‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గ్రాండ్‌ సీన్‌ మేకింగ్.. అదిరిపోయే వీడియో

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గ్రాండ్‌ సీన్‌ మేకింగ్.. అదిరిపోయే వీడియో

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు ‘వావ్‌’ అనిపించేలా గ్రాండ్ లెవల్‌లో ఉంటాయి. హీరోలిద్దరి పరిచయ సన్నివేశాలు.. అందులోనూ తారక్‌ ఎంట్రీ సీన్‌ అయితే చెప్పడానికి మాటలు సరిపోవు. చిట్టడవిలో పెద్దపులితో భీకర పోరాటం చేస్తూ ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇస్తుంటే.. థియేటర్‌లో ఫుల్‌ సౌండ్‌లో ఆ సీన్‌ చూసిన ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే అతిశయోక్తి కాదు.

అయితే ఈ సీన్‌ని ఎలా చిత్రీకరించారో తెలియజేస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తాజాగా మేకింగ్‌ వీడియో షేర్‌ చేసింది. నిమిషం నిడివి గల ఈ వీడియోలో మొదట సినిమా సీన్‌ని చూపించి.. తర్వాత దాన్ని ఎలా తీర్చిదిద్దారో తెలియజేశారు. తారక్‌పై దాడి చేసేందుకు పులి ఎలా ముందుకు ఉరుకుతుంది? పంజా విసిరేందుకు ఏవిధంగా ప్రయత్నిస్తుంది? ఇలా ప్రతి విషయాన్ని జక్కన్న క్షుణ్ణంగా తెలియజేస్తూ కనిపించారు. ప్రస్తుతం వీడియో మూవీ లవర్స్‌ని బాగా ఆకర్షిస్తోంది. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రామ్‌చరణ్‌ అల్లూరి సీతా రామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా మెప్పించారు.


60 వసంతాల ‘గుండమ్మ కథ’.. తెరవెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు

విజయా సంస్థ నిర్మించిన చిత్రాల్లో ఆఖరి విజయవంతమైన చిత్రం ‘గుండమ్మ కథ’. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్. కాని “గుండమ్మ కథ” అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి. జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత, వాహినీ స్టూడియోస్ అధినేత బి.నాగిరెడ్డి సహకారం పొందారు. ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విఠలాచార్య ఆయనకి ఇచ్చేశారు.
మనె తుంబిద హెణ్ణు సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి, నోరుమెదపలేని భర్త ఉంటాడు. ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలుపక్షికి ఇచ్చి పెళ్ళిజరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు. ఇలా సాగుతుంది ఆ సినిమా. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ, నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. దాంతో విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ రీమేక్ చేసేందుకు సిద్ధపడ్డారు.

కథలో చిన్న చిన్న మార్పులు చేసి డి.వి.నరసరాజుతో మాటలు రాయించేశారు నాగిరెడ్డి. సినిమాకు దర్శకునిగా నాగిరెడ్డి సోదరుడు బి.ఎన్.రెడ్డిని అనుకున్నారు. అయితే బి.ఎన్.రెడ్డి కళాత్మక చిత్రాల తరహా దర్శకుడు కావడమూ, ఇది ఆయన తరహా సినిమా కాకపోవడంతో పాటు బి.ఎన్.రెడ్డి లాంటి అగ్ర దర్శకుడు ఓ రీమేక్ సినిమా చేస్తే బాగోదన్న అనుమానం రావడంతో నాగిరెడ్డే వేరే దర్శకునితో చేద్దామని నిర్ణయించుకున్నారు. పి.పుల్లయ్య దర్శకత్వం వహిస్తే బావుంటుందని, ఆయనకు నరసరాజు సిద్ధం చేసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపారు. అది చదివిన పుల్లయ్య ఈ కథ, ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు అని ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దాంతో సినిమా నిర్మాణం మళ్ళీ వెనుకబడింది. ఈ స్క్రిప్ట్ తన సన్నిహితుడు, సహ నిర్మాత, రచయిత అయిన చక్రపాణికి ఇచ్చారు నాగిరెడ్డి. చక్రపాణికి వికలాంగులు, పిచ్చివాళ్ళతో హాస్యం చేస్తూ సీన్లు నడపడం అంతగా నచ్చదు. దాంతో హీరో పిచ్చివాడు కావడమే ప్రధానమైన పాయింట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చలేదు. కానీ గుండమ్మ కుటుంబ వ్యవహారాలు, ఆ పాత్రలు బాగా నచ్చిన నాగిరెడ్డి మాత్రం ఎలాగైనా సినిమా తీయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. దాంతో చక్రపాణి మొత్తం స్క్రిప్టును తిరగరాసే పనిలో పడ్డారు. విలియం షేక్‌స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని చక్రపాణి కథను తిరగరాశారు.

సినిమాకు దర్శకునిగా చివరకు కమలాకర కామేశ్వరరావుని ఎంచుకున్నారు నాగిరెడ్డి. తర్వాత చక్రపాణి తిరగరాసిన కథకు ట్రీట్మెంట్, సీనిక్ ఆర్డర్ కోసం కథాచర్చలకు చక్రపాణితో, కమలాకర కామేశ్వరరావు, డి.వి.నరసరాజు కూర్చున్నారు. ఆ చర్చల్లో భాగంగా అప్పటివరకూ ఉన్న గుండమ్మ భర్త పాత్రను తీసేసి గుండమ్మను వైధవ్యం అనుభవిస్తున్నదానిగా చూపిద్దామని నిర్ణయించారు చక్రపాణి. అయితే కళకళలాడుతూ, నగలతో పసుపుకుంకుమలతో గుండమ్మను చూపిద్దామనుకున్న దర్శకుడు కామేశ్వరరావు ఆశాభంగం చెందారు. కానీ చక్రపాణి స్క్రిప్ట్ రచయితగా కథకు ఉపయోగపడని, కథలో మలుపులకు కారణం కాని పాత్ర వ్యర్థమన్న దృష్టితో “పెళ్ళానికి సమాధానం చెప్పలేని వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ పాత్ర మన కథకు అనవసరం” అంటూ తేల్చి, పాత్రను తొలగించేశారు. అయితే మిగతా గుండమ్మ కుటుంబాన్నంతా యధాతథంగా తీసుకున్నారు.

సినిమా కథని చక్రపాణి తిరగరాసిన తర్వాత మాటల రచయిత నరసరాజు, దర్శకుడు కామేశ్వరరావు, స్క్రీన్ ప్లే రచయిత చక్రపాణిల మధ్య జరిగిన కథాచర్చల్లో నటీనటుల ఎంపిక జరిగింది. ఆ చర్చల్లోనే వెంటనే ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తీసుకుందామని నిర్ణయించుకున్నారు. సినిమా అనుకున్ననాడే గుండమ్మ పాత్రకు సూర్యకాంతం అయితేనే సరిపోతారని భావించారు. గుండమ్మ నిజానికి తెలుగుపేరు కాదు కన్నడపేరు. కన్నడంలోని ఈ సినిమా మాతృకలో ఓ పాత్ర పేరు గుండమ్మ. కథను తిరగరాసే క్రమంలో ఆ గుండమ్మ పాత్రను ప్రధానపాత్రగా చేసుకున్నారు. ఆ పాత్రకు ఏ పేరుపెట్టాలా అని తర్జనభర్జనలు పడుతుంటే, మరో పేరు ఎందుకు గుండమ్మ అన్న పేరే పెట్టేద్దామని నిర్ణయించారు చక్రపాణి. అంత కీలకమైన పాత్రకి పెట్టే పేరు తెలుగుపేరు కాకపోవడమా అన్న సందేహాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తే, “ఇందులో ఏముంది, పెడితే అదే తెలుగు పేరు అవుతుంది” అని కొట్టిపారేసి గుండమ్మ అన్న పేరు ఖాయం చేసేశారు.

సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు. గుండమ్మ కథ సినిమాని విజయా నిర్మాతలకు చెందిన వాహినీ స్టూడియోస్ లో నిర్మించారు. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా మార్కస్ బార్ట్లే వ్యవహరించారు. చిత్రీకరణలో అవసరమైన సెట్ లను కళాదర్శకులుగా వ్యవహరించిన గోఖలే, కళాధర్ వేశారు. మేకప్ ఎం.పీతాంబరం, టి.పి.భక్తవత్సలం వేశారు.

సినిమాలో ముఖ్యపాత్రలు చేసిన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం తదితరులు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు. వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేవి కాదు. కాల్షీట్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకూ అలా కుదిరిన కొన్ని డేట్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు. ఏ షాట్, ఎవరెవరి కాంబినేషన్లో షాట్ తీయాలన్నా సమస్య లేకుండా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్నారు. విజయా వారికి చెందిన వాహినీ స్టూడియోలో గుండమ్మ ఇంటి సెట్ వేసివుంచారు. రోజూ ఉదయం చక్రపాణి ఆఫీసుకు వచ్చేసి రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, ఎస్వీఆర్ మొదలై నటులకు ఫోన్ చేసేవారు. ఫోన్లో ఆరోజు వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కునేవారు. ఒకవేళ ఎవరైనా ఈరోజు షూటింగ్ కి వెళ్ళాలి అంటే సరేనని తర్వాతి రెండ్రోజుల సంగతి తెలుసుకుని ఫోన్ పెట్టేసేవారు. మరెవరైనా ఆ రోజు ఖాళీగా ఉన్నానంటే పిలిపించేవారు. వచ్చినవాళ్ళలో స్క్రిప్ట్ ని బట్టి వాళ్ళ మధ్య కాంబినేషన్ సీన్లు చూసుకుని వాళ్ళతో షూటింగ్ చేసేవారు. సినిమాలో “కోలో కోలోయన్న” పాట ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జమున జంటలు పక్కపక్కనే ఉండి పాడుకుంటున్నట్టు చూపించారు. కానీ నలుగురు ఒకేసారి కలిసి చేయనేలేదు. ఎవరికి ఎప్పుడు ఖాళీవుంటే వారితో అప్పుడు పాటను తీసేశారు. ఎడిటింగ్‌లో ఆ తేడాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీగా ఎ.కృష్ణన్, సౌండ్ ఇంజనీర్ గా వి.శివరాం వ్యవహరించారు. గుండమ్మకథను జి.కళ్యాణసుందరం ఎడిటింగ్ చేయగా ఆయనకు సహాయకునిగా డి.జి.జయరాం వ్యవహరించారు. సినిమా రీల్ ని విజయా లేబొరేటరీస్ లో ప్రాసెస్ చేశారు. సినిమాలో పలు సన్నివేశాల్లో నటించిన నటులంతా లేకున్నా దొరికిన వారితో దొరికినట్టుగా తీసేశారు. దాంతో ఆ తేడా తెలియకుండా ఎడిటింగ్ లో జాగ్రత్తలు తీసుకున్నారు. గుండమ్మకథ సినిమా జూన్ 7, 1962న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.



సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు. చివరికి విజయా వారి నిర్మాణంలో మాయాబజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు. ప్రివ్యూ తర్వాత నరసరాజుకు తన అభిప్రాయాన్ని చెప్తూ “అదేం కథండీ! కృష్ణా, గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా వుంది. చక్రపాణి గారే రాయగలరు అలాంటి కథలు. మీరు రాసిన డైలాగులు బాగున్నాయనుకోండి. ఒక్క డైలాగులతోనే పిక్చర్ నడుస్తూందా” అన్నారు. సినిమా విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు- విజయా వారి సినిమా, పెద్ద నటీనటులు నటించారు. మొదట్లో హౌస్ ఫుల్ అవుతాయి. పోగాపోగా చూద్దాం అనేవారు. సినిమా ఘన విజయమని స్థిరపడిపోయాకా కూడా ఆయన సమాధాన పడలేదు, ఏంటోనండి. జనం ఎందుకు చూస్తున్నారో అర్థంకావట్లేదు అంటూ గుండమ్మకథ ప్రస్తావన వచ్చినపపుడల్లా అనేవారు.
.
సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే “ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్” అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది.


ముఖ్యమంత్రి హోదాలో పెళ్లి పెద్దగా మారిన NTR

నందమూరి తారకరామారావు.. ఆ చంద్ర తారార్కం తెలుగు ప్రజల గుండెల్లో విరాజిల్లే ఆరాధ్యమూర్తి… వెండితెర చరిత్రలో అజరామరమైన ఆయన నటనా ప్రస్థానం మనందరికీ తెలుసు. ఆ యుగపురుషుడి రాజకీయ జీవితం అందరికీ ఎరుకే. కానీ ఎన్టీఆర్‌ స్వయంగా ఓ పెళ్లికి పౌరోహిత్యం వహించారన్న సంగతి అతి తక్కువమందికి మాత్రమే తెలిసిన విషయం. అదీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో పెళ్లి పెద్దగా వ్యవహరించడం విశేషం. ఆయన పౌరహిత్యంలో ఒక్కటైన ఆనాటి వధూవరులు నాగభైరవ వీరబాబు, పద్మజ దంపతులు. ఎన్టీఆర్‌ అరుదైన ఆ సంఘటన గురించిన విశేషాలివి..

జూలై 7, 1988… ఉదయం 6గంటల 40 నిమిషాలకు వివాహ ముహూర్తం… ఒంగోలు పట్టణం రాంనగర్‌లోని టొబాకో సంస్థ ప్రాంగణంలో కళ్యాణ వేదిక. ఆ ప్రదేశమంతా 10 వేల మంది జనాభాతో కిక్కిరిసిపోయి ఉంది. ఆ క్షణం అందరి కళ్లు ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాయి. వారంతా వధూవరుల బంధుమిత్రులు కారు. ఆ పెళ్లికి అతిథిగా హాజరవుతున్న తమ ప్రియతమ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును కనులారా చూసిపోదామని అక్కడికి విచ్చేసిన జనవాహిని. ముహూర్తం సమయం ఆసన్నమైంది. అన్నగారు వివాహ మండపంలోకి అడుగుపెట్టారు. వధూవరులను ఆశీర్వదించడానికి హాజరైన ఎన్టీఆర్‌ ‘‘కవి గారూ’’ అంటూ నాగభైరవ కోటేశ్వరరావు (పెళ్లికొడుకు తండ్రి)ని దగ్గరకు పిలిచి చెవిలో ఏదో చెప్పారు. అంతే అక్కడ సీన్‌ మొత్తం మారిపోయింది.

అప్పటిదాకా వేదికపై ఉన్న పురోహితుడు వేదిక దిగాడు. ఆయన స్థానంలో ఎన్టీఆర్‌ ఆశీనులయ్యారు. అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. సర్వత్రా ఏం జరగబోతోందనే ఉత్కంఠ. ఎన్టీఆర్‌ మైక్‌ అందుకున్నారు. ‘‘సంస్కృతంలో ఉన్న వివాహ మంత్రాల అర్థం వీరికి తెలీదు. భార్యాభర్తల అన్యోన్యత, దాంపత్యం గురించి వివరించే ఆ మంత్రాల పరమార్థాన్ని మనకు అర్థమైన తెలుగులో చెప్పి ఈ పెళ్లి నేనే జరిపిస్తాను’’ అన్నారు.

ఆ గంట ఏం జరిగిందో గుర్తులేదు..!
ఎన్టీఆర్‌ తన వివాహానికి స్వయంగా పౌరహిత్యం చేసి 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆ విశేషాలను నాగభైరవ వీరబాబు గుర్తుచేసుకున్నారు. ‘‘మా నాన్న నాగభైరవ కోటేశ్వరరావు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాకు మాటల రచయితగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో 60 రోజులు కలిసి ఉన్నారు కూడా. సాహిత్యాభిలాషి, తెలుగు భాషా ప్రేమికుడైన ఎన్టీఆర్‌ మా నాన్నను ప్రేమగా ‘కవిగారు’ అని పిలిచేవారు. ఆయనపై ఉన్న ఆత్మీయతతో ఆహ్వానించగానే నా పెళ్లికి విచ్చేశారు. అప్పుడు మా జిల్లా కలెక్టరుగా డా. జయప్రకాశ్‌ నారాయణ ఉన్నారు. ఎన్టీఆర్‌ను దగ్గరి నుంచి చూస్తే చాలనుకునేవాళ్లం. అలాంటిది ఆయనే స్వయంగా నా పెళ్లి జరిపిస్తుండటంతో ఆ సమయంలో ఏదో తెలియని భావన నాలో కలిగింది.
ఆ తన్మయత్వంలో గంటసేపు ఏం జరిగిందో కూడా గుర్తులేదు’’ అన్నారాయన. ఆ రోజు సంఘటనను వీరబాబు సతీమణి పద్మజ గుర్తు చేసుకుంటూ ‘‘అప్పుడు నాకు 19 ఏళ్లు. కళ్యాణ మంటపం మీద మేమిద్దరం, తాతయ్య, ఎన్టీఆర్‌… అంతే. ఇంకెవ్వరినీ అనుమతించలేదు. వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని, సప్తపది, తాళి పరమార్థాన్ని అచ్చమైన తెలుగులో వివరించారాయన. మా చేత పెళ్లి ప్రమాణాలు చేయించారు. ‘ఆ! మేలగాళ్లు కానివ్వండి.!’’ అంటూ ఆయనే స్వయంగా బాజాభజంత్రీలను పురమాయించారు. ఎన్టీఆర్‌ గారు పెళ్లి మంత్రాలన్నింటినీ కంఠతా ఆలపించడం విశేషం. ఆయన పురోహితుడుగా వ్యవహరించిన తొలి, తుది పెళ్లి మాదే కావడం మాకు దక్కిన అదృష్టం’’ అన్నారామె.

కవిరాజు ‘వివాహ విధి’
త్రిపురనేని రామస్వామి చౌదరి రచించిన ‘వివాహ విధి’ గ్రంథం ఆధారంగా ఎన్టీఆర్‌ వివాహ మంత్రాల అర్థాన్ని వివరిస్తూ, విపులీకరిస్తూ వధూవరులతో ప్రమాణాలు చేయించారు. సప్తపది, జిలుకర బెల్లం, మంగళసూత్రధారణ పవిత్రను, పరమార్థాన్ని వివరించి పెళ్లితంతు జరిపారు. అనంతరం వేదిక కింద ఉన్న అతిధులంతా అక్షితలను వధూవరులపైకి విసురుతున్నారు. అప్పుడు ‘‘మనమంతా అక్షింతలు అంటాం. కానీ అక్షితలు అనాలి. వాటిని వధూవరులపై దయచేసి అలా విసరకండి. ఒక్కొక్కరుగా వచ్చి నిండు మనస్సుతో నవ దంపతులను ఆశీర్వదించండి.!’’ అని సూచించారు. ఎన్టీఆర్‌ 45 నిమిషాల పాటు మండపంపై ఆశీనులై కళ్యాణ క్రతువులోని ప్రతి ఘట్టాన్ని, దానివెనుకున్న పరమార్థాన్ని వివరిస్తూ పౌరహిత్యం చేశారు.


ఆ సమయంలో ‘ఆంధ్రజ్యోతి’ ఒంగోలు పాత్రికేయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏవీఎస్‌ (తర్వాత హాస్యనటుడుగా మారారు)ఆ వార్తను రాశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ని ఆయన సన్నిహితులు చాలామంది పెళ్లి పెద్దగా హాజరవ్వాల్సిందిగా విన్నవిస్తే ‘‘కవిగారిపై నాకున్న అభిమానంతో వారి కుమారుడి వివాహానికి పౌరోహిత్యం చేశాను. ఆ అవకాశం వారికి మాత్రమే సొంతం’’ అని అన్నట్లు ‘నందమూరితో నా అనుభవాలు’ పుస్తకంలో నాగభైరవ కోటేశ్వరరావు రాశారు.


RRR ట్రైలర్.. విజువల్ విస్ఫోటనం.. మాస్ మాయాజాలం

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌- రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్‌ గురువారం ఉదయం విడుదలైంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్‌ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్ (RamCharan)‌, కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR) నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. ‘‘భీమ్‌.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం మొదటిసారి రామ్‌చరణ్‌ – తారక్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇందులో ఆమె చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌.. తారక్‌కు జంటగా నటించారు. దక్షిణాది, బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పాన్‌ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


శ్రీదేవి కూతురుతో ఎన్టీఆర్ రొమాన్స్.. వాట్ ఎ కాంబినేషన్!

యంగ్ టైగర్ యన్టీఆర్, కొరటాల శివ కలయికలోని రెండో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. #NTR30 గా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో సామాజిక సందేశం అందించేదిగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ విషయమై కొంతకాలంగా రూమర్స్ గుప్పుమంటున్నా యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొద్దిరోజులుగా కథానాయికగా కియారా అద్వానీ పేరు వినిపించగా… తాజా సమాచారం ప్రకారం ఇందులో అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్‌‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త నందమూరి అభిమానులతో పాటు శ్రీదేవి అభిమానులను ఖుషీ చేస్తోంది. నిజానికి జాన్వీని సౌత్ నుంచే హీరోయిన్‌గా పరిచయం చేయాలని శ్రీదేవి అనుకున్నా సాధ్యం కాలేదు. కొరటాల శివ సినిమాతో అది ఇన్నాళ్ళకు సాధ్యం కానుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ స్ర్కిప్ట్ వర్క్ మీద ఉన్నారని సమాచారం. యన్టీఆర్ సూచించిన స్వల్ప మార్పుల్ని సవరిస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 22న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. జనతా గ్యారేజ్ యన్టీఆర్, కొరటాల కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.