రివ్యూ: గాడ్‌ ఫాదర్‌

రివ్యూ: గాడ్‌ ఫాదర్‌

చిత్రం: గాడ్‌ఫాదర్‌; నటీనటులు: చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరిజగన్నాథ్, మురళీశర్మ తదితరులు; సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌; సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌; నిర్మాత: రామ్‌చరణ్‌, ఆర్బీ చౌదరి. ఎన్వీ ప్రసాద్‌; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్‌రాజా; విడుదల: 05-10-2022

చిరంజీవి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకే కాదు.. ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ ఆసక్తి ఉంటుంది. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ఈ ఏడాది ‘ఆచార్య’ కాస్త గట్టిగానే షాక్ ఇచ్చింది. అయితే, ఈ దసరాకు ‘గాడ్‌ఫాదర్‌’గా తనదైన వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. మరోవైపు లూసిఫర్‌ మలయాళంలో చాలా పెద్ద హిట్‌ మూవీ. మోహన్‌లాల్‌కి ఉన్న చరిష్మాను మరో రేంజ్‌లో ఎలివేట్‌ చేసింది. పృథ్విరాజ్‌ కెరీర్లో డైరక్టర్‌గా గోల్డెన్‌ ఫిల్మ్. తెలుగులోనూ అనువాదమై ఓటీటీల్లో అందుబాటులో ఉంది. అన్నా చెల్లెలు, ఓ రాష్ట్రం సీఎం, ఫ్యామిలీ ఇబ్బందులు, పొలిటికల్‌ ఇష్యూస్‌.. స్థూలంగా ఇదే కథాంశం. ఇదే కథను తెలుగు నేటివిటీకి తగినట్లుగా ఎలా తెరకెక్కించారు? కింగ్ మేకర్‌గా చిరు మెప్పించారా?.. మాతృకతో పోలిస్తే ఏవి మెరుగ్గా ఉన్నాయి?.. సల్మాన్‌, నయన్‌, సత్యదేవ్‌ పాత్రలు అదనపు ఆకర్షణ తెచ్చాయా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం..

రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.రామదాసు (పీకేఆర్‌) మరణం తర్వాత రాజకీయ శూన్యం ఏర్పడుతుంది. సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై జన జాగృతి పార్టీ (జేజేపీ) తర్జనభర్జన పడుతుంటుంది. పీకేఆర్‌ స్థానంలో అధికారాన్ని హస్తగతం చేసుకుని సీఎం కావాలని అతడి అల్లుడు జైదేవ్‌ (సత్యదేవ్‌) భావిస్తాడు. అందుకు పార్టీలోని కొందరు దురాశపరులతో చేతులు కలుపుతాడు. అయితే, పీకేఆర్‌కు అత్యంత సన్నిహితుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు బ్రహ్మ తేజ (చిరంజీవి) మాత్రం జైదేవ్‌ సీఎం కాకుండా అడ్డు నిలబడతాడు. దీంతో జన జాగృతి పార్టీ నుంచి, అసలు ఈ లోకం నుంచే బ్రహ్మను పంపించడానికి జైదేవ్‌ కుట్రలు పన్నుతాడు. మరి ఆ కుట్రలను బ్రహ్మ ఎలా ఎదుర్కొన్నాడు? జైదేవ్‌ నీచుడన్న విషయం జైదేవ్‌ భార్య సత్యప్రియ (నయనతార)కు ఎలా తెలిసింది? రాష్ట్ర పాలన దురాశపరుల చేతిలో పడకుండా బ్రహ్మ ఎలా అడ్డుకున్నాడు? ఇంతకీ బ్రహ్మకు, పీకేఆర్‌కు ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో మసూద్‌ భాయ్‌ (సల్మాన్‌) ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మ‌ల‌యాళ సినిమా లూసిఫ‌ర్‌ను దాదాపు తెలుగు ప్రేక్షకులంద‌రూ చూశారు. ఆ సినిమాను తెలుగులో గాడ్ ఫాద‌ర్‌గా రీమేక్ చేయ‌ట‌మేంట‌ని ముందు చాలా మంది భావించారు. కానీ ఇప్పుడు సినిమా చూసిన త‌ర్వాత ఆ అభిప్రాయం త‌ప్పకుండా మార్చుకోవాల్సిందే. సినిమా ప్రధాన క‌థాంశం అదే తీసుకున్నారు. కొన్ని మెయిన్ సీన్స్ కూడా అదే స్టైల్లోనే చిత్రీక‌రించారు. కానీ క‌థ‌లో చేయాల్సిన ప్రధాన మార్పుల‌న్నింటినీ చ‌క్కగా చేశారు. మ‌న తెలుగు ప్రేక్షకుల‌కు న‌చ్చేలా మార్పులు చేశారు. అలాగే చిరంజీవి హీరోయిజాన్ని అభిమానులే కాదు.. ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించారు ద‌ర్శకుడు మోహ‌న్ రాజా. లూసిఫ‌ర్ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం గాడ్ ఫాద‌ర్‌ను చూస్తే కొత్తగా ఉన్నట్లు భావ‌న క‌లిగింది.

‘‘గాడ్‌ ఫాదర్‌’ స్క్రీన్‌ప్లే కొత్తగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి. ఇవన్నీ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. ఓపిక ఉంటే ‘లూసిఫర్‌’ని మరోసారి చూసి రండి’’ – ఇదీ ఇటీవల ఇంటర్వ్యూలో దర్శకుడు మోహన్‌రాజా చెప్పిన విషయం. తన స్క్రీన్‌ప్లే, మార్పులపై ఎంత నమ్మకంతో చెప్పారో దాన్నే తెరపై చూపించడంలో విజయం సాధించారు దర్శకుడు. ‘లూసిఫర్‌’ చూసిన వాళ్లు కూడా ‘గాడ్‌ఫాదర్‌’ను ఎంజాయ్‌ చేస్తారు. పీకేఆర్‌ మరణంతో సినిమా మొదలు పెట్టిన దర్శకుడు, కొద్దిసేపటికే అసలు కథేంటి? సినిమాలో పాత్రల తీరుతెన్నులు వివరంగా చెప్పేశారు. ఇక ప్రేక్షకుడు చూడాల్సింది తెరపై కనిపించే రాజకీయ చదరంగమే. ఈ చదరంగంలో రెండు బలమైన పావులుగా ఒకవైపు బ్రహ్మగా చిరంజీవి, జైదేవ్‌గా సత్యదేవ్‌లు నిలబడ్డారు. ఒక్కో సన్నివేశంలో ఒక్కొక్కరిది పై చేయి ఉంటుంది. అయితే, బ్రహ్మ పాత్ర కీలకం కావడంతో అంతర్లీనంగా అతడే ఒక మెట్టుపైన ఉంటాడు. చిరంజీవి కనిపించే ప్రతి సన్నివేశమూ ఆయన్ను ఎలివేట్‌ చేసిన విధానం స్టైలిష్‌గా బాగుంది. ఆ సన్నివేశాలకు తమన్‌ నేపథ్యం సంగీతం థియేటర్‌ను ఊపేసింది.

లూసిఫర్ తో పోలిక పక్కనపెట్టి ఈ సినిమా వరకు చర్చించుకుంటే చిరంజీవి ఆద్యంతం హుందాగా కనిపిస్తూ వయసుకు తగ్గట్టు కనిపించారు. అయితే ఆయన్నుంచి ఆశించే నామమాత్రపు డ్యాన్సు కూడా ఇందులో లేదు. చివర్లో వచ్చే తార్ మార్ టక్కర్ మార్ లో కూడా సరైన స్టెప్పు ఒక్కటి కూడా వేయలేదు. పైగా దానికి ప్రభుదేవా కోరియోగ్రఫీ. ఎంత చిరంజీవి వయసుని దృష్టిలో పెట్టుకున్నా ఆయననుంచి కనీసం ఖైది 150లో షూలేస్ స్టెప్పులాంటిదైనా ఆయన ఫ్యాన్స్ ఆశించడం సహజం. అది పెద్దగా శ్రమలేని స్టెప్పే. ఆ విషయంలో మాత్రం పూర్తిగా నిరాశ కలిగినట్టే. అసలు తార్ మార్ పాట పెట్టి ప్రయోజనం లేకుండా పోయింది.

ఈ సినిమాకు నీరవ్‌షా కెమెరా హైలైట్‌. మోహన్‌రాజా పల్స్ పట్టుకుని ప్రతి షాట్‌నీ ఎలివేట్‌ చేశారు తమన్‌. తమన్‌ మ్యూజిక్‌కి స్పెషల్‌ అప్లాజ్‌ వస్తుంది. అలాగే తప్పక మెన్షన్‌ చేయాల్సిన మరో పేరు లక్ష్మీభూపాల్‌. ప్రతి మాటనూ శ్రద్ధగా రాశారు. ఆయా కేరక్టర్ల బిహేవియర్‌ని, బాడీ లాంగ్వేజ్‌నీ బట్టి ఆయన రాసిన మాటలు మెప్పిస్తాయి. పూరి జగన్నాథ్‌ కేరక్టర్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. సునీల్‌, షఫి, దివి, గంగవ్వ, బ్రహ్మాజీ, సముద్రఖని,భరత్‌రెడ్డి, అనసూయ.. ఇలా ప్రతి పాత్రకూ స్క్రీన్‌ మీద న్యాయం చేశారు డైరక్టర్‌.


మే 21న వస్తున్న ‘తిమ్మరుసు’

‘బ్లఫ్ మాస్టర్‌, ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి చిత్రాలతో విలక్షణ హీరోగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’  ట్యాగ్‌లైన్. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జ‌వాల్కర్ హీరోయిన్‌.  ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 21న విడుద‌ల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
 
ఈ సంద‌ర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘తిమ్మరుసు’ సినిమా చిత్రీకరణంతా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. సత్యదేవ్‌ పవర్‌ఫుల్ లాయర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్‌, క్యారెక్టర్‌ డిజైనింగ్‌ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్‌ శరణ్‌ కొపిశెట్టి, పక్కా ప్లానింగ్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేశారు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంటుంది’’ అన్నారు.

నటీనటులు:
సత్యదేవ్‌,  ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, రవిబాబు, అంకిత్, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు

సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి
నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌
సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్రఫీ:  అప్పూ ప్రభాకర్‌
ఆర్ట్‌:  కిరణ్‌ కుమార్‌ మన్నె
యాక్షన్‌: వెంకట్ మాస్టర్,  రియల్‌ సతీశ్‌
పి.ఆర్‌.ఒ:  వంశీ కాక