నవ్య నివేదన అష్టముఖ షోడశ బాహు నారసింహుడు
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
‘ధ్యాయో యధా మహత్కర్మ తథా షోడశహస్తవాన్
నృసింహః సర్వలోకేశః సర్వాభరణభూషితః’
అంటుంది ‘విష్ణుకోశం’ లోని నరసింహ ధ్యాన శ్లోకం. దాన్ని ప్రతిబింబించేలా నారసింహడు దర్శనమిచ్చే ప్రదేశం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కోట్ల నరసింహులపల్లె.
శ్రీ నారసింహుడు బహురూపాల్లో పూజలందుకుంటూ ఉంటాడు. దేశ వ్యాప్తంగా రెండు చేతుల నుంచి ముప్ఫై రెండు చేతుల వరకూ ఉన్న నృసింహ మూర్తులు కనిపిస్తాయి. లక్ష్మీ సహితంగా, యోగానందరూపుడిగా, హిరణ్యకశ్యప సంహారమూర్తిగా, ఉపాసనమూర్తిగా… ఇలా వివిధ రూపాల్లో ఆయన కొలువుతీరి ఉంటాడు. వీటిలో… ఎనిమిది ముఖాలతో, పదహారు చేతులతో ఉండే అరుదైన శిల్పం.. కోట్ల నరసింహులపల్లెలో దర్శనమిస్తుంది.
నరహరి, చెంచులక్ష్మి కథ సుప్రసిద్ధం. శ్రీ నారసింహుణ్ణి గిరిజనులు అమితమైన భక్తితో ఆరాధిస్తారు. కొండల్లో, గుహల్లో, రాతిగుండ్లమీద వ్యక్తమైన రూపాలను నరసింహస్వామిగా వారు పూజిస్తారు. కరీంనగర్ ప్రాంతంలో అనేక నారసింహ క్షేత్రాలున్నాయి. కోట్ల నరసింహులపల్లెలోని దేవునిగుట్టమీద ఉన్న నృసింహ శిల్పం … శిల్పకళా శైలి రీత్యా… రాష్ట్రకూటుల (క్రీస్తు శకం ఏడు నుంచి పదో శతాబ్దం మధ్య) కాలానికి చెందినది. ఈ గ్రామంలోని కోట ఆనవాళ్ళని పరిశీలిస్తే… వివిధ కాలాల్లో నిర్మించిన వేర్వేరు కట్టడాలు కనిపిస్తాయి. కాగా, ఇదే చోట రాష్ట్రకూటుల కాలానివిగా పరిగణిస్తున్న లక్ష్మీ నరసింహ, విశ్వనాథ ఆలయాలు, కళ్యాణీ చాళుక్యులు, కాకతీయుల కాలాల్లో నిర్మించిన మల్లికార్జున, సోమనాథ, వీరభద్ర ఆలయాలు ఉన్నాయి. అయితే, దేవునిగుట్ట మీద నరసింహస్వామి అపురూప శిల్పం వల్లా, ఇక్కడ ఉన్న కోటల కారణంగా ఈ గ్రామానికి కోట్ల నరసింహులపల్లె అనే పేరు వచ్చింది.
కాలక్రమేణా కొండమీద ఉన్న ఆ శిల్పం దెబ్బతింటూ వస్తోంది. కొన్ని తలలు మాత్రమే స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. రెండు చేతులు హిరణ్యకశ్యపుని పొట్ట చీల్చుతున్నట్టూ, మిగిలిన చేతుల్లో ఆయుధాలున్నట్టూ కనిపిస్తోంది. ఆయుధాల వివరాలు స్పష్టంగా లేవు. ఎల్లోరాలోని దశావతార గుహలో, కాంచీపురంలోని వైకుంఠ పెరుమాళ్ గుడిలో ఉన్న శిల్పాలకూ దీనికీ పోలికలు ఉన్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. కోట్ల నర్సింహులపల్లెలో శాసనాధారాలు దొరక్కపోవడం వల్ల…. ఇక్కడి దేవాలయ నిర్మాణాలను ఆధారం చేసుకొనే కాలనిర్ణయం చేయాల్సి వస్తోంది.
నరసింహాలయానికి ఎదురుగా సీతారామాలయం, దానికి అవతల 16 స్తంభాల అర్థమండపం, శంకరాచార్యులు దర్శించినట్టు స్థానికులు విశ్వసించే విశ్వనాథాలయం, దాని పక్కన పూల కోనేరు ఉన్నాయి. జైన మతం కూడా ఈ ప్రాంతంలో వర్థిల్లింది. ఇరువైపులా యక్ష, యక్షిణులతో, ఏడు పడగల సర్పం గొడుగుపట్టిన పార్శ్వనాథుడి దిగంబర శిల్పం, ఋషభనాథుడి ధ్యానాసన శిల్పం, ఇటీవలే ధ్యానముద్రలోని వర్ధమాన మహావీరుడి శిల్పం ఈ ప్రాంతంలోని పొలాల్లో బయటపడ్డాయి. 1885లో కల్వకోట కృష్ణయ్య (రామడుగు) దేశపాండ్యకు నరసింహస్వామి కలలో దర్శనమిచ్చి, తనకు గుడి కట్టాలని ఆదేశించినట్టు గుడి దగ్గర కల్వకోట కీర్తికుమార్ వేయించిన శిలాఫలకం మీద ఉంది. ఆ వంశస్తులే ధర్మకర్తలుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నుంచి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహిస్తారు. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, నృసింహ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతాయి.