డైరెక్టర్ కోడి రామకృష్ణ తల‘కట్టు’ వెనుక రహస్యం ఇదేనంట

డైరెక్టర్ కోడి రామకృష్ణ తల‘కట్టు’ వెనుక రహస్యం ఇదేనంట

కోడి రామకృష్ణ.. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవసరం లేని పేరు. వంద సినిమాలు తీసిన అతి కొద్దిమంది తెలుగు దర్శకుల్లో ఆయనొకరు. సమాజంలో ప్రతి కోణాన్ని స్పృశించి సినిమా తీసి విజయం సాధించారాయన. కేవలం తెలుగే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకూ సైతం దర్శకత్వం వహించారు. ఆయన చివరి చిత్రం ‘నాగాభరణం’ 2016లో విడుదలైంది. ఆయన తీసిన సినిమాలే కాకుండా, ఆహార్యం కూడా ప్రేక్షకులను, అభిమానులను మెప్పించేది. మణికట్టు నిండా రక్షా తాళ్లు, వేళ్లకు ఉంగరాలతో పాటు, ఆయన నుదుటికి ఒక కట్టు కట్టేవారు. ఎక్కువగా తెల్లకట్టుతోనే ఆయన బయట ఫంక్షన్లు, షూటింగ్‌లలో కనిపించేవారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యాన్ని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.

ఆయన రెండో చిత్రం ‘తరంగిణి’(1992) షూటింగ్‌లో ఉండగా సీనియర్‌ ఎన్టీయార్‌ మేకప్‌‌మేన్ మోకా రామారావు మీ ‘నుదురు భాగం పెద్దగా ఉంది. ఎండ తాకకుండా నుదుటికి కట్టు కట్టండి’ అని ఆయనే ఒక తెల్ల కర్చీఫ్‌ ఒకటి కట్టారట. ఆ రోజంతా కోడి రామకృష్ణ షూటింగ్‌లో ఉత్సాహంగా పని చేశారట. ఆ మరుసటి రోజు కూడా బ్యాండ్‌ ఒకటి ప్రత్యేకంగా తయారుచేయించి ధరించారట. అది ధరించి ఉన్న సమయంలో ఒక పాజిటివ్‌ ఎనర్జీ వచ్చినట్లు గమనించిన ఆయన దానిని సెంటిమెంట్‌గా కొనసాగించారట.

ఒకసారి దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్‌ కూడా ‘ఇది మీకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. మీ పూర్వ జన్మ బంధానికి సంకేతం. ఎప్పుడూ తీయకండి’ అని కోడి రామకృష్ణకి సలహా ఇచ్చారట. ఎప్పుడైనా కథ విషయంలో సందిగ్ధం ఏర్పడినపుడు, సమస్యలు వచ్చినపుడు నుదుటికి కట్టు కడితే వెంటనే పరిష్కారం దొరికేదని సన్నిహితులతో కోడి రామకృష్ణ అనేవారట. ఆయన సెంటిమెంటు ఎలా ఉన్న ఆ తల‘కట్టు’ మాత్రం ఆయన ఆహార్యానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలతో ఉండే కోడి రామకృష్ణ అమ్మోరు(1995), దేవి(1999), దేవుళ్లు(2000)లాంటి సినిమాలతోనూ విజయాలను సాధించారు. సీనియర దర్శకుడిగా ‘అరుంధతి’తో ఆయన బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.