RRR ట్రైలర్.. విజువల్ విస్ఫోటనం.. మాస్ మాయాజాలం
Category : Behind the Scenes Daily Updates Movie News Sliders Teasers
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్- రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్ గురువారం ఉదయం విడుదలైంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (RamCharan), కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. ‘‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కోసం మొదటిసారి రామ్‌చరణ్ – తారక్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ నటి ఆలియాభట్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇందులో ఆమె చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించనున్నారు. హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్.. తారక్‌కు జంటగా నటించారు. దక్షిణాది, బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పాన్ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.