఆ అసంతృప్తితో అర్చకుడు ఓ రోజు విగ్రహం తన చేతికి అందితే కానీ పూజ చేయకూడదని నిర్ణయించుకుని అదే విషయాన్ని స్వామికి విన్నవించుకున్నాడట. కాసేపటికి స్వామి విగ్రహం పూజారికి అందేలా కాస్త పక్కకు ఒరిగిందట. అప్పటినుంచీ విగ్రహం ఒకవైపు వాలినట్లుగా ఉండిపోయిందని అంటారు.
ఈ స్వామిని 41 రోజులపాటు భక్తితో పూజిస్తే… కోరికలు తీరుస్తాడనీ, శనిదోషాలనూ నివారిస్తాడనీ అంటారు. ఆంజనేయుడికి సింధూర లేపనం అంటే ఇష్టమనీ.. మనసులో ఏదయినా అనుకుని సింధూరాన్ని స్వామికి అర్పిస్తే సంతానం, యశస్సు, విద్య.. ఇలా ఏది అనుకున్నా ప్రసాదిస్తాడనీ చెబుతారు. మార్గశిర మాసంలో త్రయోదశి నుంచి బహుళ విదియ వరకూ స్వామి వారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. మార్గశిర పౌర్ణమి రోజున రథోత్సవం, ఉట్టికొట్టే కార్యక్రమాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులూ వస్తారు. అదేవిధంగా ఉగాది, శ్రీరామనవమి, హనుమజ్జయంతి, అక్షయ తృతీయ రోజుల్లోనూ వైభవంగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఇలా చేరుకోవచ్చు
ఈ ఆలయం హైదరాబాద్‌కు 163 కిలోమీటర్ల దూరంలో… కర్నూలు పట్టణానికి117 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు ప్రాంతాల నుంచి ఆలయానికి నేరుగా చేరుకునేందుకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి రైల్లో వచ్చిన వారు మహబూబ్‌నగర్‌లో దిగి.. అక్కడి నుంచి 65 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.