‘విరాటపర్వం’ చూడడానికి 10 కారణాలివే!
Category : Behind the Scenes Movie News Movies Sliders
దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో తెరకెక్కిన తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. నక్సల్స్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా చూడడానికి 10 కారణాలున్నాయి అవేంటో తెలుసుకుందాం.
- విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల సొంత ఊరు ఉమ్మడి వరంగల్ జిల్లా. ఈయనకు సాహిత్యమంటే ఎంతో ఇష్టం. సామాజిక అంశాలు, చరిత్రలోని దాగిన కథలను వెలికి తీసి సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలనేదే ఆయన కోరిక. అందులో భాగంగా ఈయన తొలుత శ్రీవిష్ణుతో నీది నాది ఒకటే ప్రేమ కథ సినిమాను తెరకెక్కించాడు. అత్యంత అద్భుతమైన ప్రేమకథగా ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రధానంగా ఈ చిత్రంలో చదువే జీవితం కాదు అనేది ఇతివృత్తం.
- అలాంటి సున్నితమైన ప్రేమకథను తెరకెక్కించిన ఈయన రెండో ప్రయత్నంగా విరాటపర్వం సినిమాను తెరకెక్కించాడు. ఎన్నో వాయిదాల తరువాత ఈ చిత్రం మరికొద్ది గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.
- విరాటపర్వం సినిమా వరంగల్ గడ్డపై 1990 దశాబ్దంలో జరిగిన కథను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించాడు. ఒక వ్యక్తి మరణం వెనుక పొలిటికల్ హస్తం ఉందని తెలుసుకున్న ఆయన అప్పట్లో జరిగిన ఘటనలను వెండితెరపై చిత్రీకరించారు. ఇందులో చక్కటి ప్రేమకథను కూడా అల్లాడు.
- ఈ కథ 1990 దశకంలో జరుగుతుంది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ సినిమాలో పార్టీలను చూపిస్తారా..? లేదా అనేది చూడాలి. ఇందులో రానా పాత్రను నిజామాబాద్‌కు చెందిన శంకరన్న అనే వ్యక్తి స్ఫూర్తితో తీసుకున్నారు. సాయిపల్లవి పాత్రను వరంగల్‌కు చెందిన సరళ అనే మహిళను తీసుకొని సినిమా రూపొందించారు.
- ఈ చిత్రంలో రానా కామ్రెడ్ రవన్నగా.. సాయిపల్లవి వెన్నెలగా, కామ్రేడ్ భారతక్కగా ప్రియమణి నటించారు. వెన్నెల పాత్ర కోసం సాయిపల్లవి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే దశలో రోజు అంతా ఆహారం తీసుకోలేదట. నందితా దాస్, జరీనా వాహెబ్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర, సాయిచంద్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
- దర్శకుడు వేణు ఈ సినిమా ముందు వరకు సాయిపల్లవిని కలవలేదట. విరాటపర్వం కథను వినిపించేందుకు ఆమెను మొదటిసారి కలిశారట. కథ విన్న వెంటనే ఆమె ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పారట. ఈ చిత్రంలో మావోయిస్టులు, రాజకీయ నాయకులు ఓ అందమైన లవ్‌స్టోరీని తెరపై ఆవిష్కరించడంతో ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది.
- ఈ చిత్రానికి పని చేసిన టెక్నిషియన్ల విషయానికొస్తే.. దివాకర్ మణితో కలిసి స్పెయిన్‌కు చెందిన డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రానికి పీటర్ హెయిన్ తో కలిసి జర్మనీకి చెందిన స్టీఫెన్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బలి సంగీతం అందించారు.
- విరాటపర్వం అనేది మహాభారతంలో నాలుగవ పర్వం. అందులో కుట్రలు కుతంత్రాలు ఉన్నట్టే ఈ సినిమాలో కూడా కుట్రలు, రాజకీయాలు, ఫిలాసఫీ వంటి అంశాలను జోడించారు. ఈ సినిమాకు అందుకే విరాటపర్వం అనే టైటిల్ పెట్టారు.
- విరాటపర్వం సినిమా షూటింగ్ 2019, జూన్ 15న ప్రారంమైంది. తొలుత 2021 ఏప్రిల్ 30న విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావించారు. ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు కూడా వచ్చాయి. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని 2022 జులై 01న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే దానికి రెండు వారాల ముందుగానే జూన్ 17న విడుదల చేస్తున్నారు.
- విరాటపర్వం సినిమాలో 1990 నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్టు చూపించారు. దీనికోసం వైడ్ స్క్రీన్ ఫార్మాట్ ఉపయోగించారు.