‘పుష్ప’ కలెక్షన్ల జోరు.. బన్నీ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్

‘పుష్ప’ కలెక్షన్ల జోరు.. బన్నీ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో పండగ వాతావరణం కొనసాగుతోంది. కరోనాతో కొన్నాళ్లుగా బోసిపోయిన సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు ‘అఖండ’‌తో కిక్కిరిసిపోయిన సంగతి తెలిసిందే. సరిగ్గా రెండు వారాలకు అల్లు అర్జున్ ‘పుష్ప’తో మరోసారి సందడి నెలకొంది. బన్నీ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘పుష్ప’ అంచనాలను అనుగుణంగా తొలిరోజు రికార్డుస్థాయి వసూళ్లు సాధించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.. బన్నీ గత సినిమా అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం.. సుకుమార్ కూడా రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఆ అంచనాలు పుష్ప సినిమాపై బాగా కనిపించాయి.

శుక్రవారం(డిసెంబర్ 17)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప’ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే అన్ని భాషల్లో కలిపి రూ.71 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. పుష్ప సినిమాను ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాత ఎర్నేని నవీన్ మాట్లాడుతూ.. అన్ని భాషల్లో కూడా పుష్ప సినిమా రికార్డు తిరిగరాస్తోంది. బన్నీ నటనకు ఫ్యాన్స్‌ నుంచి భారీ స్పందన వస్తోంది. మొదటి రోజే ఇంత కలెక్షన్‌ వస్తుందని అనుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణలో అదనపు షో పర్మిషన్ ఇవ్వడం మాకు ఎంతో కలిసి వచ్చిందని చెప్పుకొచ్చారు. వీకెండ్‌కు మంచి కలెక్షన్‌ వస్తుందని భావిస్తున్నాం. బన్నీకి మలయాళంలో మంచి పేరుంది. ఈ సినిమా ఇంతకుముందు సినిమాల కంటే భారీ ఎత్తున వసూలు చేస్తుంది. ప్రపంచంలోనే తెలుగు ఆడియన్స్ లాంటి వాళ్ళు లేరు. ఈ సినిమాను ఇంత ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలిపారు.

సుకుమార్ దర్శకత్వం, బన్నీ నటన, సినిమాటోగ్రఫీతో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్​గా మారాయి. సమంత స్పెషల్ సాంగ్ కూడా థియేటర్లకు జనాల్ని రప్పించడంలో సఫలమైంది. అన్ని ఏరియాలకు మించి ‘పుష్ప’ నైజాం ఏరియాలో ఏకంగా తొలిరోజే 11.44 కోట్ల షేర్​తో ఆల్​టైమ్ రికార్డు సృష్టించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం, ఐదో షోకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపు భారీ కలెక్షన్లకు సహాయపడ్డాయి.