పూరీ జగన్నాథ్ ఆలయం రహస్యాలు.. సైన్స్ కూడా కనిపెట్టలేని నిజాలు
Category : Features Latest Reviews Sliders Spiritual
పూరీ జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రధయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహరాజు పూరీ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కధనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాధ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆలయ నిర్మాణం
పూరీ జగన్నాధ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజినీరింగ్ అద్భుతమా లేక దైవ శక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతుచిక్కని విషయం.
ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరవు
ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు. ఏ ప్రభుత్వమూ దీనిని నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణింపబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది.
సింఘద్వారం రహస్యం
జగన్నాధ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి. వీటిలో సింఘ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ధ తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్ధం మీకు వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది.
ఆలయంపై జెండా
పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.
సుదర్శన చక్రం
20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాధ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయంపైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజినీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.
సముద్రం రహస్యం
సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరీ సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్ కు కూడా అంతుచిక్కని మిస్టరీ.
ప్రసాదం రహస్యం
పూరీ జగన్నాధ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతి రోజూ 2000 నుంచి 20,000 వరకూ భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటుచేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం.
1800 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆచారం
45 అంతస్తుల ఎత్తు గల ఈ ఆలయంపైకి ప్రతి రోజూ ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకూ ఆలయం మూతపడుతుందని నమ్ముతారు.