థ్యాంక్యూ రివ్యూ(Thankyou Review)

థ్యాంక్యూ రివ్యూ(Thankyou Review)

చిత్రం: థ్యాంక్యూ
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య, రాశీఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్‌, అవికాగోర్‌, ప్రకాశ్‌రాజ్‌, ఈశ్వరీరావు, సాయి సుశాంత్ రెడ్డి, త‌దిత‌రులు
క‌థ‌: బి.వి.ఎస్‌.ర‌వి
సంగీతం: త‌మ‌న్
ఛాయాగ్రహ‌ణం: పి.సి.శ్రీరామ్‌
కూర్పు: న‌వీన్ నూలి
నిర్మాణం: దిల్‌రాజు, శిరీష్‌
నిర్మాణ సంస్థ: శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌
ద‌ర్శక‌త్వం: విక్రమ్ కె.కుమార్‌
విడుద‌ల‌: 22-07-2022

మ‌జిలీ, వెంకీ మామ‌, ల‌వ్‌స్టోరి, బంగార్రాజు ఇలా వ‌రుస విజ‌యాల‌తో స‌క్సెస్ ఊపు మీదున్న అక్కినేని హీరో నాగ చైత‌న్య. ఆయ‌న కెరీర్‌లో మ‌నం ఓ మెమొర‌బుల్ మూవీ. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది విక్రమ్ కె.కుమార్‌. త‌ర్వాత వీరిద్దరి కాంబినేష‌న్‌లో సినిమా తెరకెక్కలేదు. దాదాపు 8 ఏళ్ల త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందిన సినిమా ‘థాంక్యూ’. చైతన్య సక్సెస్ ట్రాక్.. విక్రమ్ కుమార్ వంటి సెన్సిబుల్ డైరెక్టర్‌కి తోడుగా దిల్ రాజు, శిరీష్ వంటి అభిరుచి గ‌ల నిర్మాత‌లు తోడయ్యారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ మ‌రింత పెరిగాయి. మ‌రి వాటిని సినిమా ఏ మేర‌కు అందుకుంద‌నేది తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం…

క‌థేంటంటే
అభిరామ్ (నాగ‌చైత‌న్య) పేదింటి కుర్రాడు. చిన్ననాటి నుంచే త‌న‌కంటూ కొన్ని ఆశ‌యాలుంటాయి. త‌న జీవితంలో ఒకొక్క మ‌జిలీ త‌ర్వాత అమెరికా చేరుకుంటాడు. అక్కడ త‌న తెలివితేట‌ల‌తో కార్పొరేట్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. అత‌డి మ‌న‌సుని చూసి ప్రియ (రాశీఖ‌న్నా) ప్రేమిస్తుంది. ఇద్దరూ స‌హ‌జీవ‌నం చేస్తారు. జీవితంలో ఎదుగుతున్న కొద్దీ అభి ఆలోచ‌న‌లు మారిపోతాయి. జీవితంలో ఎన్నో వ‌దులుకుని ఇక్కడిదాకా వ‌చ్చా.. రాజీ ప‌డే ప్రస‌క్తే లేదంటూ ఎవ్వరినీ లెక్క చేయ‌డు. నేను, నా ఎదుగుద‌ల అన్నట్టుగానే వ్యవ‌హరిస్తుంటాడు. ఎదుటివాళ్ల మ‌నోభావాల్ని అస్సలు ప‌ట్టించుకోడు. దీంతో ప్రియ అత‌డికి దూరంగా వెళ్లిపోతుంది. అభి అలా సెల్ఫ్ సెంట్రిక్‌గా మార‌డానికి దారి తీసిన ప‌రిస్థితులు ఏమిటి? ప్రియ దూర‌మ‌య్యాకైనా అతడి ఆలోచ‌న‌లు మారాయా? ఆ తర్వాత ఇండియాకి వ‌చ్చిన అభి ఏం చేశాడన్నదే మిగ‌తా క‌థ‌.

వ్యక్తి జీవితంలో సాధించిన విజ‌యాల వెనుక ఎంతో మంది ప్రోత్సాహం, తోడ్పాటు ఉంటుంది. అలాంటి వారిని క‌లుసుకునే వ్యక్తి భావోద్వేగ ప్రయాణ‌మే ‘థాంక్యూ’ సినిమా. నాగ చైత‌న్య చుట్టూనే ‘థాంక్యూ’ సినిమా నడిచింది. ఓ రకంగా భారీ యాక్షన్ స‌న్నివేశాలు, సెట్స్‌, క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేకుండా.. ఎమోష‌న్స్‌ను ప్రధానంగా చేసుకుని న‌డిచే సినిమా ఇది. ఇలాంటి సినిమాను యాక్సెప్ట్ చేయ‌ట‌మే గొప్ప విష‌యం అనాలి. 30ఏళ్ల వ్యక్తి జీవితంలో జరిగే మూడు ముఖ్య ద‌శ‌ల‌ను ఈ సినిమా రూపంలో మ‌లిచారు. వాటిలో ఒదిగిపోవ‌టానికి నాగ చైత‌న్య చాలానే క‌ష్టప‌డ్డారు. ముఖ్యంగా గ్రామంలో ప‌ద్దెనిమిదేళ్ల కుర్రాడుగా క‌నిపించటానికి త‌న బ‌రువు త‌గ్గటం.. మ‌ళ్లీ త‌ర్వాత క‌నిపించే పాత్రలో ర‌గ్డ్‌గా క‌నిపించ‌టం అనేది చాలా క‌ష్టమైన విష‌యం. ఆ రెంటిని చైత‌న్య త‌న‌దైన న‌ట‌న‌తో చ‌క్కగా బ్యాలెన్స్ చేస్తూ వ‌చ్చారు. నిజంగా త‌న ప్రయ‌త్నాన్ని క‌చ్చితంగా అభినందించాలి. త‌న ఓజ్‌ను దాటి ఓ కొత్త ఎక్స్‌పెరిమెంట్ చేశాడు చైత‌న్య.

అభిరామ్ ప్రయాణ‌మే ఈ సినిమా. జీవితంలో అప్పటిదాకా దాటుకుంటూ వ‌చ్చిన ఒక్కొక్క ద‌శ‌ని ఆవిష్కరిస్తూ భావోద్వేగాల్ని పంచ‌డ‌మ‌నే కాన్సెప్ట్ మ‌న సినిమాకి కొత్తేమీ కాదు. నాగ‌చైత‌న్య ‘ప్రేమ‌మ్‌’ కూడా అలాంటి ప్రయ‌త్నమే. కాక‌పోతే ఈ క‌థ‌లో ప్రేమ‌కంటే కూడా జీవితంపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టారు. తెలిసో తెలియ‌కో ఒక్కొక్కరూ మ‌న జీవితాన్ని ఒక్కో మ‌లుపు తిప్పుతుంటారు. మ‌నం ఎదిగాక కృత‌జ్ఞత‌గా వాళ్లని గుర్తు చేసుకోవాల్సిందే అని చెప్పే ప్రయ‌త్నం ఇందులో క‌నిపిస్తుంది. క‌థేదైనా క‌థ‌నంతో దానికి కొత్త హంగులు తీసుకొచ్చే ప్రయ‌త్నం చేస్తుంటారు. ఇందులోని క‌థ అంద‌రికీ తెలిసిందే. క‌థ‌నం విష‌యంలోనూ పెద్దగా క‌స‌ర‌త్తులు చేయ‌లేదు. దాంతో ఏ ద‌శ‌లోనూ సినిమా ఆస‌క్తిని రేకెత్తించ‌దు. ఆరంభ స‌న్నివేశాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ప్రియ‌, అభిరామ్ క‌ల‌వ‌డం.. వాళ్ల మ‌ధ్య ప్రేమ చిగురించ‌డం.. ఆ త‌ర్వాత అభిరామ్ ఎదుగుద‌ల నేప‌థ్యంలో స‌న్నివేశాలు ప్రేక్షకుడిని క‌థ‌లో లీనం చేస్తాయి.

కానీ ఈ క‌థాగ‌మ‌నం ఏమిటో ప్రేక్షకుడి ఊహ‌కు అందేలా సాగుతుంది. మ‌న‌స్సాక్షి ఎపిసోడ్ త‌ర్వాత క‌థ‌లో ఉప‌క‌థ‌లు మొద‌ల‌వుతాయి. నాగ‌చైత‌న్య – మాళ‌విక నాయ‌ర్ (పార్వతి) మ‌ధ్య సాగే తొలిక‌థ కొత్తగా అనిపించ‌క‌పోయినా అందంగానే ఉంటుంది. ద్వితీయార్ధం త‌ర్వాత మొద‌ల‌య్యే రెండో క‌థ విష‌యంలోనే స‌మ‌స్యంతా. సుదీర్ఘంగా సాగ‌డం, అందులో కొత్తద‌నమేదీ లేక‌పోవ‌డంతో సినిమా రొటీన్‌గా మారిపోయింది. క‌టౌట్లు, హాకీ అంటూ చాలా హంగామానే ఉంటుంది కానీ, ఆ స‌న్నివేశాల‌న్నీ కూడా సాగ‌దీత‌గానే అనిపిస్తాయి. పార్వతి, శ‌ర్వాని క‌లిశాక ప‌తాక స‌న్నివేశాలు మొద‌ల‌వుతాయి. అవి భావోద్వేగాల‌తో మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా ఉన్నప్పటికీ అప్పటికే జ‌రగాల్సిన న‌ష్టమంతా జ‌రిగిపోయిన‌ట్టు అనిపిస్తుంది.

భావోద్వేగంగా సినిమా ప్రేక్షకుల‌ను మెప్పించాల‌ని యూనిట్ చేసిన ప్రయ‌త్నం ఓకే. అయితే సినిమా బావున‌ట్లే ఉంటుంది కానీ.. ఎమోష‌న‌ల్‌గా ప్రేక్షకుడు క‌నెక్ట్ కాలేడు.. మ‌నం వంటి ఎమోష‌న‌ల్ మూవీని అద్భుతంగా తెర‌కెక్కించి ద‌ర్శకుడు విక్రమ్ కుమారేనా ఈ సినిమాను డైరెక్ట్ చేసింద‌నే డౌట్ రాక మాన‌దు. ఇక ఇలాంటి ఫీల్ గుడ్ మూవీలో ఎమోషన్ క‌నెక్ట్ కావాలంటే సంగీతం ప్రధాన పాత్రను పోషించాల్సి ఉంటుంది. త‌మ‌న్ సంగీతం పాట‌లు సిట్యువేష‌న్స్‌కు త‌గ్గట్టు వెళ్లాయే త‌ప్ప.. గొప్పగా లేవు. నేప‌థ్య సంగీతం ఫర్వాలేదు. ఇక పి.సి.శ్రీరామ్‌గారి సినిమాటోగ్రఫీకి మ‌నం వంక‌లు పెట్టలేం. విజువ‌ల్స్‌గా సినిమా చాలా ఎఫెక్టివ్‌గా అనిపిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అక్కినేని అభిమానులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ కామ‌న్ ఆడియెన్స్‌కు మాత్రం సినిమా అంత ఎమోష‌న‌ల్‌గా క‌నెక్టింగ్‌గా అనిపించ‌దు.


‘పక్కా కమర్షియల్’ రివ్యూ

చిత్రం: పక్కా కమర్షియల్‌
నటీనటులు: గోపిచంద్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, రావు రమేశ్‌, అజయ్‌ ఘోష్‌, సప్తగిరి, తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: కర్మ్‌ చావ్లా
ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్ధవ్‌
నిర్మాత: బన్నీ వాసు
నిర్మాణ సంస్థలు: యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌
రచన, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: 1-07-2022

గోపీచంద్‌ అంటే యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌. దర్శకుడు మారుతీది సెపరేట్‌ ట్రాక్‌. కుటుంబ కథలకు కామెడీ, కీలక పాత్రలకు ఏదో ఒక సమస్యతో ముడి పెట్టి సినిమాలను తెరకెక్కించి సక్సెస్‌ కొట్టడంలో సిద్ధహస్తులు. అలాంటి వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘పక్కా కమర్షియల్‌’ . రాశీఖన్నా కథానాయిక. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?.. యాక్షన్‌ హీరో గోపీచంద్‌ను మారుతి ఎలా చూపించారు?… రివ్యూలో చూద్దాం…

సూర్యనారాయ‌ణ (స‌త్యరాజ్‌) ఓ న్యాయ‌మూర్తి. స‌రైన సాక్ష్యాధారాలు లేక‌పోవ‌డంతో ఓ కేసులో బాధితురాలికే జ‌రిమానా విధిస్తాడు. నేరం చేసిన వివేక్ (రావు ర‌మేష్‌) ఆ కేసులో గెలుస్తాడు. బాధితురాలికి న్యాయం చేయ‌లేక‌పోయాన‌ని కుమిలిపోయిన సూర్యనారాయ‌ణ‌త‌న వృత్తి నుంచి వైదొలుగుతాడు. కిరాణాకొట్టుని న‌డుపుతూ జీవితం సాగిస్తుంటాడు. సూర్య‌నారాయ‌ణ కొడుకు ల‌క్కీ (గోపిచంద్‌)(Gopi chand) కూడా తండ్రిలాగే న‌ల్ల‌కోటే ధ‌రిస్తాడు. కాక‌పోతే తండ్రిలా కాదు, ఇత‌ను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లాయ‌ర్‌. డ‌బ్బు కోసం విలువ‌ల్ని సైతం ప‌క్క‌న‌పెడ‌తాడు. ఓ కేసు విష‌యంలో తండ్రీ కొడుకుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ త‌లెత్తుతుంది. బాధితుడి ప‌క్షాన నిల‌వ‌డం కోసం ఎప్పుడో వ‌దిలిపెట్టిన న‌ల్ల‌కోటుని మ‌ళ్లీ ధ‌రిస్తాడు సూర్య‌నారాయ‌ణ‌. త‌న కొడుకుతోనే కోర్టులో పోరాటానికి దిగుతాడు. మ‌రి ఈ వైరం ఎక్క‌డిదాకా సాగింది?.. (Pakka Commercial Review) చివ‌రికి విలువ‌ల్నే న‌మ్ముకున్న తండ్రి గెలిచాడా లేక‌, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అయిన త‌న‌యుడు గెలిచాడా? తాను న‌టిస్తున్న సీరియ‌ల్ కోసం లా కూడా చ‌దివేసిన లాయ‌ర్ ఝాన్సీ క‌థేమిటన్నది మిగ‌తా సినిమా.

డబ్బుల్లేనిదే ఏ పని చేయను, డబ్బిస్తే అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చేసే లక్కీ పాత్రలో గోపీచంద్ అదరగొట్టేశాడు. ఈ చిత్రంలో గోపీచంద్ యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని యాంగిల్స్‌ను చూపించాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంతో స్టైలీష్‌గా కనిపిస్తాడు. లాయర్ ఝాన్సీ పాత్రలో రాశీ ఖన్నా అందరినీ నవ్విస్తుంది. తనకు తాను ఎక్కువగా ఊహించుకుని ఆ భ్రమలోనే బతికే పాత్రలో రాశీ ఖన్నా అద్భుతంగా నటించింది. రాశీ ఖన్నా బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. రావు రమేష్ తనకు అలవాటైన విలనిజాన్ని, కామెడీని జొప్పించి మరోసారి మెప్పించాడు. సత్యరాజ్ ఎప్పటిలానే ఎమోషన్ పండించాడు. అజయ్ ఘోష్, ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి అందరూ కూడా చక్కగా నటించారు.

మారుతి సినిమాలన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైక కథను ముందుకు తీసుకెళ్తాడు. పక్కా కమర్షియల్‌లో కథను పక్కకు పెట్టి కామెడీతో లాక్కోచ్చాడు. హీరోయిజం మీదనే ఎక్కువ దృష్టిపెట్డాడు. టైటిల్‌కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్‌ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఓ ఎమోషనల్‌ సీన్‌తో సినిమా మొదలవుతుంది. లాయర్‌ లక్కీగా గోపిచంద్‌ ఎంట్రీతోనే టైటిల్‌ దగ్గట్టుగా పక్కా కమర్షియల్‌గా సినిమా సాగుతుంది. సీరియల్‌ నటి ‘లాయర్‌ ఝాన్సీ’ ఎంట్రీతో కామెడీ డబుల్‌ అవుతుంది. ఆమె క్యారెక్టరైజేషన్స్‌ విషయంలో మారుతి మరోసారి తన మార్క్‌ చూపించాడు.

సీరియల్‌లో తన క్యారెక్టర్‌ని చంపారంటూ ‘లాయర్‌ ఝాన్సీ’ కోర్టు ఆశ్రయించే సీన్‌ నవ్వులు పూయిస్తుంది. రొటీన్‌ కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్‌ అంతా సోసోగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌ నుంచి అసలు కథ మొదలవుతుంది. వివేక్‌కి దగ్గరైన లక్కీ చివరకు అతన్ని ఎలా జైలు పాలు చేశాడనేది వినోదాత్మకంగా చూపించాడు. సెకండాఫ్‌లో చాలా ఫ్రెష్‌ కామెడీతో నవ్వించాడు మారుతి. సినిమాల్లో వచ్చే ఫైట్‌ సీన్స్‌పై వేసిన సెటైర్‌, రావు రమేశ్‌, అజయ్‌ ఘోష్‌ల మధ్య వచ్చే సీన్స్‌ నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్‌ ప్రేక్షకుడి ఊహకి అందేట్లుగా ఉంటుంది. కథని, లాజిక్స్‌ని పక్కకు పెట్టి చూస్తే.. ‘పక్కా కమర్షియల్‌’ పక్కా నవ్విస్తుంది.