‘పుష్ప’ కలెక్షన్ల జోరు.. బన్నీ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్

‘పుష్ప’ కలెక్షన్ల జోరు.. బన్నీ కెరీర్లోనే ఆల్‌టైమ్ రికార్డ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో పండగ వాతావరణం కొనసాగుతోంది. కరోనాతో కొన్నాళ్లుగా బోసిపోయిన సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు ‘అఖండ’‌తో కిక్కిరిసిపోయిన సంగతి తెలిసిందే. సరిగ్గా రెండు వారాలకు అల్లు అర్జున్ ‘పుష్ప’తో మరోసారి సందడి నెలకొంది. బన్నీ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘పుష్ప’ అంచనాలను అనుగుణంగా తొలిరోజు రికార్డుస్థాయి వసూళ్లు సాధించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.. బన్నీ గత సినిమా అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం.. సుకుమార్ కూడా రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో ఆ అంచనాలు పుష్ప సినిమాపై బాగా కనిపించాయి.

శుక్రవారం(డిసెంబర్ 17)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పుష్ప’ కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే అన్ని భాషల్లో కలిపి రూ.71 కోట్లు వసూలు చేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. పుష్ప సినిమాను ఆదరిస్తున్న అందరికి ధన్యవాదాలు తెలిపారు నిర్మాతలు. ఈ సందర్భంగా నిర్మాత ఎర్నేని నవీన్ మాట్లాడుతూ.. అన్ని భాషల్లో కూడా పుష్ప సినిమా రికార్డు తిరిగరాస్తోంది. బన్నీ నటనకు ఫ్యాన్స్‌ నుంచి భారీ స్పందన వస్తోంది. మొదటి రోజే ఇంత కలెక్షన్‌ వస్తుందని అనుకోలేదని పేర్కొన్నారు. తెలంగాణలో అదనపు షో పర్మిషన్ ఇవ్వడం మాకు ఎంతో కలిసి వచ్చిందని చెప్పుకొచ్చారు. వీకెండ్‌కు మంచి కలెక్షన్‌ వస్తుందని భావిస్తున్నాం. బన్నీకి మలయాళంలో మంచి పేరుంది. ఈ సినిమా ఇంతకుముందు సినిమాల కంటే భారీ ఎత్తున వసూలు చేస్తుంది. ప్రపంచంలోనే తెలుగు ఆడియన్స్ లాంటి వాళ్ళు లేరు. ఈ సినిమాను ఇంత ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలిపారు.

సుకుమార్ దర్శకత్వం, బన్నీ నటన, సినిమాటోగ్రఫీతో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్​గా మారాయి. సమంత స్పెషల్ సాంగ్ కూడా థియేటర్లకు జనాల్ని రప్పించడంలో సఫలమైంది. అన్ని ఏరియాలకు మించి ‘పుష్ప’ నైజాం ఏరియాలో ఏకంగా తొలిరోజే 11.44 కోట్ల షేర్​తో ఆల్​టైమ్ రికార్డు సృష్టించింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం, ఐదో షోకు పర్మిషన్, టికెట్ రేట్ల పెంపు భారీ కలెక్షన్లకు సహాయపడ్డాయి.


సుక్కూ-బన్నీ హ్యాట్రిక్ కాంబో: ‘పుష్ప’ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

ఆర్య, ఆర్య-2 చిత్రాలతో టాలీవుడ్‌లో హిట్‌ కాంబినేషన్‌గా ముద్రపడ్డారు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వారిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కింది ‘పుష్ప’. 12 ఏళ్ల తర్వాత బన్నీ, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్‌ ‘పుష్ప – ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా దొరకని శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే అరుదైన ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

  • అల్లు అర్జున్‌ – సుకుమార్‌ తొలిసారి 2004లో ‘ఆర్య’తో మంచి హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత 2009లో ‘ఆర్య 2’తో అలరించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి చేస్తున్న చిత్రం ‘పుష్ప’.
  • అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ఇదే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేశారు. ‘పుష్ప’రాజ్‌ పాత్ర కోసం అల్లు అర్జున్‌ ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. చిత్తూరు యాస నేర్చుకున్నారు.
  • ‘పుష్ప’ సినిమాకు ₹160 కోట్ల నుంచి ₹180 కోట్లు ఖర్చు చేశారని భోగట్టా. రెండో భాగం చిత్రీకరణను ఫిబ్రవరిలో ప్రారంభిస్తారట.
  • అల్లు అర్జున్‌ ‘పుష్ప’ గెటప్‌లో రెడీ అయ్యేందుకు మేకప్‌ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదట. తెల్లవారుజామున 4.30 నిద్రలేచి.. ఐదుకల్లా సెట్‌కెళ్లి.. 5 నుంచి 7 వరకూ మేకప్‌ కోసమే ఓపిగ్గా కూర్చొనేవారట. షూట్‌ పూర్తయ్యాక మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు పట్టేదని బన్నీ చెప్పారు.
  • ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ‘పుష్ప’అత్యధిక భాగం అడవుల్లో చిత్రీకరించారు. అందుకోసం చిత్ర బృందం మారేడుమిల్లి అడవులను ఎంచుకుంది.
  • కొన్ని రోజులు కేరళ అడవుల్లో చిత్రీకరణ జరిగింది. కృత్రిమ దుంగల్ని చిత్రీకరణ కోసం అక్కడకు తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు అక్కడి పోలీసులు పట్టుకున్నారట. ఇది ఎర్రచందనం కాదన్నా, తాము సినిమా వాళ్లమని చెప్పినా వాళ్లు వినలేదట. అవి సినిమా కోసం తయారు చేసినవని నిరూపించాక గానీ వదిలిపెట్టలేదట.
  • యూనిట్‌ మొత్తాన్ని మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకెళ్లడానికి రోజూ దాదాపు 300 వాహనాలను ఉపయోగించేవారు.
  • తొలి రోజు చిత్రీకరణే 1500 మంది నేపథ్యంలో సాగింది. ఎర్రచందనం కృత్రిమ దుంగలు ఒకొక్కసారి వేల సంఖ్యలో అవసరమయ్యేవి. ఫోమ్‌, ఫైబర్‌ కలిపి కృత్రిమ దుంగల్ని తయారు చేశారు. ఎర్రచందనం దుంగలు, యూనిట్‌ సామాగ్రిని అడవుల్లోకి తీసుకెళ్లడానికి కష్టమయ్యేది. ఇందుకోసం అడవుల్లో కొన్ని చోట్ల మట్టి రోడ్లు కూడా వేయాల్సి వచ్చింది.
  • ‘పుష్ప’ కోసం అడవుల్లో రోజూ 500 మందికి పైగా పనిచేవారట. ఇక ఈ సినిమాలో ఓ పాటను దాదాపు 1000మందితో చిత్రీకరించారు.
  • సునీల్‌ ఇందులో మంగళం శ్రీను అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. విలన్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్‌ కమెడియన్‌గా పేరు తెచ్చుకోవటం గమనార్హం. అయితే పాన్ ఇండియాలో విలన్‌గా చేస్తూ తన కోరిక నెరవేర్చుకున్నారు.
  • ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌, కన్నడ నటుడు ధనుంజయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర మొదటి విజయ్‌ సేతుపతిని అడిగారు. కానీ డేట్స్‌ కుదరక ఆయన చేయలేకపోయారు.
  • సుకుమార్‌- దేవిశ్రీ ప్రసాద్‌ కలిసి వరుసగా చేస్తున్న ఎనిమిదో చిత్రం ‘పుష్ప’. ఇప్పటివరకూ విడుదలైన సాంగ్స్‌ అన్నీ కలిసి మొత్తంగా 250 మిలియన్‌ వ్యూస్‌కు పైగా సాధించాయి.
  • ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టారట.
  • మైత్రీ మూవీ మేకర్స్‌తో రష్మికకు ఇది రెండో చిత్రం మొదటి చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌ చేశారు.’ అలాగే దర్శకుడు సుకుమార్‌కు మైత్రీ వారితో ఇది రెండో చిత్రమే మొదటిది ‘రంగస్థలం’.
  • ‘పుష్ప’ను మొదట ఒక చిత్రంగా తీయాలనుకున్నారు. కానీ, కథ పెద్దది కావడంతో రెండు భాగాలు చేశారు. ‘పుష్ప: ది రైజ్’ ఇప్పుడు విడుదలవుతోంది. ఈ సినిమా రన్‌ టైమ్‌ 2 గంటలా 59 నిమిషాలు.
  • తొలి పార్ట్‌లో రష్మిక పాత్ర నిడివి తక్కువగానే ఉంటుంది. ఆమె రెండో పార్టులో విశ్వరూపం చూపిస్తుందట. ఫహద్‌ ఫాజిల్‌ కూడా సినిమా ఆఖరులోనే వస్తారని టాక్‌.
  • ఈ సినిమాలో సమంత ‘ఉ అంటావా… ఊఊ అంటావా’ అనే ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఆమె కెరీర్‌లో తొలిసారి ఇలా కనిపిస్తోంది. సమంత ఐటెమ్‌ సాంగ్‌ కోసం పెద్ద మొత్తంలోనే పారితోషికం అందుకుందని టాక్‌. పాట కోసం ఆమెకు కోటిన్నర రూపాయలు ఇచ్చారట. మొత్తంగా ఈ పాటకు చిత్రబృందం రూ. ఐదు కోట్లు బడ్జెట్‌ పెట్టిందని టాక్‌.
  • ఈ సినిమాలో పాటలకు చాలామంచి పేరు వస్తోంది. అన్నింటినీ చంద్రబోసే రాశారు. ‘ఉ అంటావా… ఊ ఊ అంటావా..’ పాటను ఆలపించిన ఇంద్రావతి చౌహాన్‌… ప్రముఖ సింగర్‌ మంగ్లీ చెల్లెలు.

‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’…. యూట్యూబ్‌లో రికార్డుల మోత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత ఓ ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజైన ఈ సాంగ్ లిరికల్ వీడియో Youtubeలో ట్రెండ్ అవుతూ భారీ వ్యూస్‌ను రాబడుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో మొదటి భాగం ‘పుష్ప: ది రైజ్ పార్ట్ 1’ ఈ డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇప్పటికే ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రిలీజైన ‘ఊ అంటావా… ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్‌కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో సమంత ఆడిపాడగా… యూట్యూబ్‌లో ఇప్పటి వరకు అన్ని బాషల్లో కలిపి 45 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు 1.6 మిలియన్స్‌కు పైగా లైక్స్ రావడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ – ముత్తం శెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.