‘వకీల్ సాబ్’ ట్రైలర్
Category : Behind the Scenes Latest Trends Sliders Teasers videos
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌తో తన పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ట్రైలర్లో తన విశ్వరూపం చూపించారు. బాలీవుడ్లో విజయవంతమైన ‘పింక్’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. శ్రీరామ్ వేణు దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. శ్రుతిహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో అభిమానుల మధ్య నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఇదొక కోర్టు డ్రామా కథాంశంతో రూపొందిన చిత్రం. దీనికి తగ్గట్లుగానే ట్రైలర్లో కోర్టు రూమ్ డ్రామానే ఎక్కువ చూపించారు. నివేదా కేసు వాదించే న్యాయవాదిగా పవన్ కనిపించారు. ప్రకాష్‌రాజ్ వీరిని వ్యతిరేకించే న్యాయవాదిగా నందా పాత్రలో కనిపించారు. ప్రచార చిత్రంలో ‘పింక్’ ఛాయలు కనిపించినా.. పవన్ ఇమేజ్‌కి తగ్గట్లుగా కథకు కావాల్సినంత కమర్షియల్ టచ్ ఇచ్చినట్లు అర్థమైంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ – ప్రకాష్‌రాజ్‌ల మధ్య నడిచిన కోర్టు వాదనలు.. పవన్ యాక్షన్ హంగామా.. ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.