కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం.. 580 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా…

కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం.. 580 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలా…

ఈ ఏడాది చిట్టచివరి గ్రహణం నవంబరు 8న గురువారం కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడుతోంది. ఇది చంద్రగ్రహణం కాగా.. ఈ ఏడాదిలో ఏర్పడుతున్న రెండో చంద్రగ్రహణం. దీపావళి మర్నాడు సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే ఈ గ్రహణం ఏర్పడుతుండటం విశేషం. అంతేకాదు, ఈ ఏడాది ఏర్పడిన నాలుగు గ్రహణాలు రెండు వారాల వ్యవధిలోనే రావడం చెప్పుకోదగ్గ అంశం. రెండో చంద్రగ్రహణం భారత్‌తో పాటు ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర పసిఫిక్, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లోనూ దర్శనమిస్తుంది. మళ్లీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మూడేళ్ల తర్వాత 2025 మార్చి 14న ఏర్పడనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.

నవంబర్ 8, 2022న చంద్రుడు భూమి నీడలోకి వెళ్లి ఎరుపు రంగులోకి మారతాడు.. దాదాపు 3 సంవత్సరాల తర్వాతే ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం నవంబరు 8న వివిధ ప్రాంతాల్లో స్థానిక కాలమానం ప్రకారం కనువిందు చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.30 గంటలకు వరకూ కొనసాగుతోంది. భారత్‌లో పూర్తిస్థాయి గ్రహణం 5.32 గంటల నుంచి 6.18 వరకూ 45 నిమిషాల 48 సెకెన్లు దర్శనమివ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

గ్రహణం ప్రారంభమైన దాదాపు గంట తర్వాత 3.46 గంటలకు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్లిపోతాడు. సాయంత్రం 4.29 గంటలకు దాని ప్రభావం పూర్తిగా కనపడుతుంది. ఇలా 5.11 గంటల వరకూ సాగుతుంది. అప్పటి నుంచి క్రమంగా చంద్రుడి కక్ష్య నుంచి భూమి తప్పుకోవడం మొదలై సాయంత్రం 6:19 గంటలకు గ్రహణం ముగుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రోదయం తర్వాత గ్రహణం చూసే అవకాశం ఉంది. భూమి నీడ లోపల చంద్రుని భాగం భూమి వాతావరణం ద్వారా వక్రీభవన సూర్యకాంతి, ఎర్రటి రంగు ద్వారా మాత్రమే ప్రకాశిస్తుంది. ఇంత సుదీర్ఘకాల చంద్ర గ్రహణం ఏర్పడటం 580 ఏళ్ల తరువాత ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చు. ఎటువంటి పరికరాలు అవసరం లేదని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తిస్థాయిలో ఎర్రగా మారిన చంద్రుడ్ని చూడొచ్చు.


కార్తీక పౌర్ణమి.. జ్వాలాతోరణ మహత్యం

కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.

శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ..


‘కార్తికవేళ భీమశంకరుని నగరమందు
దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు
వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ
ఘోర భీకర యమద్వార తోరణంబు’’

అంటాడు.

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది. యమ లోకంలోకి వెళ్లినవారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తిక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి.

దీని వెనక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే… -‘‘శివా! నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా..’’ అని ప్రతీకాత్మకంగా చెప్పటం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని.. ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.


కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలో తెలుసా?

కార్తీక మాసంలో పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్లి గాని ఇంటిలో తులసి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ 365 వత్తులను వెలిగిస్తూ ఉంటాం. ఐతే చాలా మందికి 365 వత్తులను ఎందుకు వెలిగిస్తారో తెలియదు.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పవిత్రమైనది. మహాశివరాత్రితో సమానమైన ఈ పుణ్యదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా పిలుస్తారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమిగా పేర్కొనబడింది. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితాలుంటాయి.

కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.

నిత్యం ఇంటిలో ధూప,దీప నైవేద్యాలను పెడితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగుతుందని నమ్మకం. అయితే మనకు సంవత్సరంలో ప్రతి రోజు దీపం పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. కొన్ని రోజులు దీపం పెట్టటానికి వీలు కాకపోవచ్చు. అందువలన కార్తీక మాసంలో పౌర్ణమి రోజు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని వత్తులను కలిపి ఆవునేతితో తడిపి ఒక కట్టగా వెలిగిస్తాం. ఇలా పౌర్ణమి రోజు 365 ఒత్తుల కట్టను వెలిగిస్తే సంవత్సరం పొడవునా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. అందువల్ల మన పెద్దలు కార్తీక పౌర్ణమి రోజు తులసి లేదా ఉసిరి చెట్టు కింద లేదా శివాలయంలో 365 వత్తుల కట్టను వెలిగించే సంప్రదాయాన్ని పెట్టారు.

కార్తీక పౌర్ణమి శ్లోకం
‘కార్తిక’ మాసం సంవత్సరంలోని సర్వమాసాలకంటే మహిమాన్వితమైనది. కార్తీక మాసం నెలరోజులూ రోజూ సాయం సంధ్య వేళ పూజా స్థలములో, తులసి కోటవద్ద, ఇంటిముందు దీపాలను వెలిగించి నమస్కరించే ఆచారం మన హిందువులకు అనాదిగా వస్తున్నది. రోజూ కుదరకపోయినా కార్తీక పూర్ణిమ నాడు తప్పక వెలిగిస్తారు. అలా వెలిగించిన దీపంలో దామోదరుని ఆవాహన చేసి, ఈక్రింది శ్లోకాన్ని చెప్పి ప్రార్థన చేయాలి.

కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే… ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః

చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి ఈ భూమిమీద నివసించే ప్రతీ ఒక్కజీవికీ కూడా ఈదీపం వెలుతురుని దర్శించ గానే ఇక మరుజన్మ అంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి. కార్తీక మాసమంతా స్నానం, దానం ఉపవాసం చేసే శక్తిలేని వారు కనీసం ఒక్క కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరిస్తే కార్తీక పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ మాసంలో ఉపవాసం పాటించేవారు ఏక భుక్తం, నక్తభోజనం చేస్తారు. నక్తం ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమినాడు లేదా యేయైనా కార్తీక సోమవారాలు నక్తములున్నా పుణ్య ప్రదమే.

కార్తీక పౌర్ణమి నాడు బ్రాహ్మణుని ఆహ్వానించి భోజనం పెట్టి దీప దానం చేస్తూ…


”సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపచ్చుభావహం!
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ”

అనే శ్లోకం పఠించాలి.

దీపం జ్యోతి పరబ్రహ్మ:” దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ దీపదానం వలన జ్ఞానం, ఆయు:వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతాయని శాస్త్రం. ఈ దీపదానం కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది. ఎవరైతే దీప దానం చేస్తారో వారి పాపాలన్నీ నశించిపోతాయని వశిష్ఠ వచనం. ఒక ఒత్తితో దీపదానం సద్భుద్ధిని, తేజస్సుని ఇస్తుంది. నాలుగు వత్తుల దీపదానం రాజ సమానులను చేస్తుంది. పదివత్తుల దీపదానం రాజకీయ సిద్ధినిస్తుంది. 50 వత్తుల దీపదానం దేవత్వాన్నిస్తుంది. వెయ్యి వత్తుల దీపదానం ఈశ్వర కృపకు పాత్రుల్ని చేస్తుంది. వెండి, ప్రమిదలో పైడిపత్తి వత్తులు వేసి, ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని దానం చేయడంవల్ల వచ్చే పుణ్యం అనంతమైనదిగా, వెండి ప్రమిదలో బంగారు వత్తులు వేసి, దానం చేస్తే జన్మరాహిత్యం పొందుతారని మన పురాణాలు తెల్పుతున్నాయి.


కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి

దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్
నారోగ్య సమముత్సాహం
న దేవః కేశవాత్పరః


అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజూ పుణ్యప్రదమే. ఒక్కోరోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం…


కార్తీక శుద్ధ పాడ్యమి: తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్లాలి.. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ: సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.
తదియ: అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.
చవితి : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.
పంచమి : దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.
షష్ఠి : ఈరోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
సప్తమి : ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.
అష్టమి : ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.
నవమి : నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.
ఏకాదశి : దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.
ద్వాదశి : ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.
త్రయోదశి : సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

కార్తీక పూర్ణిమ: కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీ స్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.


కార్తీక బహుళ పాడ్యమి: ఆకుకూర దానం చేస్తే మంచిది.
విదియ : వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.
తదియ : పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.
చవితి : రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.
పంచమి: చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.
షష్ఠి : గ్రామదేవతలకు పూజ చేయాలి.
సప్తమి : జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.
అష్టమి : కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి : వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.
దశమి : అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.
ఏకాదశి : విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.
త్రయోదశి : ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
చతుర్దశి : ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.
అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.


అత్యంత మహిమాన్వితం కార్తీక మాసం.. ఆచరించాల్సిన పద్ధతులివే!

తెలుగు మాసాల్లో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే!. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి.

శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

సూర్యోదయానికి ముందే స్నానం


కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత శివుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది. దైవచింతన అవసరం. ఈ మాసంలో ముఖ్యమైన రోజు ద్వాదశి క్షీరాబ్ది. ద్వాదశి నాడు పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు కనబడుతుంది. కార్తీక మాసంలో ప్రతి రోజూ దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది. ప్రతిరోజూ పూజ చేయలేనివారు క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపాలు వెలిగించుకుని పూజ చేస్తే పుణ్యఫలం పొందుతుంది.

కార్తీకమాసంలో సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. శివుడిని ఆరాధించడం.. పంచామృతాలతో అభిషేకించడం.. నదీ స్నానాలు చేయడం.. చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజున శివుడిని పూజించి జ్వాలాతోరణం దర్శించుకోవాలి. అలాగే కార్తీక మాసంలో వనభోజనాలు కూడా నిర్వహిస్తారు. కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి పగలంతా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత సాయంత్రం నమకం, చమకం. పురుష, శ్రీ సూక్తాదులతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయాలి. కార్తీక శుద్ద ద్వాదాశి రోజున తులసి కోట వద్ద ఉసిరి కొమ్మ ఉంచాలి. తులసి కోటను లక్ష్మీ స్వరూపంగా .. ఉసిరిని మహా విష్ణువుగా భావించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించాలి.

కార్తీక మాసంలో ఏం చేయాలి?


కార్తీక మాసంలో స్నానం, దానం, దీపారాధన, జపం, అభిషేకం చేయాలి. ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తర్వాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. దీపారాధన చేయడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో ప్రదోషకాలమనందు చేసే శివారాధన అనంతకోటి పుణ్యఫలాల్ని ఇస్తాయి. ఈ మాసంలో నక్తం లేదా ఉపవాసం ఆచరించడం వల్ల ఆరోగ్యం, దైవచింతన పరంగా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

సత్యనారాయణస్వామి వ్రత ప్రాధాన్యం


సత్యనారాయణ స్వామి వ్రత కథా విధానం ప్రకారం.. సత్యనారాయణ వ్రతం జీవితంలో ఎప్పుడైనా ఆచరించవచ్చు. కానీ.. వ్రత కథ ప్రకారం కొన్ని ముఖ్యమైన విశేష దినములు/స్వామికి ప్రీతికరమైన దినములుగా పేర్కొంటారు. అందులో ప్రతిమాసంలో వచ్చే ఏకాదశి/ద్వాదశి/ పౌర్ణమి తిథుల యందు, రవి సంక్రమణములు (సూర్యుడు ఒక రాశి నుంచి మరోరాశికి ప్రవేశించి పుణ్య సమయం), మాఘ, ఫాల్గుణ, శ్రావణ కార్తీక ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల యందు చేసేటువంటి సత్యనారాయణస్వామి పూజలు అత్యంత ఇష్టమైనటువంటివిగా వ్రతకల్పనలో పేర్కొనబడినది.

కార్తీక పౌర్ణమి


కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఈశ్వరుడిని అభిషేకం చేసుకొని శివారాధన చేసి జ్వాలా తోరణాన్ని దర్శించవలెను. ఈ పుణ్య మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవిగా శివపురాణం చెబుతోంది. సోమవారాల రోజు శివారాధన చేయడం, ఈశ్వరుడిని పంచామృతాలతో అభిషేకించడం, ఉపవాసం వంటివి ఆచరించడం, నదీస్నానం ఆచరించి దీపారాధన చేయడం వల్ల హరిహరుల అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణం స్పష్టంగా చెబుతోంది. ఈ మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆయుస్సు, ఆరోగ్యం కలిగి కష్టాలు తొలగుతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం లక్ష్మీప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి.

శివాలయాలలో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీమహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రం చెపుతున్నది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీకమాసంలో ఏ మంత్ర దీక్ష చేసినా మంచి ఫలితాలనిస్తుంది.


కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం.. ఇలా చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి

అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. శివకేశవులకు ఇష్టమైన మాసం కావడంతో హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. హరిహరులకు ప్రీతికరమైన ఈ నెలలో కార్తీక పౌర్ణమికి ఎంతో ‘ప్రాశస్త్యం’ ఉంది. ఇక కార్తీకపౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలా తోరణాన్ని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. కార్తీక మాసంలో నెలరోజులు పూజ చేయడం ఒకెత్తయితే.. పౌర్ణమి రోజు వెలిగించే దీపాలు, పూజ ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణం విశిష్టమైన అంశం. ఏ ఇతర మాసంలోనూ ఇటువంటి ఆచారం మనకు కనబడదు. పౌర్ణమి రోజు రాత్రి శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి.. ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని చుడతారు. దీనిని యమద్వారం అని అంటారు. అనంతరం..ఈ గడ్డి మీద నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ మూడు సార్లు ఊరేగిస్తారు.

జ్వాలా తోరణము పదం పురాణ ప్రసిద్ధమైంది. అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పడు మొదటగా హాలాహలం ఉద్భవించగా.. దాన్ని మహాశివుడు తీసుకుని ఆ విషాన్ని కంఠ మధ్యలో నిక్షేపించాడు. అప్పుడు పార్వతీ దేవి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్ని జ్వాల క్రింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుందట. ఈ పురాణ కథ నేపథ్యంలోనే ఏటా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి శివాలయంలో ఎండు గడ్డితో చేసిన చేసిన తోరణాన్ని జ్వాలగా వెలుగిస్తుంటారు. ఆ జ్వాల క్రింది నుంచి శివపార్వతుల పల్లకీని మూడు సార్లు తీసుకొని వెడతారు.

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుందని నమ్మకం. జ్వాలా తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో.. గడ్డివాములోనో.. ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని, ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.