బెజవాడ దుర్గమ్మ ఆలయం .. అబ్బురపరిచే డ్రోన్ విజువల్స్
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
Category : Behind the Scenes Daily Updates Features Sliders Spiritual
హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. శక్తి ఆరాధనకు ప్రాముఖ్యతను ఇచ్చే పండుగ శరదృతువు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలవుతుంది. శరదృతువులో జరుపుకునే ఈ నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు.
తెలుగు వారు పదిరోజులపాటు అట్టహాసంగా నిర్వహించే దసరా వేడుకలు, పూజల గురించి ప్రస్తావన వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ దేవాలయమే. ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. తిరుపతి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రెండో పెద్ద దేవాలయంగా కనకదుర్గ గుడి ఖ్యాతి గాంచింది. మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేద వ్యాసుని సలహామేరకు శివుని గూర్చి తపస్సు చేసి, పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు. అర్జునుడు ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సు చేసి శివుని నుండి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు. శివలీలలు, శక్తి మహిమలు ఆలయంలో అక్కడక్కడ కనిపిస్తాయి.
చరిత్ర
కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారి గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మ వారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మ వారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మ వారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన త్రైలోక్య మాత మహిషాసుర మర్దిని కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయింది.
ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలలో అమ్మవారిని దర్శించి ఉగ్రస్వరూపిణిగా వున్న అమ్మవారిని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని పురాణ కథనం. 12వ శతాబ్దంలో విష్ణువర్ధన మహారాజు అమ్మవారిని కొలిచినట్లు శాసనాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారిని దర్శించుకున్నట్లు చరిత్రలో ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఉపాలయాలు
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరాలయం, క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, నటరాజస్వామి ఆలయం ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఈ ఆలయాలను కూడా దర్శించుకుని పూజలు చేస్తారు. దసరా రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిగా దర్శనమిస్తారు. అనంతరం అదేరోజు సాయంత్రం తెప్పోత్సవం నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. అన్నదానంతో పాటు ఉచితంగా పులిహోర, కదంబం, అప్పం ప్రసాదం ఉచితంగా అందిస్తారు. దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలుస్తారు. ఆమె నామాలు, అవతారాలు, రూపాలు అనేకం. ఏ రూపంలో కొలిచినా ఆమ్మకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడితే పూజకి మరింత ఫలితం దక్కుతుందని అంటారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో దర్శనం ఇస్తారో తెలుసుకుందాం.
తొలి రోజు
నవరాత్రుల్లో తొలిరోజు కనకదుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై.. కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు.
రెండో రోజు
రెండో రోజు జగన్మాత కనకదుర్గమ్మ.. బాలాత్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు.
మూడో రోజు
దుర్గగుడిలో మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీ మాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.
నాలుగో రోజు
అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన నాలుగో రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం.
ఐదో రోజు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజున అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాధనలు ముమ్మరమవుతాయి.
ఆరో రోజు
ఆరో రోజున శ్రీలలితా త్రిపుర సుందరీదేవి రూపంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచ దశాక్షరీ మంత్రాధి దేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షాత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరు మందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఏడో రోజు
ఏడో రోజున అమ్మవారు శ్రీమహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్ట సంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఎనిమిదో రోజు
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున అమ్మవారు రెండు అవతారాలలో దర్శనం దర్శనమిస్తారు. అమ్మవారు దుర్గాదేవి రూపంలో, మహిషాసుర మర్ధినిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్ధిని రూపంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు… సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే… భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి.
తొమ్మిదో రోజు
దసరా నవరాత్రి వేడుకల ముగింపు విజయదశమి నాడు ఆఖరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వామహస్తంలో చెరకు గడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీ చక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపంను దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు.
ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మవారికి చేయు అలంకారాలు.. ఇతర వివరాలు
26-09-22
సోమవారం – పాఢ్యమి – స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి – బంగారు రంగు చీర – కట్టెపొంగలి , చలిమిడి , వడపప్పు , పాయసం
27-09-22
మంగళవారం – విదియ – శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి – లేత గులాబీ రంగు చీర – పులిహార
28-09-22
బుధవారం – తదియ – శ్రీ గాయత్రీ దేవి – కాషాయ లేదా నారింజ రంగు చీర – కొబ్బరి అన్నం , కొబ్బరి పాయసం
29-09-22
గురువారం – చవితి – శ్రీ అన్నపూర్ణ దేవి – గంధపురంగు లేదా పసుపు రంగు చీర – దద్దోజనం , క్షీరాన్నం , అల్లం గారెలు
30-09-22
శుక్రవారం – పంచమి – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి – కుంకుమ ఎరుపు రంగు చీర – దద్దోజనం , క్షీరాన్నం
01-10-22
శనివారం – షష్ఠి – శ్రీ మహాలక్ష్మీ దేవి – గులాబీ రంగు చీర – చక్కెర పొంగలి , క్షీరాన్నం
02-10-22
ఆదివారం – సప్తమి – శ్రీ సరస్వతు దేవి – తెలుపు రంగు చీర – దద్దోజనం , కేసరి , పరమాన్నం
03-10-22
సోమవారం – అష్టమి – శ్రీ దుర్గా దేవి – ఎరుపు రంగు చీర – కదంబం , శాకాన్నం
04-10-22
మంగళవారం – నవమి – శ్రీ మహిషాసురమర్ధిని దేవి – ముదురు ఎరుపు రంగు చీర – చక్కెర పొంగలి
05-10-22
బుధవారం – దశమి – శ్రీ రాజరాజేశ్వరి దేవి – ఆకుపచ్చ రంగు చీర – లడ్డూలు , పులిహోర , బూరెలు , గారెలు , అన్నం
© Copyright 2020. All Rights Reserved