Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
ఫ్యాన్స్‌కి మంచి కిక్… భీమ్లానాయక్ డీజే సాంగ్ వచ్చేసింది
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 31కి ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే డీజే సాంగ్ ను వదిలింది. ఇటీవల రిలీజైన “లా లా భీమ్లా” పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో శుక్రవారం డీజే వెర్షన్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాటను రాయగా..అరుణ్ కౌండిన్య పాడగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న భీమ్లానాయక్ ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె. చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2022, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, పాటలు సినిమా అంచనాలను భారీగా పెంచేశాయి.
‘భీమ్లా నాయక్’ చిత్రానికి రన్ టైమ్ లాక్ చేసినట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది. ఇందులో స్పెషల్ సాంగ్స్, ఇంట్రడక్షన్ సాంగ్స్ అలాగే సినిమాకు అనవసరమైన సన్నివేశాలు ఏవీ లేకుండా 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేసినట్లు లేటెస్ట్ న్యూస్. సంక్రాంతి బరిలో రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రన్ టైమ్ మూడు గంటలకు పైగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, ప్రభాస్ – పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ రన్ టైమ్ కూడా ఎక్కువే అని సమాచారం. వీటితో పోల్చుకుంటే ‘భీమ్లా నాయక్’ తక్కువని అంటున్నారు. అంతేకాదు ఈ రన్ టైమ్ మూవీకి బాగా ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి మరి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో దిగనుంది. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నిర్మాతలు.. విడుదల తేదీ మార్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని సమాచారం. సాగర్ కె.చంద్ర ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా సంక్రాంతి రేసులో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలకు పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా అదే సమయంలో విడుదల కానుండటంతో ‘భీమ్లా నాయక్’ విడుదల తేదీ మార్చాలని పవన్‌ను కోరుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు భీమ్లా నాయక్ సినిమాకు 95 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. ఏపీలో టికెట్ రేట్ల తగ్గించడంతో ఆ ఏరియాకు తక్కువ ధరకే హక్కులు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ‘భీమ్మా నాయక్’ నిర్మాతలకు సుమారు రూ.10కోట్ల వరకు ఆదాయం తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
★ దేశంలో అడుక్కునే వాడికి అన్నం దొరుకుతుంది. కష్టపడే వాడికి నీడ దొరుకుతుంది. కానీ పేదవాడికి మాత్రం న్యాయం దొరకడం లేదు
★ ఆశకి, భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్లవి. వాళ్లు నన్ను పట్టించుకోకపోయినా నేను వాళ్లను పట్టించుకుంటాను.
★ ఓటమి అంటే అవమానం కాదు. మనల్ని మనం గెలుచుకునే అవకాశం.
★ నాకు కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు.
★ రాముడు అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా సంతోషంగానే ఉంటాడు. కానీ భక్తులే బాధపడతారు.
★ న్యాయం కోసం పోరాడేటప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది.
★ ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఆమె వేసుకునే దుస్తుల్లో, చేసే పనుల్లో, ఆమె ప్రవర్తన బట్టి అంచనా వేయడం తప్పు. వాళ్లకు నచ్చినట్లు వాళ్లు ఉండటం ప్రాథమిక హక్కు.
★ ఆడది అంటే బ్రాతూమ్‌లో ఉండే బొమ్మ కాదు. నిన్ను కనిపెంచిన అమ్మ కూడా. చీడ పురుగులు మగవాళ్ల తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ల మీద కొడితే ఎలా?
★ ఆశతో ఉన్నవాడే గెలుపు, ఓటములు గురించి ఆలోచిస్తాడు. ఆశయంతో ముందుకు వెళ్లే వాడికి కేవలం ప్రయాణం గురించి మాత్రమే ఆలోచన ఉంటుంది.
★ నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా.. కానీ దాని బలం ముందు ఎవ్వరైనా తతలొగ్గాల్సిందే.. నువ్వు గెలుపు కోసం వచ్చావ్.. నేను న్యాయం కోసం వచ్చా.
★ మన ఇంట్లో ఉండే గడియారంలో చిన్న ముల్లు కూడా అమ్మాయి క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తుంది. రాత్రిపూట ఓ అమ్మాయి ఒంటరిగా వెళ్తే.. బైకులు, కార్లు, ఆటోలు అన్నీ స్లో డౌన్ అవుతాయి. సైడ్ మిర్రర్లు కిందికి దిగుతాయి. జిరాఫీల్లా తలలు పొడుచుకొస్తాయి. చూపులు సూదులవుతాయి. అబ్బాయిలు బయటికొస్తే సరదా.. అమ్మాయిలు బయటికొస్తే మాత్రం తేడా
★ మద్యం తాగడం హానికరం… ఆడవాళ్లకైనా, మగవాళ్లకైనా. ఆడవాళ్లు తాగితే పడుకుంటారు అనుకోవద్దు. అయినా ఒక మనిషికి ఉన్న అలవాట్లను బట్టి క్యారెక్టర్‌ని ఎలా డిసైడ్ చేస్తాం?
★ అమ్మాయి జీన్స్ వేసుకోకూడదు. స్కర్ట్ వేసుకోకూడదు. వాళ్లకి నచ్చిన బట్టలు వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకు ప్రమాదకంర కాదు. అబ్బాయిలకి ప్రమాదం. పాపం ఎందుకంటే.. అబ్బాయిలు టెంప్ట్ అయిపోతారు. అందుకే ఇలాంటి అమాయకులైన అబ్బాయిలను మనం కాపాడుకుందాం..
★ ఆడవాళ్లు మనకు ఆనందాన్ని మాత్రమే ఇవ్వాలి. హక్కుల గురించి అడిగితే… ఇలా బోనులో నిలబెట్టి వేశ్య అని ముద్ర వేసేస్తాం.
‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ తొలి షోతోనే సెన్సేషనల్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. యూనానమస్ సూపర్ హిట్ రెస్పాన్స్ నేపథ్యంలో “వకీల్ సాబ్” చిత్ర బృందం హైదరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసులో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా… నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ….నిర్మాతగా మారి 18 ఏళ్లవుతోంది. లైఫ్‌లో ఎన్నో సక్సెస్ లు చూశాను. డిస్ట్రిబ్యూటర్‌గా అంతకుముందు నుంచే విజయాలు చూశాను. అయితే ‘వకీల్ సాబ్’ సక్సెస్ ఎందుకో కొత్తగా అనిపిస్తోంది. ఉదయం 4.30 కూకట్ పల్లిలో ప్రీమియర్ షోస్ చూశాను. ఆ ఫ్యాన్స్ మధ్యలో సినిమా చూస్తుంటే నన్ను నేను మర్చిపోయాను. నిర్మాతనని మర్చిపోయి ఫ్యాన్స్‌లాగే పేపర్స్ విసిరేశాను. పది నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యాను. వకీల్ సాబ్ మీద మాసివ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాను ఒక్కో స్టేజీలో చూస్తుంటే ఇలాంటి ఘన విజయాన్ని అంచనా వేశాం. ప్రేక్షకులు, అభిమానుల మధ్యలో సినిమా చూస్తుంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. అప్పటికే అమెరికా, దుబాయ్ షోస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. విదేశాల నుంచి సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. వకీల్ సాబ్ విజయం నాకు కొత్తగా అనిపించడానికి కారణం, నేను కళ్యాణ్ గారితో సినిమా చేయాలనే కోరిక కావొచ్చు, ఇలాంటి సబ్జెక్ట్ కావొచ్చు. పవన్ గారితో పాటు ఈ సినిమా సక్సెస్ ఘనత దర్శకుడు శ్రీరామ్ వేణుకి ఇస్తాను. ఒక హీరోను ఇలా చూడాలి అనే ఆలోచనతో తను రాసుకున్న సీన్స్ కానీ, ప్రెజంటేషన్ గానీ సూపర్బ్. ప్రతి సీన్‌కు, ప్రతి డైలాగుకు ఆడియెన్స్ రియాక్ట్ అవుతున్నారు. గంటా పదిహేను నిమిషాల సెకండాఫ్ అయితే విజిల్స్, చప్పట్లు కొడుతున్నారు.
సినిమా అయ్యాక దర్శకుడు వేణుకు కాల్ చేశాను. ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లాం. ఆయనకు ముందుగా చెప్పలేదు, ఆ సంతోషంలో ఆయన ఇంటికి వెళ్లి పవన్ గారిని కలిసి సినిమా సక్సెస్ గురించి చెప్పాం. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు. కళ్యాణ్ గారు చాలా సక్సెస్‌లు చూశారు కానీ వకీల్ సాబ్‌లో అమ్మాయిలు, మహిళల గొప్పదనం తెలిపే కంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అయితే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. వేణు, పవన్ గారు ప్రతి సీన్ ఎలా చేయాలో డిస్కషన్ చేసుకుని షూట్ చేశారు. ఆ సీన్స్ ఇప్పుడు థియేటర్లో బాగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు గంట సేపు పవన్ గారితో మాట్లాడాం. నేను ప్రసాద్ ఐమాక్స్, సుదర్శన్ థియేటర్లకు వెళ్లి అక్కడ ఆడియెన్స్ రెస్పాన్స్ గమనించాను. టెర్రఫిక్ రెస్పాన్స్ ఉంది. ఏదో తెలియని అనుభూతికి లోనవుతున్నాను. ఇంతలో చాలా మంది మీడియా పర్సన్స్ ఫోన్ చేసి సినిమాను ప్రశంసిస్తూ మాట్లాడారు. మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఇదొక అద్భుతమైన ఎక్సీపిరియన్స్. బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, కళ్యాణ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటూ చెబుతున్నారు. ఈ సినిమా ఎంత సునామీ సృష్టిస్తుందో ఇప్పుడో చెప్పలేం. ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్ మాత్రం ట్రెమండస్‌గా ఉన్నాయి. ఏ సినిమా ఎంత డబ్బు తెస్తుందనేది నేనెప్పుడూ ఆలోచించలేదు. మంచి సినిమా చేశాక డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుంది. 18 ఇయర్స్ నుంచి మా సంస్థలో ఉన్న వేణు, నా డ్రీమ్ ప్రాజెక్ట్‌కు ఇంత విజయాన్ని ఇచ్చాడు. అందుకు అతన్ని సత్కరిస్తున్నాం’ అని అన్నారు.
దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ….ఓవర్సీస్‌తో పాటు అన్ని చోట్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ మాస్ మహిళలు.. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. ఇవాళ టికెట్స్ దొరకని వారు రేపు బుక్ చేసుకుని వెళ్లండి. సినిమాను ఎంజాయ్ చేయండి. టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్న మీడియా వాళ్లకు థాంక్స్. రాజు గారు మార్నింగ్ షో సినిమా చూసి దర్శకుడిని పిలిచి మాట్లాడుతారు. ఇలాగే ఇవాళ నన్ను మాట్లాడేందుకు పిలిచారు. ఇద్దరం కలిసి పవన్ గారి దగ్గరకు వెళ్లాం. అభిమాన హీరోతో హిట్ సినిమా చేసి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తిరిగి ఆయనతో చర్చించుకోవడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చింది. లైఫ్ లాంగ్ ఈ మూవ్‌మెంట్స్ గుర్తుపెట్టుకుంటాను.
పవన్ గారి వ్యక్తిత్వం ఒక అభిమానిగా నాకు తెలుసు. అందుకే ఆయన పాత్రకు సత్యదేవ్ అని పేరు పెట్టి, ఆయన సమాజాన్ని చూసే కోణంలోనే డైలాగ్స్ రాశాను. సత్యదేవ్ క్యారెక్టర్ ప్రజల కోస పోరాడతాడు. ఆ కోణంలోనే మాటలు రాశాం. ఇవి జనసేన పార్టీ రిలేటెడ్‌గా కుదిరాయని ఎవరైనా అంటే సంతోషమే కదా. వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రాజు గారికి, కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ విజయం ఆర్టిస్టుల సహా కంప్లీట్ టీమ్ వర్క్. అంతా తమ బెస్ట్ వర్క్ చేశారు. మా చిత్ర బృందం అందరికీ థాంక్స్’ అంటూ ఆయన ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ వేణుకు నిర్మాత దిల్ రాజు శాలువా కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం యూనిట్ బాణాసంచా కాలుస్తూ వకీల్ సాబ్ సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు.
తెలుగు హీరోల్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉండే క్రేజే వేరు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌ని పెంచాయే తప్ప… ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. రాజకీయాల్లో బిజీగా మారడంతో మూడేళ్లు గ్యాప్ తీసుకున్నా పవన్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. హిందీలో విజయవంతమైన ‘పింక్’ సినిమా రీమేక్‌గా తన రీఎంట్రీ సినిమా ‘వకీల్‌సాబ్’ని ప్రకటించడంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ప్రచార చిత్రాలు సైతం సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. మూడేళ్లుగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. నేడు(ఏప్రిల్ 9) థియేటర్లలో అడుగుపెట్టిన ‘వకీల్ సాబ్’ అంచనాలను అందుకున్నాడా? లేదా? అన్నది చూద్దాం…
మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు నివేదా థామస్ (పల్లవి), అంజలి (జరీనా), అనన్య (దివ్య నాయక్) నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఓరోజు రాత్రి ఇంటికి వెళ్తుండగా క్యాబ్ సడెన్‌గా ఆగిపోతుంది. వీరిపై కన్నేసిన ఎంపీ రాజేంద్ర (ముఖేష్ రుషి) కొడుకు వంశీ తన స్నేహితులతో కలిసి వాళ్లకు మాయమాటలు చెప్పి ఓ రిసార్ట్‌కి తీసుకెళ్తాడు. అక్కడ పల్లవికి వంశీ నుంచి చేదు అనుభవం ఎదురవుతుంది. తప్పించుకునే క్రమంలో వంశీని మందు సీసాతో కొట్టిన పల్లవి తన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడి నుంచి పారిపోతుంది.
ఎంపీ రాజేంద్ర తన పలుకుబడి ఉపయోగించి ఈ ముగ్గురు యువతులపై ఎదురు కేసు పెట్టిస్తాడు. ప్రాసిక్యూషన్ లాయర్ నంద (ప్రకాష్ రాజ్) సాయంతో వీళ్లని వ్యభిచారులుగా చిత్రీకరించి పల్లవిని జైలుకు పంపిస్తాడు.. అయితే పల్లవిని బెయిల్‌పై తీసుకొచ్చేందుకు జరీనా, అనన్య ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే ఎదురవుతుంది. ఆ సందర్భంలోనే సత్యదేవ్ అలియాస్ వకీల్‌సాబ్ (పవన్‌కల్యాణ్) గురించి తెలుసుకుని ఆయన సాయం కోరతారు. వాళ్ల పరిస్థితిని చూసి రంగంలోకి దిగిన వకీల్ సాబ్ ఈ కేసుని ఎలా ఛేదించాడు? ఈ ముగ్గురు అమ్మాయిల్ని కేసు నుంచి ఎలా బయటపడేశాడు? అసలు నిందితులను చట్టానికి ఎలా పట్టించాడు? అసలు వకీల్ సాబ్ నేపథ్యం ఏంటి? అన్నది థియేటర్లలో చూడాల్సిందే..
సమాజంలో మహిళలకు ఎదురవుతున్న సంఘటనలు, అఘాయిత్యాలను ఎత్తిచూపుతూనే కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. అమ్మాయి నవ్వినా, ఒకరిని టచ్ చేస్తూ మాట్లాడినా, ఒంటరిగా వెళ్లినా మరో వంకతో చూసే ధోరణి గురించి ఇందులో హీరో చెప్పిన విషయాలు ఆలోచన రేకెత్తిస్తాయి. ఇలా జరగొద్దు… జరగకూడదనే ఓ బలమైన సందేశాన్నిస్తాయి. మగువా… పాటతో సినిమా మొదలవుతుంది. మూడు భిన్నమైన కుటుంబాల నుంచి అమ్మాయిలు తమ కలల్ని సాకారం చేసుకోవడం కోసం నగరానికి చేరుకోవడం, ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలవడం వంటి సన్నివేశాలతో ఆ పాట సాగుతుంది. ముగ్గురమ్మాయిలకి ఎదురైన సంఘటనల తర్వాత వకీల్‌సాబ్‌గా పవన్‌కల్యాణ్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. సత్యదేవ్ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు, పల్లవి కోసం కోర్టు వాదించే సన్నివేశాలు సినిమాకే హైలట్‌గా నిలిచాయి.
ఫస్టాఫ్‌లో పవన్ అభిమానుల్ని అలరించడమే లక్ష్యంగా సన్నివేశాలుండగా.. సెకండాఫ్‌లో కోర్టు రూమ్ డ్రామా సినిమాకు ప్రాణంగా నిలిచాయి. సత్యదేవ్, నందా వాద ప్రతివాదనలతో సన్నివేశాలను రక్తి కట్టించారు. హిందీ చిత్రం ‘పింక్’కి రీమేక్ అయినప్పటికీ దాన్ని పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా తీర్చిదిద్దిన విధానం, అభిమానుల్ని అలరించేలా వాణిజ్యాంశాల్ని జోడించిన తీరు మెచ్చుకుని తీరాల్సిందే. హీరో పాత్రను బలంగా ఎలివేట్ చేసినా కథ పక్కదారి పట్టకుండా దర్శకుడు శ్రద్ధ తీసుకున్నాడు.
చీడ పురుగు మగవాడి మెదడులో పెట్టుకుని… మందు ఆడవాళ్ల మొహం మీద కొడతాం అంటే ఎలా? అంటూ సాగే సంభాషణలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. పవన్‌కల్యాణ్ పొలిటికల్ ఇమేజ్‌కి తగినట్లుగా కూడా ఇందులో కొన్ని డైలాగులు జోడించారు. ‘ఆశయం కోసం పనిచేసేవాడికి గెలుపు ఓటములతో పని ఉండదు’ అంటూ పవన్ రాజకీయ నేపథ్యాన్ని పవన్ టచ్ చేశారు. పొలిటికల్ ఇమేజ్ ఈ సినిమా విషయంలో పవన్‌కల్యాణ్‌కి బాగా కలిసొచ్చింది.
వకీల్‌సాబ్ పాత్రలో పవన్‌కల్యాణ్ పూర్తిగా ఒదిగిపోయారు. కోర్టులో అమ్మాయిలకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. కోర్టు సన్నివేశాల్లో పవన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నివేదా, అంజలి, అనన్య వారి పాత్రల్లో జీవించారు. నందా పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటన సినిమాకి మరింత బలాన్నిచ్చింది. దర్శకుడు శ్రీరామ్ వేణు ముందు నుంచి చెప్పినట్లుగానే తన పనితనంగా అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా మరో రేంజ్‌కి వెళ్లేదనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని మైనస్‌లున్నా పవన్ కళ్యాణ్ వాటన్నింటినీ కనిపించకుండా చేశారు. థమన్ పాటలు, నేపథ్య సంగీతం, పి.ఎస్. వినోద్ కెమెరా పనితనం సినిమాకి అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. నిర్మాణ పరంగా దిల్‌రాజు టేస్ట్ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. మొత్తం ‘వకీల్ సాబ్’ అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా.
మూడేళ్లు వెండితెరకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’గా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 9వ తేదీ కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలై ఒక్క రోజులోనే రికార్డులు కొల్లగొట్టింది. తాజాగా ఈ ట్రైలర్ పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన మనసులో మాట బయటపెట్టారు.
వకీల్ సాబ్ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ చాలా ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకూ చూడని పవర్ స్టార్ స్క్రీన్‌పై కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో పవన్ ఆటిట్యూడ్ నచ్చింది. అమ్మాయి తరపున వాళ్ళ కోసం పోరాడే లాయర్ పాత్రలో ఆయన అదరగొట్టేశారు పేర్కొంది. ముఖ్యంగా మీరు వర్జినా అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం బాగుంది. మొదటి నుంచి చివరి వరకు ‘వకీల్ సాబ్’ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది’ అంటూ రేణుదేశాయ్ కితాబిచ్చింది. ఆమె స్పందన చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా ఈ ‘వకీల్ సాబ్’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సినిమా మొత్తం ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూనే తిరుగుతుందని ట్రైలర్ చూస్తూనే తెలుస్తోంది. బోనీ కపూర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించింది తెలుగమ్మాయి అంజలి. “వకీల్ సాబ్” గురించి, ఈ చిత్రంలో తన పాత్ర గురించి అంజలి మీడియాతో పంచుకున్నారు.. ఈ విశేషాలు మీకోసం…
“డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు పింక్ సినిమా రీమేక్ చేస్తున్నాం. కానీ తెలుగు నేటివిటీకి తగినట్లు కొత్తగా ఉంటుంది అని చెప్పారు. సినిమా గురించి ఆయన చెప్పిన కాన్సెప్ట్ బాగా నచ్చింది. మేము ఈ సినిమాలో చేసిన మార్పులు వకీల్ సాబ్ ట్రైలర్ చూశాక మీకే అర్థమై ఉంటుంది. హిందీ పింక్‌తో వకీల్ సాబ్ ను కంపేర్ చేసి చూడలేం. పవన్ కళ్యాణ్ గారితో నటించడం మొదట్లో కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉండేది. ఆయన వస్తుంటే సెట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. నేను జనరల్‌గా ఎక్కువగా మాట్లాడతా. అలాంటి టైమ్ లో నా వల్ల మిగతా వారు ఏదైనా డిస్ట్రబ్ అవుతారా అని భయపడేదాన్ని. పవన్ గారు చాలా ఇన్ పుట్స్ ఇస్తూ సినిమా చేయించారు. అవన్నీ చూశాక మన క్యారెక్టర్ మనం సరిగ్గా చేస్తే సరిపోతుంది అనే నమ్మకం వచ్చింది. నాకూ, నివేదా, అనన్యకు మధ్య చాలా సీన్స్ ఉంటాయి. మా మధ్య రిలేషన్ లేకుంటే క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా రావు. మా మధ్య చాలా తక్కువ టైమ్ లో బాండింగ్ ఏర్పడింది. అందుకే చాలా ఈజీగా నటించగలిగాం.
నా క్యారెక్టర్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. పవన్ గారు సెట్స్లో చాలా కామ్‌గా ఉంటూనే అందరితోనూ మాట్లాడతారు. ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడాలంటేనే నాకు పదిహేను రోజులు పట్టింది. పవన్ గారితో సినిమా అనగానే జంప్ చేశాను. అయితే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అని ఆలోచించాను. పవన్ గారితో సినిమా చేస్తున్నాను అనేదే నా మనసులో ఉండేది. పెద్ద హీరోతో పనిచేస్తున్నప్పుడు లేడీ క్యారెక్టర్స్ కొట్టుకుపోతాయి. కానీ వకీల్ సాబ్‌లో నాకు చాలా కీలకమైన పాత్ర దక్కింది. వకీల్ సాబ్‌ను పింక్‌తో పోలిస్తే.. పింక్ కథలోని సోల్ ఇందులో అలాగే ఉంటుంది. మార్పులన్నీ ఆ మెయిన్ స్టోరీ చుట్టూ చేశారు. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు మనకు నిత్యకృత్యం అయ్యాయి. ఆ వార్తలు మనకు కామన్ అయి పోయాయి. కానీ అలాంటి ఘటన మన ఇంట్లో ఇలాంటిది జరిగితే ఎలా రెస్పాండ్ అవుతాం అనేది చూపిస్తున్నాం. ఇలాంటి సందర్భాలు ఏ అమ్మాయికీ రాకూడదు.
సినిమా ఇండస్ట్రీలో నాయికలకు కొన్ని చేదు సందర్భాలు ఎదురవుతుంటాయి అంటారు. అయితే ఇక్కడ సెలబ్రిటీ, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అని కాదు అమ్మాయి అమ్మాయే. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. అవును డబ్బులు తీసుకున్నాం అని. ఆ ఒక్క సీన్ చాలు నా క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుంది అని చెప్పేందుకు. ఈ సీన్ మరో రోజు చేయాల్సింది. కానీ ఆ రోజు సడెన్‌గా షూట్ చేశాం. ఈ కోర్ట్ సీన్ చేశాక, నేను వణికిపోయాను. అంత ఉద్వేగానికి గురయ్యాను. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ చేసేప్పుడు నటిగా నేనూ ఉద్వేగపడతాను. అలా లీనమైతేనే సీన్ కరెక్ట్‌గా వస్తుంది.
వకీల్ సాబ్‌లో ప్రకాష్ రాజ్ గారితో మరోసారి పనిచేసే అవకాశం వచ్చింది. రెండు సీన్స్‌లో ప్రకాష్ రాజ్ గారితో కలిసి నటించాను. మన ఎదుట ఉన్న ఆర్టిస్ట్ బాగా నటిస్తేనే మనకూ ఆ టైమింగ్ వస్తుంది. వాళ్లు ఫర్మార్మ్ చేయకుంటే మనమూ డల్ అయిపోతాం. ప్రకాష్ రాజ్ గారితో పనిచేసినప్పుడు మనకూ తెలియకుండానే ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. మీకు ఇష్టమైతే ఎస్ లేకుంటే నో చెప్పడం మీ ఛాయిస్. నో చెప్పకూడదు అని ప్రశ్నించే రైట్ ఎవరికీ లేదు. ఇష్టపడటం ఇష్ట పడకపోవడం అమ్మాయి నిర్ణయానికి వదిలేయాలి. సినిమాలోనూ పవన్ గారు ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు.
‘మగువా మగువా’ పాట హిందీలో లేదు. మహిళల మీద ఈ పాట చేయడం సినిమాలో చేసిన మంచి మార్పు. మగువా పాట విన్నప్పుడు మీ ఫేస్‌లో ఒక సంతోషం వస్తుంది. ఈ సాంగ్ కోసం చాలా మాంటేజ్‌లు షూట్ చేశాం. వాటిలో బెస్ట్ అనిపించుకున్నవి పాటలో పెట్టాం. పింక్ హిందీ, తమిళ చిత్రాల్లో మగువా లాంటి పాట ఉండదు. ట్రైలర్‌లో మీరు చూసిన సీన్ చేశాక పవన్ గారు క్లాప్ కొట్టి నన్ను అప్లాజ్ చేశారు. సాధారణంగా పవన్ గారు ఎక్స్ ప్రెసివ్‌గా ఉండరు. కానీ ఆయన ప్రశంసించాక సంతోషం కలిగింది.
ప్రీమారిటల్ సెక్స్ అనేది వ్యక్తిగత విషయం. వారి వారి ఇష్టాలను బట్టి ఉంటుంది. ఎవరి ఆలోచనలు బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఫెమినిజం అనే విషయాన్ని గుడ్ వేలో వాడితే మంచిదనేది నా ఉద్దేశం. నేను గతంలో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాను. వాటిలో వకీల్ సాబ్ క్యారెక్టర్ తప్పకుండా ఉంటుంది. తెలుగు, తమిళంలో కొన్ని ఎగ్జైటింగ్ చిత్రాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో చెబుతాను. ఏ హీరోయిన్ అయినా తన కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటుంది అనే దానిపైనే ఆమె కెరీర్ ఆధారపడి ఉంటుంది. నాకు కెరీర్ లో ఎప్పుడూ గ్యాప్ రాలేదు. నచ్చిన సినిమాలు ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నాను. నేను ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నానో భవిష్యత్‌లోనూ అలాగే కంటిన్యూ చేస్తా” అంటూ తన ఇంటర్వ్యూని ముగించారు అంజలి.