సెల్‌ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా.. ఆయుష్షు తగ్గిపోతుంది జాగ్రత్త!

సెల్‌ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా.. ఆయుష్షు తగ్గిపోతుంది జాగ్రత్త!

ఆయుష్షు పెంచుకోవాలని అనుకుంటున్నారా? త్వరగా వృద్ధులు కావొద్దని అనుకుంటున్నారా? అయితే స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ల వంటి పరికరాల అతి వాడకాన్ని మానెయ్యండి. వీటి నుంచి పెద్దమొత్తంలో వెలువడే నీలి కాంతి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తోందని ఓరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అధ్యయనం హెచ్చరిస్తోంది.

చర్మం దగ్గర్నుంచి కొవ్వు కణాలు, నాడుల వరకూ నీలి కాంతి వివిధ రకాలుగా ప్రతికూల ప్రభావం చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కాంతి ప్రభావంతో కణాలు సవ్యంగా పనిచేయటానికి అత్యవసరమైన ఆయా రసాయనాలు (మెటబాలైట్స్‌) అస్తవ్యస్తమవుతున్నట్టు.. ముఖ్యంగా సక్సినేట్‌ మోతాదులు పెరుగుతున్నట్టు, గ్లుటమేట్‌ మోతాదులు తగ్గుతున్నట్టు ఈగలపై నిర్వహించిన అధ్యయనంలో తొలిసారిగా నిరూపితమైందని వివరిస్తున్నారు. ప్రతీ కణం వృద్ధి చెందటానికి, పనిచేయటానికి అవసరమైన శక్తి ఉత్పత్తి కావటానికి సక్సినేట్‌ అనే మెటబాలైట్‌ అత్యవసరం. అలాగని దీని మోతాదులు మరీ ఎక్కువగా పెరిగినా ఇబ్బందే. కణాలు దీన్ని వాడుకోలేవు. ఇక గ్లుటమేటేమో నాడీ కణాల మద్య సమాచారం ప్రసారం కావటంలో పాలు పంచుకుంటుంది. దీని మోతాదులు తగ్గితే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఇలాంటి మార్పుల మూలంగా కణాలు అంత సమర్థంగా పనిచేయటం లేదని, ఫలితంగా అవి ముందే మరణించే అవకాశముందని పరిశోధకులు వివరిస్తున్నారు.

ఇలాంటి మెటబాలైట్లు ఈగల్లోనూ, మనుషుల్లోనూ ఒకేలా ఉంటాయని, అందువల్ల మన మీదా నీలి కాంతి దుష్ప్రభావం ఇలాగే ఉండే అవకాశముందని సూచిస్తున్నారు. డిజిటల్‌ పరికరాల అతి వాడకానికీ ఊబకాయం, మానసిక సమస్యలకూ సంబంధం ఉంటోందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వీటి విషయంలో మరింత జాగ్రత్త అవసరమని తాజా అధ్యయనం చెబుతోంది.