శివుడిని మూర్తి రూపంలో పూజిస్తే మంచిదా?… లింగ రూపంలో పూజిస్తే మంచిదా?
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
శివుడిని మూర్తి రూపంలో పూజిస్తే మంచిదా.. లింగరూపంలో ప్రణమిస్తే మంచి ఫలితాలు కలుగుతాయా? అన్న అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ పరమాత్మ మహాభారతంలో చెప్పారు. శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయని శ్రీకృష్ణుడు చెప్పాడు. పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారి కంటే, శివలింగారాధన చేసేవారిలో తేజస్సు, శక్తి అధికంగా ఉంటాయని స్పష్టం చేశారు. మనకు లోకంలో అనేక రకాల లింగాలు కనిపిస్తాయి. అందులో రెండు లింగాల గురించి చెప్పుకుందాం….
లింగం అంటే గుర్తు, ప్రతిరూపం అని అర్దం. అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది. కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ….. ఇలా కదలని వాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు పరమశివుడు. అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న శివుడికి చేసే అపచారం. అలాగే ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవసరమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం శివుడికి ఇచ్చే గౌరవం. ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం కూడా శివుడికి అపచారమే.
రెండవది జంగమ లింగం. జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమి కీటకాలు లాంటివి. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. ఇక ఇది చలికాలం, అనేకమంది చలికి వణుకుతూ రోడలపై పడుకుంటారు. అటువంటి వారికి దుప్పట్లు పంచడం, ముష్టివారికి కాసింత అన్నం పెట్టడం, చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం, పీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి అర్చన క్రిందే వస్తుంది. మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి కానీ.. అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు.