పగపగపగ… రివ్యూ

పగపగపగ… రివ్యూ

నటీనటులు: కోటి, అభిలాస్‌ సుంకర, దీపిక ఆరాధ్య, బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు తదితరులు
నిర్మాత : సత్య నారాయణ సుంకర
దర్శకత్వం : రవి శ్రీ దుర్గా ప్రసాద్
సంగీతం : కోటి
సినిమాటోగ్రఫీ : నవీన్ కుమార్ చల్లా
ఎడిటర్ : పాపారావు
విడుదల తేది: సెప్టెంబర్‌ 22,2022

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో నటించిన చిత్రం ‘పగ పగ పగ’. అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సత్యనారాయణ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్‌, మూవీ మోషన్ పోస్టర్‌, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌‌కు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్‌ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకులందరికీ ఉచితంగా చూపిస్తామని నిర్మాతలు ప్రకటన చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కంటెంట్‌పై నమ్మకంతో నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం సినిమాపై ఆసక్తిని పెంచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

కథేంటంటే..
‘పగపగపగ’ సినిమా కథ అంతా 1985, 1990, 2006వ సంవత్సరాల కాలంలో సాగుతుంది. బెజవాడలోని బెజ్జోనిపేటకు చెందిన జగ్గుభాయ్‌(కోటి), కృష్ణ(బెనర్జీ) కాంట్రాక్ట్‌ కిల్లర్స్‌. ఒక్కసారి డీల్‌ కుదుర్చుకుంటే ప్రాణాలు పోయినా పూర్తి చేయడం వీరి స్పెషాలిటీ. అయితే కృష్ట పోలీసు హత్య కేసులో అరెస్ట్‌ అవుతాడు. ఆ సమయంలో జగ్గూభాయ్‌కి కూతురు సిరి(దీపిక ఆరాధ్య) పుడుతుంది. కృష్ణ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుతానని మాట ఇచ్చిన జగ్గు.. అతను జైలుకు వెళ్లగానే ఆ ఊరి నుంచి పారిపోతాడు. తర్వాత హత్యలను చేయడం మానేసి జగదీష్‌ ప్రసాద్‌గా పేరు మార్చుకొని పెద్ద వ్యాపారవేత్తగా మారతాడు.

మరోవైపు కృష్ణ ఫ్యామిలీ మాత్రం కష్టాలు పడుతూనే ఉంటుంది. అతని కొడుకు అభి(అభిలాష్‌)ని చదువులో రాణిస్తాడు. అభి చదువుకునే కాలేజీలోనే సిరి చేరుతుంది. ఈ క్రమంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమించుకుంటారు. జగదీష్‌ మాత్రం వీరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తను గారాబంగా పెంచుకున్న కూతురిని తీసుకెళ్లిన అభిపై జగదీష్‌ పగ పెంచుకుంటాడు. అల్లుడిని చంపడానికి ఓ ముఠాతో డీల్‌ కుదుర్చుకుంటాడు. కానీ కూతురు ప్రెగ్నెన్సీ అని తెలిసి ఆ డీల్‌ని వద్దనుకుంటాడు. ఇంతలోపే ఆ డీల్‌ చేతులు మారి చివరకు బెజ్జోనిపేటకు చెందిన ఓ వ్యక్తికి చేరుతుంది. అసలు ఆ డీల్‌ తీసుకుంది ఎవరు? తన అల్లుడిని కాపాడుకోవడానికి జగదీష్‌ చేసిన ప్రయత్నం ఏంటి? అభి తండ్రి కృష్ణ చివరకు ఏం చేశాడు? అభి ప్రాణాలను ఎవరు రక్షించారు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు రవి శ్రీ దుర్గా ప్రసాద్. ఆయన ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉంది. అందుకు అనుగుణంగానే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించేందుకు 100శాతం కష్టపడ్డాడు. కొన్ని సీన్లలో ఆయన టేకింగ్ మెస్మరైజ్ చేస్తుంది. పాత్రలకు తగినట్లుగా నటీనటులను ఎంపిక చేసుకోవడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. వారి నుంచి నటన కూడా బాగానే రాబట్టుకున్నాడు.

అభి, సిరిల మధ్య కెమిస్ట్రీ బాగుంది. జగ్గూభాయ్‌ కాస్త జగదీష్‌ ప్రసాద్‌గా మారడం.. వ్యాపారంలో రాణించడం.. అదేసమయంలో కృష్ణ కష్టాలతో బాధపడడం, సిరి, అభిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. అసలు కథ అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. కాంట్రాక్ట్‌ కిల్లర్‌ని పట్టుకునేందుకు జగ్గుభాయ్‌ చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఈ కథకి పోకిరి సినిమాలోని ఓ సన్నివేశాన్ని లింక్ చేయడం బాగుంది. క్లైమాక్స్‌ ప్రేక్షకుడి ఉహకు భిన్నంగా, టైటిల్‌కి తగ్గట్టుగా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే..
కెరీర్‌లో మొదటిసారి విలన్‌ పాత్ర పోషించాడు సంగీత దర్శకుడు కోటి. జగ్గూ అలియాస్‌ జగదీష్‌ ప్రసాద్‌ పాత్రకు తగిన న్యాయం చేశాడు. విలన్‌గా, హీరోయిన్‌కి తండ్రిగా నటనలో అదరగొట్టేశాడు. హీరో అభిలాష్‌కి ఇది తొలి సినిమా అయినప్పటికీ చక్కగా నటించాడు. సీరియస్‌, కామెడీ సీన్స్‌తో పాటు యాక్షన్‌ ఎడిసోడ్స్‌లోనూ అదరగొట్టేశాడు. హీరోయిన్‌గా సిరి పాత్రలో దీపిక మెప్పించింది. బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవా తదితరులు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. కోటి సంగీతం ఈ సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. నవీన్ కుమార్ చల్లా సినిమాటోగ్రఫీ, పాపారావు ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

ఆకట్టుకున్న దర్శకుడు

శ్రీ రవి దుర్గా ప్రసాద్ కొత్త దర్శకుడు అయినప్పటికీ ఈ సినిమాను కథనం పరంగా బాగానే డీల్ చేశాడనిపిస్తుంది. ఈ చిత్రంలో నటించిన వారిలా చాలామంది కొత్తవారే. సంగీత దర్శకుడిగా కోటి మాత్రమే ప్రేక్షకులకు పరిచయస్తుడు. అయితే నటుడిగా కోటిని ప్రేక్షకులు ఊహించని కోణంలో చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ఆయన క్యారెక్టరే హైలెట్ అయింది. హీరో హీరోయిన్లు కొత్తవారు అయినప్పటికీ వారి నుంచి హావభావాలు రాబట్టడంలో కృతకృత్యులయ్యారు. సినిమా ఫస్టాఫ్ కామెడీ, అదిరిపోయే డైలాగులతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందోనన్న ఆతృతను ప్రేక్షకుడిలో కలిగించారు. చాలా సీన్లు మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసినా.. ఓవరాల్‌ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా మెప్పించేలా ఉంది. ఇంత మంచి కంటెంట్‌తో తెరకెక్కించిన ‘పగపగపగ’ చిత్రాన్ని అదేస్థాయిలో ప్రమోట్ చేయలేదనిపిస్తోంది. నిర్మాతలు పబ్లిసిటీ మీద కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. కాస్త పరిచయం ఉన్న హీరోహీరోయిన్ల పెట్టుకుంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది. అయినప్పటికీ కొత్త నటులతో ఆయన తెరకెక్కించిన విధానాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.


రివ్యూ: రంగ రంగ వైభవంగా

చిత్రం: రంగ రంగ వైభ‌వంగా; న‌టీన‌టులు: వైష్ణవ్ తేజ్‌, కేతికా శ‌ర్మ‌, న‌వీన్ చంద్ర‌, న‌రేశ్‌, ప్రభు, తుల‌సి, ప్రగ‌తి, సుబ్బరాజు, అలీ, రాజ్‌కుమార్ క‌సిరెడ్డి, హ‌ర్షిణి త‌దిత‌రులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వర‌రావు; ఛాయాగ్రహ‌ణం: శ్యామ్‌ద‌త్ సైనుద్దీన్‌; నిర్మాత‌: బివిఎస్ఎన్ ప్రసాద్‌; క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: గిరీశాయ‌; విడుద‌ల తేదీ: 02-09-2022

వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ‘ఉప్పెన’ (Uppena) అనే సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడుగా.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ‘కొండపొలం’ (Kondapolam) సరిగా ఆడకపోయినా.. నటుడిగా అతనికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మూడో సినిమా – ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) విడుదలైంది. చినమామయ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు నాడు ఈ సినిమా విడుదలవడం వైష్ణవ్ తేజ్‌కి ప్లస్ పాయింట్‌గా భావించారు. దీనికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇచ్చారు ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) కథానాయికగా చేసింది. ఈ ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ఎలా ఉందో చూద్దాం..

స్నేహానికి నిలువెత్తు నిద‌ర్శనం రాముడు (ప్రభు), చంటి (న‌రేష్‌). ఇద్దరివీ ప‌క్క ప‌క్క ఇళ్లే. చంటి కొడుకు రిషి (వైష్ణవ్ తేజ్‌), రాముడు కూతురు రాధ (కేతికా శ‌ర్మ‌).. ఇద్దరూ ఒకే రోజున‌.. ఒకే ఆస్పత్రిలో జ‌న్మిస్తారు. ఈ త‌ల్లిదండ్రుల‌ మ‌ధ్య ఉన్న చ‌క్కటి స్నేహ బంధ‌మే పిల్లల మ‌ధ్య మొగ్గ తొడుగుతుంది. అయితే రిషి, రాధ‌ స్నేహం స్కూల్ డేస్‌లోనే ప్రేమ బంధంగా మారుతుంది. స్కూల్‌లో జ‌రిగిన ఓ చిన్న సంఘ‌ట‌న వీరిద్దరి మ‌ధ్య దూరం పెంచుతుంది. ఇగోతో పంతాల‌కు పోయి ఒక‌రితో మ‌రొక‌రు మాట్లాడుకోవ‌డం మానేస్తారు. ఇద్దరూ ఒకే మెడిక‌ల్ కాలేజీలో చ‌దువుతున్నా.. ఒక‌రితో ఒక‌రు ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. కానీ, ఇద్దరికీ ఒక‌రంటే మ‌రొక‌రికి చ‌చ్చేంత ప్రేమ. ఈ జంట మ‌ధ్యనున్న ఇగో వార్ చ‌ల్లారి.. ఒక్కట‌య్యే స‌మ‌యంలోనే వీరి కుటుంబాల్లో మ‌రో ప్రేమ‌క‌థ అలజ‌డి రేపుతుంది. అది రిషి అన్నయ్య‌.. రాధ అక్క ప్రేమ‌క‌థ‌. వీరి వ‌ల్ల రిషి – రాధ‌ ప్రేమ ఎందుకు స‌మ‌స్యల్లో ప‌డింది? ప్రాణ స్నేహితులుగా ఉన్న కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వ‌డానికి కార‌ణ‌మేంటి? ఇందులో రాధ అన్నయ్య వంశీ (న‌వీన్ చంద్ర‌) పాత్ర ఏంటి? ఈ రెండు ప్రేమ‌క‌థ‌లు ఎలా సుఖాంత‌మ‌య్యాయి? రెండు కుటుంబాల్ని ఒక్కటి చేయ‌డానికి రిషి చేసిన సాహ‌సాలేంటి? అన్నది మిగిలిన క‌థ‌.

ఈ సినిమాతో గిరీశాయ (Gireesaaya) అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. కథ, స్ర్కీన్‌ప్లే కూడా ఆయనే అందించాడు. కానీ ఒక పాత కథను తీసుకొని కొంచెం అటు ఇటు మార్చడం తప్ప గిరీశాయ చేసిందేమీ లేదు. అలాగే దర్శకుడిగా సినిమాని ఆసక్తికరంగానూ చిత్రీకరించలేకపోయాడు, ఎందుకంటే కథలో పట్టులేదు కాబట్టి. ప్రేక్షకులకి రాబోయే సన్నివేశాలు ఏ విధంగా వుంటాయో, ఏమి జరగబోతుందో అనేది ముందే తెలిసిపోతుంది. ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. ‘కంటెంట్ బాగుండాలి…’ అని అంటూ ఉంటారు కదా, మరి ఒక సీనియర్ నిర్మాత అయిన బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ కథని ఎలా అంగీకరించారో ఆయనకే తెలియాలి. అందుకని కాబోలు ఆయన ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. (Ranga Ranga Vaibhavanga Review)

ఎవ‌రెలా చేశారంటే: రిషి పాత్రలో వైష్ణవ్ స్టైలిష్ లుక్‌తో ఆక‌ట్టుకునేలా క‌నిపించారు. కొన్ని స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌న‌, ప‌లికించిన హావ‌భావాలు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను గుర్తు చేస్తాయి. అయితే క‌థ‌లోనే స‌రైన బ‌లం లేక‌పోవ‌డంతో న‌ట‌న ప‌రంగా ఆయ‌న కొత్తగా చేయడానికి అవ‌కాశం దొర‌క‌లేదు. వైష్ణవ్‌కు జోడీగా కేతిక అంద‌చందాల‌తో ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం చేసింది. ఇద్దరి మ‌ధ్య కెమిస్ట్రీ చ‌క్కగా కుదిరింది. న‌వీన్ చంద్ర‌, ప్రభు, న‌రేశ్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేరకు నటించారు. ద‌ర్శకుడు క‌థ రాసుకున్న విధానం.. దాన్ని తెర‌పై ఆవిష్కరించిన తీరు ఏమాత్రం ప్రేక్షకుల్ని మెప్పించ‌దు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి కాస్త బ‌లాన్నిచ్చింది. మూడు పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. శ్యామ్ ద‌త్ ఛాయాగ్రహ‌ణం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.


‘సలార్’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. అభిమానుల్లో టెన్షన్

బాహుబలి తర్వాత ప్రభాస్ నుండీ వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె.. వంటి చిత్రాల పై అభిమానులకు పెద్దగా అంచనాలు లేవు. వారి చూపంతా కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న సలార్ పైనే ఉన్నాయి. కే.జి.ఎఫ్ రేంజ్‌లో ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తాడు అని అంతా ఆశిస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంటూ వచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ముందుగా 2022 లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని ప్రకటించినా రిలీజ్ డేట్ వాయిదా వేసుకోక తప్పలేదు.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్మాతలు సలార్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2023 సెప్టెంబర్ 28 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ప్రభాస్ రెండు కత్తులు పట్టుకుని శత్రుసంహారం చేస్తున్నట్టు ఈ పోస్టర్ ఉండగా …’ రెబలింగ్.. వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 28th 2023′ అంటూ అందులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అయితే సెప్టెంబర్ 28 ప్రభాస్ అభిమానులను డిజప్పాయింట్ చేసిన డేట్ అనే చెప్పాలి. అదే డేట్ కు 2012 లో రెబల్ అనే చిత్రం రిలీజ్ అయ్యింది. ప్రభాస్ రెండు హిట్లు కొట్టి ఫాంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ డిజాస్టర్‌‌గా నిలిచింది. ఇప్పుడు అదే డేట్‌తో వస్తున్న ‘సలార్‌’పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


భర్త మరణం తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్న మీనా

తెలుగు తమిళ భాషలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా భర్త విద్యాసాగర్ జూన్ 29వ తేదీ ఊపిరితిత్తుల సమస్యతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విద్యాసాగర్ మృతి చెందడంతో మీనా ఎంతగానో కృంగిపోయింది. మీనా భర్త మరణం అనంతరం పలువురు సెలబ్రిటీలు తన ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శిస్తూ తనకు మనోధైర్యం చెప్పారు. అయితే మీనా ఇప్పుడిప్పుడే తన భర్త జ్ఞాపకాల నుంచి మెల్లిగా బయటపడి తిరిగి మామూలు మనిషి అవుతున్నట్టు తెలుస్తుంది. భర్త మరణం తర్వాత మీనా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 13 అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం కావడంతో ఈమె ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

తన భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అవయవాలు దానం చేసేవారు లేక మృతి చెందారని, తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని అందుకే తన మరణాంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు మీనా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మీనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఈ సందర్భంగా మీనా ఒక పోస్ట్ చేస్తూ తాను అవయవాలను దానం చేస్తున్నానని ఒక మనిషి ప్రాణం కాపాడటం కన్నా గొప్ప పని ఏదీ లేదంటూ చెప్పుకొచ్చారు.ఒక మనిషి చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయటం వల్ల ఎనిమిది మంది ప్రాణాలను కాపాడువచ్చని వెల్లడించారు. ఇలా అవయవాలు దానం చేసేవారు లేకే తన భర్తను కోల్పోయానని లేకపోతే తన భర్త తనతో పాటే ఉండేవారని మీనా ఆవేదనకు గురయ్యారు.


రివ్యూ: బింబిసార

చిత్రం: బింబిసార‌
న‌టీన‌టులు: నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, కేథ‌రిన్‌, సంయుక్తా మేన‌న్‌, వివాన్ భ‌టేనా, ప్రకాష్ రాజ్, త‌నికెళ్ల భ‌ర‌ణి, అయ్యప్ప శ‌ర్మ, శ్రీనివాస్ రెడ్డి, వ‌రీనా హుస్సేన్ త‌దిత‌రులు
మ్యూజిక్: చిరంత‌న్ భ‌ట్‌, ఎం.ఎం.కీర‌వాణి
మాట‌లు: వాసుదేవ మునేప్పగారి
ఛాయాగ్రహ‌ణం: ఛోటా కె.నాయుడు
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: వ‌శిష్ఠ
నిర్మాణ సంస్థ: ఎన్టీఆర్ ఆర్ట్స్‌
విడుద‌ల తేదీ: 05-08-2022

జ‌యాప‌జ‌యాల‌ను ప‌ట్టించుకోకుండా కొత్త క‌థ‌ల్ని భుజానికెత్తుకుంటూ.. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిస్తూ సినీ కెరీర్‌ను వైవిధ్యభ‌రితంగా ముందుకు తీసుకెళ్తున్నారు క‌థానాయ‌కుడు క‌ల్యాణ్ రామ్‌. ఈ క్రమంలోనే ఇప్పుడాయ‌న‌ ‘బింబిసార’గా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు. కొత్త ద‌ర్శకుడు వశిష్ఠ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో సాగే సోషియో ఫాంట‌సీ సినిమా కావ‌డం.. ఇందుకు త‌గ్గట్లుగానే ప్రచార చిత్రాలు చ‌క్కటి గ్రాఫిక్స్ హంగుల‌తో ఆస‌క్తిరేకెత్తించేలా ఉండటంతో అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది. మ‌రి ఈ బింబిసారుడి క‌థేంటి? ఆయ‌న చేసిన కాల ప్రయాణం ప్రేక్షకుల‌కు ఎలాంటి అనుభూతిని అందించింది?.. తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం…

కథ
త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్‌ రామ్‌). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్‌ ట్రావెల్‌ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిన నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్‌ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ‘బింబిసార’ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.

క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో ‘బింబిసార’ను తెరకెక్కించారు డైరెక్టర్‌ వశిష్ఠ. ‘ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌’ అనే ఒక్క క్యాప్షన్‌తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు.

న‌టీన‌టుల విషయానికి వ‌స్తే.. అత‌నొక్కడే, త్రీడీ మూవీగా తెరకెక్కిన ఓం వంటి సినిమాల‌ను గ‌మ‌నిస్తే హీరోగా, నిర్మాత‌గా చేసిన క‌ళ్యాణ్ రామ్ స్టైల్‌ను ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఆయ‌న కొత్తదనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అర్థం చేసుకోవ‌చ్చు. అదే ప్యాష‌న్‌తో బింబిసార సినిమాలో యాక్ట్ చేశారు. ఇప్పటివ‌ర‌కు ఆయ‌న రాజ్యాన్ని పాలించిన చ‌క్రవ‌ర్తి పాత్రను పోషించ‌లేదు. కానీ ఏదో ఒక వెరైటీని అందించాల‌నే ల‌క్ష్యంతో డిఫ‌రెంట్ లుక్‌, బాడీ లాంగ్వేజ్‌ను ఆపాదించుకుని బింబిసారుడు అనే పాత్ర‌ను క్యారీ చేశాడు. ఆ పాత్ర కోసం త‌ను ఎంత క‌ష్ట‌ప‌డ్డాడ‌నేది సినిమాలో తెర‌పై క‌నిపిస్తుంది. లుక్‌తో పాటు డైలాగ్ డెలివ‌రీని ఆయ‌న చేంజ్ చేసుకున్నారు. అంతే కాదండోయ్ నెగిటివ్ ట‌చ్‌లో సాగే పాత్ర అనే చెప్పాలి. ఈ పాత్ర‌లో విల‌నిజాన్ని చూపించ‌డానికి వంద శాతం ట్రై చేశారు. అందులో స‌క్సెస్ అయ్యారు.

మెయిన్ విల‌న్‌గా న‌టించిన వివాన్ త‌న ప‌రిధి మేర‌కు చ‌క్కగా న‌టించారు. హీరోయిన్స్‌గా న‌టించిన క్యాథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్ పాత్రలు ప‌రిమితంగానే ఉన్నాయి. జుబేదా పాత్రలో శ్రీనివాస రెడ్డి కామెడీతో ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం చేశారు. అలాగే చ‌మ్మక్ చంద్ర పాత్ర చిన్నదే అయినా న‌వ్వించారు. ప్ర‌కాష్ రాజ్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు త‌మ‌దైన న‌ట‌న‌తో అల‌రించారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్‌ చేసిన కల్యాణ్‌ రామ్‌ ‘బింబిసార’ సినిమా కచ్చితంగా చూడాల్సిందే.



అలనాటి హాస్యనటుడు సారథి కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో మరొ విషాదం చోటుచేసుకుంది. తన కామెడీతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ కమెడియన్ సారధి సోమవారం(ఆగస్ట్ 1) కన్నుమూయడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న సారథి అంటే తెలియని సినీ ప్రముఖులు ఉండరు. కేవలం ఒక నటుడిగానే కాకుండా ఆయన చిత్ర పరిశ్రమలో ఎన్నో సంక్షేమ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నారు. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవ ఎన్నటికీ మరువలేనిది అని చాలామంది సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు.

వయసు రీత్యా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సారథి సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు కడలి జయ సారధి. ఇటీవల 83వ వసంతంలో అడుగుపెట్టిన ఆయన హఠాత్తుగా కన్నుమూయడం అందరిని షాక్ గురి చేసింది. సినిమాలకు స్వస్తి చెప్పిన అనంతరం ఆయన ఎక్కువగా తన సొంత గ్రామంలో వ్యవసాయం చేస్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు.

1960లో ‘సీతారామ కళ్యాణం’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన సారథి ఆ తర్వాత అనేక సినిమాల్లో హాస్య పాత్రల్లో కనిపించి ఎంతగానో మెప్పించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 372 సినిమాల్లో నటించారు. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసులోనే ఉండేది. సీనియర్ నటీనటులు అందరూ ఎలాగైనా తెలుగు రాష్ట్రంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఉండాలని చేసిన పోరాటంలో సారథి క్రియాశీలకంగా వ్యవహరించారు. మద్రాసు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బలపడడంలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సంస్థకు కూడా ఆయన వ్యవస్థాపక కోశాధికారిగా కూడా పనిచేశారు. నాటక రంగంలో ఎన్నో సేవలు చేశారు. నరసింహరావు, రేలంగి, వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి మహానటులతో కూడా ఆయన నాటక రంగంలో కలిసి నటించారు.

సారధి కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించారు. ధర్మాత్ముడు. అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు అనే చిత్రాలను నిర్మించిన ఆయన మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కృష్ణంరాజుతో సోదర భావంతో కనిపించేవారు. కృష్ణంరాజు నిర్మించిన చాలా సినిమాలకు మ్యూజిక్ సిటింగ్స్‌‌లో పాల్గొంటూ పనులను దగ్గరుండి చూసుకునేవారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పేద సినీ కార్మికులకు చాలాసార్లు అండగా నిలిచారు. ముఖ్యంగా చిత్రపురి కాలనీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.


‘రామారావు ఆన్ డ్యూటీ’ రివ్యూ

చిత్రం: రామారావు ఆన్‌ డ్యూటీ
నటీనటులు: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సార్‌పట్ట’ ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు
సంగీతం: సామ్ సీఎస్‌
ఛాయాగ్రహ‌ణం: సత్యన్ సూర్యన్
కూర్పు: ప్రవీణ్ కెఎల్
క‌ళ‌: సాహి సురేష్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
నిర్మాణ సంస్థలు: ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీమ్‌వర్క్స్
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
విడుద‌ల తేదీ‌: 29-07-2022

మాస్ హీరో సినిమా విడుద‌ల‌వుతోందంటే చాలు టాలీవుడ్ బోలెడ‌న్ని ఆశ‌ల‌తో బాక్సాఫీస్‌ వైపు చూస్తోంది. మునుప‌టిలా థియేట‌ర్ నిండుతుందా?.. ఎప్పట్లా సంద‌డి క‌నిపించేనా అని. ప్రేక్షకుల్ని ఇదివ‌ర‌క‌టిలా ఉత్సాహంగా థియేట‌ర్‌కి తీసుకొచ్చే సినిమాల్లేక, రాక కొన్నాళ్లుగా బాక్సాఫీసు క‌ళ త‌ప్పింది‌! ఈ వారం మాస్ హీరో ర‌వితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుద‌లైంది. ప్రచార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది?. రవితేజ ప్రభుత్వ అధికారిగా ఏం చేశారు? అనేది రివ్యూలో చూద్దాం.

రామారావు (ర‌వితేజ‌) ఓ డిప్యూటీ క‌లెక్టర్‌. నిజాయ‌తీగా విధులు నిర్వర్తిస్తాడ‌ని పేరు. అనుకోకుండా త‌న సొంత ఊరికి బదిలీ అవుతాడు. చిత్తూరు జిల్లాల్లోని ఆ ఊరిని కేంద్రంగా చేసుకుని ఎర్రచంద‌నం మాఫియా అక్రమాలకి పాల్పడుతుంటుంది. చిన్నప్పట్నుంచి త‌నతో క‌లిసి చ‌దువుకున్న మాలిని (ర‌జీషా విజ‌య‌న్‌) క‌ష్టంలో ఉంద‌ని తెలుసుకుని రామారావు ఆమె దగ్గరికి వెళ‌తాడు. ఆమె భ‌ర్త మిస్సింగ్ అని, అత‌న్ని వెతక‌డం కోసం వెళ్లిన మావ‌య్య కూడా ప్రమాదంలో మ‌ర‌ణించాడ‌ని తెలుసుకుంటాడు. ఆమెకి సాయం చేయాల‌ని రంగంలోకి దిగుతాడు రామారావు. ఈ క్రమంలో ఎర్రచంద‌నం మాఫియా వెలుగులోకి వ‌స్తుంది. మాలిని భ‌ర్తలాగే, ఆ ఊరికి చెందిన మ‌రో 20 మంది పేద‌ల్ని ఆ మాఫియా బ‌లి తీసుకుంద‌ని ప‌సిగ‌డ‌తాడు. మ‌రి ఆ మాఫియాని రామారావు ఎలా బ‌య‌టికి లాగాడు? ఆ క్రమంలో ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయనేదే సినిమా.

రామారావు పాత్రలో రవితేజ తన అనుభవాన్ని చూపిస్తాడు. ఓ ప్రభుత్వ అధికారి తలుచుకుంటే ఏమైనా చేయగలడని నిరూపిస్తాడు. ఓ డిప్యూటీ కలెక్టర్‌కు, ఎమ్మార్వోకు ఇన్ని అధికారులున్నాయా? అని అనిపించేలా ఈ పాత్ర తెరపై దూసుకుపోతుంది. ఇక రామారావుగా రవితేజ మెప్పించేస్తాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లో రవితేజ అభిమానులకు నచ్చేస్తాడు. అయితే కొన్నిచోట్ల మాత్రం రవితేజ వయసు వల్ల వచ్చిన మార్పులు స్పష్టంగా తెరపై కనిపిస్తాయి. చాలా ఏళ్ల తరువాత ఎంట్రీ ఇచ్చిన వేణుకి మాత్రం ఈ పాత్ర, ఈ సినిమా అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఇదేమీ అంత గొప్ప పాత్రలా అనిపించదు. కానీ వేణు మాత్రం అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్లిద్దరివీ అంత పెద్ద పాత్రలేమీ కాదు. ఓ సీన్, ఓ సాంగ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ రజిష, దివ్యాన్షలు కనిపించినంత సేపు తెరపై ఆకట్టుకుంటారు. నరేష్, పవిత్రలు స్క్రీన్‌పై కనిపిస్తే ఈలలు, గోలలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. వారి పాత్రలకు అంత ఇంపార్టెన్స్ లేకపోయినా.. థియేటర్లో మాత్రం ఇంపాక్ట్ చూపించారు. నాజర్, సమ్మెట గాంంధీ, జాన్ విజయ్, రాహుల్ రామకృష్ణ ఇలా అందరూ కూడా చక్కగా నటించేశారు.

1990 కాలంలో సాగే ఓ ప‌రిశోధ‌నాత్మక క‌థ ఇది. కాలం ఏదైనా కావొచ్చు కానీ, ఇలాంటి నేర నేప‌థ్యంతో కూడిన క‌థ‌ల్లో ఓ వేగం క‌నిపించాలి. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త రేకెత్తాలి. ఈ రెండూ ఈ సినిమాలో మిస్సయ్యాయి. ఇక్కడ హీరో ర‌వితేజ కాబ‌ట్టి ఆయ‌న శైలి, మాస్ అంశాల‌కి సంబంధించిన లెక్కలు చూసుకుంటూ ఈ క‌థ‌ని న‌డిపిన‌ట్టు అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి క‌థ‌ల్ని మాస్ హీరోలతో ప‌క్కాగా తీస్తే ఆ ఫ‌లితం, ప్రేక్షకుల్లో క‌లిగే ఆ అనుభూతి వేరుగా ఉంటాయి. కానీ, ద‌ర్శకుడు హీరో ఇమేజ్‌నీ, వాస్తవిక‌త‌తో కూడిన ఈ క‌థ‌నీ బ్యాలెన్స్ చేయ‌లేక‌పోయాడు. హీరోయిజం ఎపిసోడ్‌తో క‌థ‌ని మొద‌లుపెట్టాడు ద‌ర్శకుడు. ప్రథ‌మార్ధంలో కుటుంబ నేప‌థ్యం, మాలినితో ప్రేమ‌, ఆమె పెళ్లి త‌దిత‌ర స‌న్నివేశాల‌తో సినిమా అస‌లు క‌థ‌లోకి వెళ్లడానికి చాలా స‌మ‌యం తీసుకుంటుంది.

రాహుల్ రామ‌కృష్ణ ఎపిసోడ్ త‌ర్వాతే క‌థలో సీరియ‌స్‌నెస్ క‌నిపిస్తుంది. ద్వితీయార్ధంలో అస‌లు నిందితుల్ని ఎలా బ‌య‌టికి తీసుకొచ్చాడు? ఆ స‌న్నివేశాలు ఎంత ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌న్నదే సినిమాకి కీల‌కం. ఆ విష‌యంలో ద‌ర్శకుడు అక్కడక్కడా త‌న ప్రభావం చూపించారు కానీ, అవి సినిమాకి స‌రిపోలేదు. సినిమాలో సంభాష‌ణ‌లు ఎక్కువ‌గా వినిపిస్తాయే త‌ప్ప‌, క‌థ క‌థ‌నాలు మాత్రం ఎంత‌కీ ముందుకు సాగుతున్నట్టు అనిపించ‌దు. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ స‌న్నివేశాలు మెప్పిస్తాయి. క‌థ‌ని ముగించిన తీరు దీనికి సీక్వెల్ కూడా ఉంద‌నే సంకేతాల్ని పంపుతుంది. ర‌వితేజ, వేణు త‌ప్ప మిగ‌తా ఎవ్వరికీ ఇందులో బ‌ల‌మైన పాత్రలు లేవు. ప‌క్కా మాస్ క‌థ‌ల్లోలాగా కాకుండా ఇందులో రవితేజ ఒక ప్రభుత్వాధికారి కావ‌డంతో అందుకు త‌గ్గట్టుగానే క‌నిపించాల్సి వ‌చ్చింది.

క‌థానాయిక ర‌జీషా విజ‌య‌న్‌, దివ్యాంశ కౌశిక్ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో క‌నిపిస్తారు. న‌రేశ్‌, నాజ‌ర్‌, రాహుల్ రామ‌కృష్ణ, ప‌విత్ర లోకేశ్‌, పృథ్వీ, శ్రీ, అర‌వింద్ కృష్ణ‌… ఇలా ప‌లువురు న‌టులు క‌నిపించినా ఏ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉండ‌దు. స‌త్యన్ సూర్యన్ కెమెరా ప్రభావం చూపించింది. స్వత‌హాగా ర‌చ‌యిత అయిన ద‌ర్శకుడు శరత్‌ మండ‌వ ఎక్కువ సంభాష‌ణ‌లైతే రాసుకున్నారు కానీ, క‌థ‌ని న‌డిపిన విధానం మాత్రం మెప్పించ‌దు. నిర్మాణం బాగుంది. శామ్ సీఎస్ సంగీతం, నేపథ్యం సంగీతం ఓకే అనిపిస్తాయి. సంతోష్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. 90వ దశకాన్ని చూస్తున్నట్టుగా ఎక్కడా కూడా అనిపించదు. ఇక క్యాస్టూమ్స్ అయితే నాటి కాలంలోవేనా? అని అనుమానం కలుగుతుంది. ఎడిటింగ్ విభాగం ఎన్నో సీన్లకు కత్తెర వేయాల్సిందనిపిస్తుంది. మాటలు కొన్ని చోట్ల పేలినట్టు అనిపిస్తాయి. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.


సినిమాలపై ప్రేక్షకులకు విరక్తి కలిగింది.. అశ్వనీదత్ షాకింగ్ కామెంట్స్

సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని, వారిని థియేటర్‌కు రప్పించడం సవాలుగా మారిందని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ (Ashwini Dutt) అన్నారు. సీఎంల వద్దకు వెళ్లి టికెట్‌ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని అభిప్రాయపడ్డారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం అశ్వినీదత్‌ విలేకరులతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ధరలు తగ్గించాలని ఓసారి.. పెంచాలని మరోసారి చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. టికెట్‌ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు ‘షూటింగ్స్‌ బంద్‌’ అని ఆందోళన చేస్తున్నారు. కరోనాతో పాటు టికెట్ల ధరలను పెంచడం, తగ్గించడం, సినిమాలకు వ్యయం ఎక్కువయ్యిందని సీఎంలతో ధరలను పెంచుకున్నారు. ధరలు పెంచకముందే ఒక సెక్షన్‌ ప్రజలు థియేటర్‌కు రావడం లేదు. సినిమాహాల్‌ క్యాంటీన్‌లలో ఎనలేని రేట్లు పెట్టారు. ఫ్యామిలీతో సినిమా రావాలంటేనే విరక్తి పుట్టేలా చేశారు. ఈ లోపు ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలపై దండయాత్ర చేస్తున్నారు. కానీ, థియేటర్‌కు జనం రాకుండా ఓటీటీలో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టం. ఇష్టారీతిన హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్‌ ధర ప్రకారమే హీరోలు పారితోషికాలు తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్‌ ధరలు పెంచారనేది అవాస్తవం. గతంలో సమస్యలొస్తే ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు వంటి హీరోలు రాలేదు. సమస్యలుంటే ఫిల్మ్‌ ఛాంబరే పరిష్కరించేది. ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ విడుదలపై కూడా అశ్వినీదత్‌ స్పందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచన ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరితో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని, గ్రాఫిక్స్‌ పనులకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. అవెంజర్స్‌ మూవీ స్థాయిలో ‘ప్రాజెక్ట్‌ కె’ ఉంటుందని అశ్వినీదత్‌ చెప్పారు.


పెళ్లి తర్వాతా తగ్గని క్రేజ్… రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నయన్

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రేంజ్ స్టార్ క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నయనతార ఒకరు. తెలుగు, తమిళ బాషల్లో స్టార్ హీరోలందరితో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నయన్.. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ని ఏర్పాటు చేసుకుంది. ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న నయనతారు.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పింది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’‌లో కీ రోల్ పోషిస్తోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచినా ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. దీంతో పాటుగా హిందీలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జవాన్ హీరోయిన్ గా నటించింది..ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు. అయితే నయనతారకు సంబంధించి ఓ కీలక సమాచారం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

సాధారణంగా ఏ హీరోయిన్‌కైనా పెళ్లి తర్వాత క్రేజ్‌తో పాటుగా సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. అయితే ఇందుకు భిన్నంగా నయనతారకి ఇసుమంత కూడా డిమాండ్ తగ్గలేదు. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ షో మాత్రమే కాకుండా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడం నయనతార స్పెషాలిటీ. అందుకే అందరు డైరెక్టర్లు ఆమెతో పని చెయ్యడానికి ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. తనకున్న డిమాండ్‌ని బట్టి నయనతార పెళ్లయిన తర్వాత పారితోషికం బాగా పెంచేసినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటివరకు రూ.4-6కోట్ల పారితోషికం తీసుకునే ఈ బ్యూటీ ఇప్పుడు రూ.10కోట్లు డిమాండ్ చేస్తోందట. అయితే ఆమెకున్న క్రేజ్‌ని బట్టి ఎంత అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు కూడా వెనకడుగు వేయడం లేదట.

కేవలం నయనతార కోసమే సినిమాలు చూసే ప్రేక్షకులు తెలుగు, తమిళ భాషల్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. నయనతార ఒక సినిమా ఒప్పుకుందంటే కచ్చితంగా ఏదో విశేషం ఉంటుందని బలంగా నమ్ముతుంటారు. అందుకే ఆమె తన బ్రాండ్ కి తగ్గ పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నయనతారకి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఈ సంస్థ ద్వారా తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూ కొత్తవాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇస్తోంది నయనతార.