ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్.. దీని లక్షణాలేంటి? చికిత్స ఎలా..
Category : Behind the Scenes Daily Updates Features Health new Sliders
ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్ (Monkey pox) మన దేశాన్ని కూడా కలవరపరుస్తోంది. దేశంలో మొదటి కేసు కేరళలో నమోదుకాగా.. తాజాగా బాధితుల సంఖ్య నాలుగుకి చేరింది. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలేంటి? చికిత్స ఎలా? తీసుకోవలసి జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
మంకీ పాక్స్ అంటే ఏమిటి..?
మంకీపాక్స్ అనేది వైరల్ డిసీజ్. మంకీపాక్స్ స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. ఇది జూనోటిక్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం కూడా ఉంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 – 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో తొలిసారిగా మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
ఎలా వ్యాపిస్తుంది..
వ్యాధి సోకిన జంతువు గాయాన్ని తాకినా, సంపర్కరం, కాటు కారణంగా సోకే అవకాశం ఉంది. ప్రస్తుతం నమోదయ్యే కేసులు ఎక్కువ మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నవే. లైంగిక సంపర్కం ద్వారా మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు ఏంటి
జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీ పాక్స్ లక్షణాలు. స్మాల్‌పాక్స్ మాదిరిగానే మొహం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ లక్షణాలు 2 – 3 వారాల్లో బయటపడతాయి. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల వ్యవధిలోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది.
చికిత్స ఎలా
మంకీపాక్స్ నివారణకు కచ్చితంగా చికిత్స లేనప్పటికీ దీన్ని నియంత్రించడానికి వైద్యులు యాంటీవైరల్ మందులను ఇస్తున్నారు. స్మాల్‌పాక్స్ వ్యాక్సిన్ మంకీపాక్స్ చికిత్సలో 85% సమర్థవంతగా పనిచేస్తుందని నిర్ధారించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ సమయంలో మనం అనుసరించిన జాగ్రత్తల మాదిరిగానే, నిపుణులు సామాజిక దూరం, మాస్కింగ్, మెరుగైన వెంటిలేషన్ మరియు అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండడం వంటి కొన్ని సిఫార్సు పద్ధతులను అనుసరించాలని సూచిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
మంకీపాక్స్ ధ్రువీకరించిన వ్యక్తులకు, అనుమానిత వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.
రద్దీగా ఉండే ప్రాంతాలకు, కార్యక్రమాలకు వెళ్లడం మంచిది కాదు.
పరిశుభ్రత పాటించండి.
మాస్క్ ధరించండి.
గమనిక: ఈ వివరాలు, సూచనలు ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించబడ్డాయి. ఈ స్టోరీ కేవలం పాఠకుల అవగాహన కోసమే మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే మంచి పద్ధతి.