నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట

నా వారసుడు వచ్చేస్తున్నాడు.. నందమూరి బాలకృష్ట

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా చ‌ర్చ న‌డుస్తుంది. రేపో మాపో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయ‌మ‌ని అభిమానులు ముచ్చటించుకుంట‌ున్న స‌మ‌యంలో ఇటీవ‌ల బాల‌కృష్ణ త‌న త‌న‌యుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్న ఆయన.. మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు. తన కుమారుడిని వచ్చే ఏడాది టాలీవుడ్‌లోకి పరిచయం చేయనున్నట్లు చెప్పారు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు. అయితే, ఆ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం బాలయ్య చెప్పలేదు. మోక్షజ్ఞను బోయపాటి శ్రీనుతో లాంచ్‌ చేయనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన మాట్లాడుతూ.. ‘‘అంతా దైవేచ్ఛ’’ అని నవ్వి ఊరుకున్నారు. అయితే క్లాసిక్ మూవీతో త‌న త‌న‌యుడిని బాల‌య్య ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాడ‌ని తెలుసుకొని ఫ్యాన్స్ ఖుసీ అయిపోతున్నారు.

ఆదిత్య 369 చిత్రం ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో, ఎప్పుడు మోక్షజ్ఞను వెండితెర‌పై చూస్తామా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో బాల‌య్య మ‌రోసారి స్పందించాడు. ఆదిత్య 369 చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాల‌య్య మాట్లాడుతూ.. ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఇక ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని చెప్పిన ఆయన, ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదని చెబుతూ తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు.

అలాగేఅఖండ-2 ప్రాజెక్టుపైనా బాలయ్య స్పందించారు. ‘అఖండ-2’ తప్పకుండా ఉంటుందని… సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశామన్నారు. ఈ సినిమాను ప్రకటించడం ఒకటే మిగిలింది. సమయం చూసి ప్రకటిస్తామని బదులిచ్చారు. గోవాలో నిర్వహిస్తోన్న 53వ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇటీవల ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ మేరకు చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి సందడి చేశారు. ఇక, బాలయ్య ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహా రెడ్డి’ సినిమా చేస్తున్నారు. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.


‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలి’…‘అన్‌స్టాపబుల్‌ 2’ ట్రైలర్

నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు నందమూరి బాలకృష్ణ. బడా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుని సుదీర్ఘ కాలంగా హీరోగా కొనసాగుతున్నారు. తన పని అయిపోయిందంటూ విమర్శలు వచ్చిన ప్రతిసారి బ్లాక్‌బస్టర్ హిట్లతో క్రిటిక్స్ నోళ్లు మూయించడం బాలయ్యకు వెన్నతో పెట్టిన విద్య. అయితే కేవలం సినిమాలే కాకుండా ఆహాలో ప్రసారమైన ‘అన్‌స్టాపబుల్’ షోతో తనలో మరో యాంగిల్ ఉందని నిరూపించారు. బాలకృష్ణ హోస్ట్ చేసిన ఈ షో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడం విశేషం. ఆ ఉత్సాహంతోనే ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్‌కు రెడీ అయ్యారు. త్వరలోనే మొదలుకానున్న ఈ షోకు సంబంధించి అఫిషియల్ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో ‘దెబ్బకి థింకింగ్‌ మారిపోవాలి’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో బాలయ్య అలరించారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్‌ని మీరూ ఓ లుక్కేయండి…


OTTలోనూ ‘అఖండ’ ప్రభంజనం.. తొలిరోజే రికార్డులు గల్లంతు

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హైట్రిక్‌ మూవీ `అఖండ`. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ఓటీటీలో విడుదలైన ‘అఖండ’.. అక్కడ కూడా రికార్డు క్రియేట్‌ చేసింది. జనవరి 21 నుంచి  ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హార్ట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ మూవీ.. తొలి 24 గంటల్లోనే 10 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం. ఇది ఓటీటీ చరిత్రలో ఓ రికార్డు అని చెప్పొచ్చు. ఓటీటీలో భారీ ఓపెనింగ్స్‌ రావడంతో పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ‘థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ‘అఖండ’.. ఓటీటీలోనూ రికార్డు సృష్టించడం గర్వంగా ఉంది. ఈ వేదిక ద్వారా మరింత మంది సినీ అభిమానులకు మా చిత్రం వీక్షించడం పట్ల సంతోషంగా ఉంది ’ అన్నారు బాలకృష్ణ. కోవిడ్‌ కారణంగా థియేటర్స్‌లో చూడలేకపోయిన వారంతా.. ఓటీటీలో ‘అఖండ’ చిత్రం వీక్షించి ఆస్వాదించండి’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. 


ఓటీటీలో ‘అఖండ’… డేట్ ఫిక్స్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలయ్య అఘోర పాత్రలో మెప్పించాడు. బాలయ్య కెరీర్‌లోనూ 100కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

అయితే ముందు ఈ సినిమాను జనవరి 14న స్ట్రీమింగ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని జనవరి 21న విడుదల చేయనున్నట్లు తెలిపింది డిస్నీ హాట్‌స్టార్. అఖండ తెలుగు సినిమా ఎప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందంటూ బాలయ్య అభిమాని ఒకరు ట్వీట్ చేయగా.. అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రిప్లై ఇస్తూ అసలు విషయం చెప్పింది. 21 జనవరి, 2022న అఖండ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి అంటూ ట్వీట్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.


రివ్యూ: అఖండ… బాలయ్య ఫ్యాన్స్‌కి పూనకాలే!

చిత్రం: అఖండ
న‌టీన‌టులు: బాల‌కృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ, సుబ్బరాజు, అవినాష్‌, సాయికుమార్‌, శ్రవ‌ణ్‌, ప్రభాక‌ర్, త‌దిత‌రులు,
మ్యూజిక్: త‌మ‌న్
నిర్మాణ సంస్థ: ద్వారక క్రియేష‌న్స్‌
నిర్మాత‌: మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి
ద‌ర్శక‌త్వం: బోయ‌పాటి శ్రీను;
విడుద‌ల: 2 డిసెంబ‌ర్ 2021

నట సింహం నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. హ్యాట్రిక్ విజయం కోసం మరోసారి ఈ కాంబినేషన్‌ సిద్ధం కాగా… టీజర్లు, ట్రైలర్లతోనే మరో విజయం భారీ హైప్ సాధించాయి. దాంతో అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బోయపాటికి, బాలకృష్ణకు హ్యాట్రిక్ లభించిందా.. ‘అఖండ‌’ అవ‌తారంలో బాల‌కృష్ణ గ‌ర్జన ఎలా ఉంది? అని తెలుసుకునే ముందు క‌థలోకి వెళ్దాం…

గ‌జేంద్ర సాహు అనే పేరు మోసిన టెర్రరిస్ట్ పోలీసుల ఎన్‌కౌంట‌ర్ నుంచి త‌ప్పించుకుని మ‌హారుద్ర పీఠంను చేరుకుంటాడు. త‌న‌ను ఇబ్బంది పెట్టిన ఈ వ్యవస్థపై ప్రతీకారం తీర్చుకోవాల‌ని పీఠాధిప‌తిని చంపి తానే పీఠాధిప‌తిగా మారుతాడు. అదే స‌మ‌యంలో అనంత‌పురంలో రామచంద్రరాజు అనే వ్యక్తికి మ‌గ క‌వ‌ల‌లు పుడ‌తారు. వారిలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంటే, మ‌రో బిడ్డ ఉలుకు ప‌లుకు లేకుండా ఉంటాడు. అదే స‌మ‌యంలో వారింటిలోకి అడుగు పెట్టిన అఘోరా (జ‌గ‌ప‌తిబాబు) చ‌నిపోయిన బిడ్డను తీసుకెళ్లిపోతాడు. చ‌నిపోయిన బిడ్డ కాశీ విశ్వనాథుడి స‌న్నిధానానికి చేరుకుంటాడు. ప‌ర‌మేశ్వరుడి దయ‌తో ఆ బిడ్డ ఊపిరి పోసుకుంటుంది. కొన్నేళ్ల త‌ర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవార‌వుతారు. అనంత‌పురంలో పెరిగిన బిడ్డ ముర‌ళీకృష్ణ (నంద‌మూరి బాల‌కృష్ణ) ఆ ప్రాంతంలో ఫ్యా్క్షనిజం రూపుమాప‌డానికి ప్రయ‌త్నిస్తుంటాడు. ఆ ప్రాంతంలో స్కూల్స్‌, హాస్పిటల్స్ క‌ట్టించి ప్రజ‌ల‌కు సేవ చేస్తుంటాడు.

ముర‌ళీ కృష్ణ చేసే మంచి ప‌నులు చూసి ఆ జిల్లాకు వ‌చ్చిన కలెక్టర్ శ‌రణ్య (ప్రగ్యా జైశ్వాల్‌) అత‌న్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. మ‌రో వైపు.. అదే ప్రాంతంలో కాప‌ర్ మైనింగ్ వ్యాపారం చేసే వ‌ర‌దరాజులు (శ్రీకాంత్‌)కి, త‌న మైన్‌లో యురేనియం ఉంద‌ని తెలియ‌డంతో దాన్ని వెలికి తీసే ప‌నుల్లో బిజీగా ఉంటాడు. అక్కడ వ‌చ్చే వ్యర్థాల‌ను భూమిలోకి పంపేయ‌డంతో చిన్న పిల్లలు చనిపోతారు. విష‌యం తెలుసుకున్న ముర‌ళీ కృష్ణ ..వ‌ర‌దరాజుల‌కి ఎదురెళ‌తాడు. అప్పుడు ఓ ప్లానింగ్ ప్రకారం జ‌రిగిన ప‌రిస్థితుల న‌డుమ ముర‌ళీ కృష్ణ క‌ట్టించిన హాస్పిట‌ల్‌లో బాంబ్ పేలి మినిస్టర్ చ‌నిపోతాడు. దాంతో ముర‌ళీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీంతో ఒంటరైన శ‌రణ్యను చంప‌డానికి వ‌ర‌ద‌రాజులు ప్రయ‌త్నిస్తాడు. అప్పుడే అఖండ రంగ ప్రవేశం చేస్తాడు. అస‌లు అఖండ ఎవ‌రు? వ‌ర‌ద‌రాజుకి ఎందుకు ఎదురెళతాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

బాల‌కృష్ణ-బోయ‌పాటి కల‌యిక నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో ఆ అంశాల‌న్నీ ప‌క్కాగా కుదిరిన సినిమా ఇది. శివుడు అలియాస్ అఖండగానూ.. ముర‌ళీకృష్ణ పాత్రలోనూ బాల‌కృష్ణ త‌నదైన శైలిలో ఒదిగిపోయారు. అఖండ పాత్రలోనైతే ఆయ‌న రౌద్ర ప్రద‌ర్శన తీరు విశ్వరూపమే. ఇందులోని ఒక పాత్ర ప్రళ‌యాన్ని గుర్తు చేస్తే, మ‌రో పాత్ర ప్రకృతిలా అందంగా తెర‌పై క‌నిపిస్తుంది. కథానాయ‌కుడి ప‌రిచ‌య స‌న్నివేశాలు మొదలుకొని చివ‌రి వ‌ర‌కు ప్రతీ స‌న్నివేశం కూడా బాల‌కృష్ణ మాస్ ఇమేజ్, బోయ‌పాటి మార్క్ థీమ్ మేర‌కు సాగుతుంది. అభిమానుల‌తో ఈల‌లు కొట్టించే ఎలివేష‌న్ స‌న్నివేశాలు అడుగ‌డుగునా ఉంటాయి.

ప్రథ‌మార్థం ముర‌ళీకృష్ణ – శ‌ర‌ణ్యల మ‌ధ్య ప్రేమాయ‌ణం, పీఠాధీశుడిని చంపి శ‌క్తి స్వరూపానంద స్వామిగా అవ‌త‌రించి మైనింగ్ మాఫియాతో చేయించే ఆకృత్యాల నేపథ్యంలో సాగుతుంది. రైతుగా, ఆ ప్రాంత ప్రజ‌ల మేలుని కోరే వ్యక్తిగా ముర‌ళీకృష్ణ పాత్రలో బాల‌కృష్ణ ఆక‌ట్టుకుంటారు. ప్రకృతి గురించి ఆయ‌న చెప్పే సంభాష‌ణ‌లు అల‌రిస్తాయి. జై బాల‌య్య పాట కిక్కెక్కిస్తే, అడిగా అడిగా.. పాట‌లో బాల‌కృష్ణ – ప్రగ్యా జోడీ చూడ‌ముచ్చట‌గా క‌నిపిస్తుంది. ఒకే పాట‌లోనే నాయ‌కానాయిక‌ల‌కి పెళ్లి కావ‌డం, పాప పుట్టడం, ఆ పాప ప్రోద్భలంతోనే రెండో పాత్ర అఖండని ప‌రిచ‌యం చేసిన తీరు బాగుంది. ద్వితీయార్థానికి ముందు అఖండ పాత్ర ఆగ‌మ‌నం జ‌రుగుతుంది. సినిమా అక్కడిదాకా ఒకెత్తు.. అఖండ పాత్ర ప్రవేశం త‌ర్వాత మ‌రో ఎత్తు. ప్రకృతి, చిన్నారులు, ముక్కంటి జోలికి వ‌చ్చిన ప్రతినాయ‌కుడిని అఖండ ఎలా అంతం చేశాడ‌నేది ద్వితీయార్థంలో కీల‌కం. బాల‌కృష్ణ చేసిన రెండో పాత్రని అఘోరాగా చూపించ‌డం సినిమాకి ప్లస్సయ్యింది. అఖండ శివుడి అంశ‌తోనే పుట్టాడ‌నే సంకేతాలు క‌నిపిస్తాయి కాబ‌ట్టి ఆ పాత్రలో బాల‌కృష్ణ ఎన్ని విన్యాసాలు చేసినా న‌మ్మేలా ఉంటాయి. ఆయ‌న చెప్పే ప్రతీ సంభాష‌ణ ఓ పోరాటంలా, ప్రతీ పోరాటం ఓ క్లైమాక్స్ స‌న్నివేశాన్ని తల‌పించేలా ఉంటుంది.

బాల‌కృష్ణని బోయ‌పాటి శ‌క్తిమంతంగా చూపిస్తార‌ని తెలుసు.. కానీ ఇందులో డోస్ మ‌రింత పెంచారు. ఇందులో క‌థ కంటే కూడా పాత్రల్ని మ‌లిచిన తీరే ఆక‌ట్టుకుంటుంది. దేవుడు, విజ్ఞానానికీ మ‌ధ్య సంబంధం గురించి, హిందుత్వం గురించీ, బోత్ ఆర్ నాట్ ది సేమ్ అని.. శివుడు మామూలు మ‌నిషి కాదంటూ బాల‌కృష్ణ చెప్పే సంభాష‌ణ‌లు సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయి. చిన్నారులు, దేవాల‌యాలు, దేవుడు, ప్రకృతి త‌దిత‌ర అంశాల నేప‌థ్యంలో అక్కడ‌క్కడా భావోద్వేగాలు పండాయి. మొత్తంగా మాస్ ప్రేక్షకుల్ని ఉత్సాహంగా థియేట‌ర్లకి ర‌ప్పించే ప‌క్కా పైసా వ‌సూల్ చిత్రమిది.

బాల‌కృష్ణ వ‌న్ మేన్ షోలా ఉంటుందీ చిత్రం. ఆయ‌న డైలాగులు విన్నాక.. చేసే విన్యాసాలు చూశాక బాల‌కృష్ణ మాత్రమే చేయ‌గ‌ల క‌థ అనిపిస్తుంది. జై బాల‌య్య పాట‌లో ఆడిపాడిన తీరు అభిమానుల్ని అల‌రిస్తే, ఆయ‌న చేసిన పోరాటాలు మ‌రో స్థాయిలో ఉంటాయి. బాల‌కృష్ణ రెండు పాత్రల్లో విజృంభించిన‌ప్పటికీ.. ఇందులోని మిగ‌తా పాత్రల‌కి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. క‌థానాయిక ప్రగ్యా జైస్వాల్‌తో పాటు పూర్ణ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా సినిమాలో కీల‌క‌మైన‌వే. ‘లెజెండ్‌’తో జ‌గ‌ప‌తిబాబుని ప్రతినాయ‌కుడిగా మార్చిన బోయ‌పాటి శ్రీను.. ఈ సినిమాతో శ్రీకాంత్‌ని అలాంటి పాత్రలోనే చూపించారు. వ‌ర‌ద రాజులుగా క్రూర‌మైన పాత్రలో ఆయ‌న క‌నిపిస్తారు.

బాల‌కృష్ణతో తొలిసారి ఎదురుప‌డే స‌న్నివేశం, అఘోరాతో త‌ల‌ప‌డే స‌న్నివేశాలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉంటాయి. జ‌గ‌ప‌తిబాబు, కాల‌కేయ ప్రభాక‌ర్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. శ‌క్తిస్వరూపానంద స్వామిగా క‌నిపించిన ప్రతినాయ‌కుడు కూడా త‌న‌దైన ప్రభావం చూపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా త‌మ‌న్ సంగీతం సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. అఘోరా నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో నేప‌థ్య సంగీతం కోసం ఆయ‌న ప‌డిన క‌ష్టం తెలుస్తుంది. రామ్‌ప్రసాద్ కెమెరా ప‌నిత‌నం, ఎం.ర‌త్నం మాట‌లు చిత్రానికి ప్రధాన బ‌లాలుగా నిలిచాయి. రామ్‌ల‌క్ష్మణ్‌, స్టంట్‌ శివ పోరాట ఘ‌ట్టాలు మెప్పిస్తాయి. బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక ఎందుకు ప్రత్యేక‌మో ఈ సినిమా మ‌రోసారి స్పష్టం చేస్తుంది. మాస్ నాడి బాగా తెలిసిన బోయ‌పాటి త‌నదైన మార్క్‌ని ప్రద‌ర్శిస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే, భావోద్వేగాలు కూడా బ‌లంగా పండేలా సినిమాని తీర్చిదిద్దారు. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బాలయ్య అభిమానులు ఆయన్నుంచి ఏం ఆశిస్తారో అన్నీ ‘అఖండ’లో ఉన్నాయి.


Akhanda Trailer: బాలయ్య ‘అఖండ’ గర్జన.. ద్విపాత్రాభినయంతో విశ్వరూపం

సింహా’, ‘లెజెండ్‌’.. సూపర్‌ హిట్ చిత్రాలతో క్రేజీ కాంబినేషన్‌గా మారారు నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను. వీరి కలయిలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘అఖండ’. ఈ సినిమాపై అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, పైగా అఘోరాగా కనిపించనున్నట్లు తెలిసినప్పటి నుంచీ ఆ ఆసక్తి మరింత పెరిగింది. పోస్టర్లు, టైటిల్‌ గీతం విశేషంగా ఆకట్టుకోవడంతో ట్రైలర్‌ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర బృందం ఆ కానుకను అందించింది. ‘అఖండ రోర్‌’ పేరుతో ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేసింది.

బాలకృష్ణ అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. బాలకృష్ణ లుక్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్‌ సందడి చేయనుంది. జగపతిబాబు, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

‘నాకు బురద అంటింది.. నాకు దురద వచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది.. గడ్డ వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే’ అంటూ శ్రీకాంత్ కూడా తన విలనిజాన్ని చూపించారు. జగపతి బాబు కూడా కొత్త గెటప్పులో కనిపించాడు. శ్రీకాంత్ నిజంగానే భయపెట్టేశాడు. ట్రైలర్స్‌లో డైలాగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. రెండు గెటప్స్‌లో బాలకృష్ణ కనిపించి మెప్పించారు. తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. మిర్యాల రవిందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సీ రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.