షోలింగర్‌.. ముక్తినిచ్చే యోగ నరసింహుడు

షోలింగర్‌.. ముక్తినిచ్చే యోగ నరసింహుడు

దుష్ట శిక్షణ చేసిన శ్రీ నారసింహుడు ఉగ్రరూపాన్ని ఉపసంహరించి, యోగ ముద్రలో దర్శనమిచ్చిన చోటుగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం షోలింగర్‌. మానసిక సమస్యల నుంచి విముక్తి కలిగించే దైవంగా ఇక్కడి యోగ నరసింహుడు పూజలు అందుకుంటున్నాడు.

తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉన్న షోలింగర్‌.. ప్రసిద్ధ నారసింహ క్షేత్రాల్లో ఒకటి. దీనికి ‘తిరుక్కడిగె’.. ‘కడిగాచలం’ అనే ప్రాచీన నామాలున్నాయి. రాజుల కాలంలో చోళసింహపురంగా ఖ్యాతి చెందిన ఈ ప్రాంతం పేరు క్రమేపీ షోలింగర్‌గా స్థిరపడింది. వెల్లూరు జిల్లా కేంద్రానికి సుమారు 50 కి.మీ., కంచికి 65 కి.మీ., ఆర్కోణానికి 30 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది.

ముక్తినిచ్చే యోగ నరసింహుడు పురాణ గాథల ప్రకారం… హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంలో మహా విష్ణువు వధించిన సందర్భంలో ఆ భీకరాకృతిని చూసి ప్రహ్లాదుడు భయపడ్డాడు. ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని, యోగముద్రలో దర్శనమిచ్చిన నృసింహ స్వామి ఇక్కడ కొలువయ్యాడు. సప్త ఋషులు తనను సేవించుకోగా ముక్తిని అనుగ్రహించాడు. ఈ యోగ నరసింహుణ్ణి సేవించి విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందాడనీ, ఈ ఆలయంలో 24 నిమిషాలు ఉన్నట్టయితే జనన మరణ చక్రం నుంచి విముక్తులవుతారనీ స్థలపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రదేశాన్ని ‘తిరుక్కడిగై’ అని కూడా పిలుస్తారు. అంటే ఇరవై నాలుగు నిమిషాలు దర్శనమిచ్చే నరసింహుడని అర్థం.

ఈ ఆలయానికి కార్తీక మాసంలోని శుక్ర, ఆదివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. చక్ర తీర్థంలో స్నానం చేసి, స్వామిని దర్శించుకుంటారు. వైష్ణవులకు పవిత్రమైన 108 దివ్య క్షేత్రాల్లో ఇదొకటి. ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో బ్రహ్మతీర్థం అనే పుష్కరిణి ఉంది. 108 తీర్థాలు ఇక్కడికి వచ్చి కలుస్తాయంటారు. దీని ఒడ్డున వరదరాజస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి సమీపంలోని మరో కొండ మీద ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఆ గుడిలో హనుమంతుడు కూడా యోగముద్రలోనే కనిపించడం విశేషం. సుమారు 230 మీటర్ల ఎత్తయిన కొండ మీద ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే 1,300కు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. రాజగోపురం ఐదు అంతస్తుల్లో సమున్నతంగా ఉంటుంది.

ప్రధాన ఆలయంలో యోగ నరసింహ స్వామి మూలవిరాట్‌ ఉంటుంది. యోగముద్రలో కూర్చున్న నారసింహుడి కాళ్ళకు యోగ బంధం (పట్టీ) ఉంటుంది. ఆయన దేవేరి అమృతవల్లి అమ్మవారి మందిరం ప్రధాన ఆలయానికి కుడివైపు ఉంటుంది. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం ఆరు నుంచి ఎనిమిదో శతాబ్దం మధ్య చోళరాజులు కట్టించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. మానసిక సమస్యలతో, నయంకాని వ్యాధులతో బాధపడేవారు, నిరాశ, నిస్పృహలకు గురైనవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించి, ముక్తిప్రదాత అయిన స్వామిని పూజిస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం.


పళని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.. విషాలతో తయారుచేసిన విగ్రహం

ఆది దంపతులైన శివపార్వతుల ముద్దుల తనయుడు కుమారస్వామి. ఆయనకు స్కందుడు, కార్తికేయుడు, శరవణుడు, సుబ్రహ్మణ్యుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయనకు తమిళనాడులో ఎన్నో ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి. వాటిలో పళని ఒకటి. ఇక్కడ కొలువైన స్వామిని అరుల్‌ ముగు శ్రీ దండాయుధపాణి స్వామిగా పిలుస్తారు. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండుగల్‌ జిల్లాలోని పళనిలో కొలువై ఉంది. ఇది మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో ఎతైన కొండలపై ఉంటుంది.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల్లో ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము.

పురాణ గాథ
ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు. అది వారిద్దరి కుమారుల్లో ఎవరో ఒకరికి అందించమని చెబుతాడు. అయితే ఆ ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరినీ ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు. వెంటనే కుమార స్వామి తన నెమలి వాహనం తీసుకుని లోకాల ప్రదక్షిణకు వెళ్తాడు. కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్లినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు. తిరిగి కైలాసాన్ని చేరుకుని జరిగిన విషయం తెలుసుకుంటాడు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని తెలుసుకుని, నిరాశగా స్కందుడు భూలోకంలోని పళని ప్రదేశానికి చేరుకుంటాడు. కార్తికేయుడు చిన్నబుచ్చుకుని కైలాసం వదిలి భూలోకం వచ్చి పళనిలోని ఒక కొండ మీద మౌన ముద్రలో ఉంటాడు. విషయం తెలుసుకున్న గౌరీశంకరులు అక్కడకు చేరుకుంటారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని ­ఊరడిస్తాడు.

అప్పుడు శివుడు కుమారా.. సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని బుజ్జగిస్తాడు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో పళం, నీవు అంటే నీ ఈ రెండు కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువు ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు. అందుకు సరేనన్న శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తారు. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి దేవతా మూర్తి తొడ భాగం నుంచి విభూతి తీసి భక్తులకు పంచేవారు. అలా చేస్తూ ఉండటంవల్ల స్వామి వారి విగ్రహం అరిగిపోతూ వచ్చింది. దీంతో కొద్దికాలం తర్వాత అలా పంచడాన్ని నిలిపేశారు. మొదటగా స్వామి వారి ఆలయాన్ని ఏడో శతాబ్దంలో కేరళ రాజు చీమన్‌ పెరుమాళ్‌ నిర్మించారు. తర్వాత పాండ్యులు పునరుద్ధరించారు.

స్వామి వారి విగ్రహాన్ని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో(తొమ్మిది రకాల విష పదార్థాలు) మహర్షి సిద్ధ భోగార్‌ ముని తయారు చేశారు. ప్రపంచంలో ఇలాంటి స్వరూపం మరెక్కడా లేదు. పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుక నుండి స్వామి వారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠ రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే, వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా, స్వామి వారి తొడ భాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామి వారిని వెనుక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్పారు. కాని భక్తులకు ఆ అవకాశం కుదరదు. ఇక్కడ స్వామి వారిని.. కులందైవళం, బాలసుబ్రహ్మణ్యన్, షణ్ముఖన్, దేవసేనాపతి, స్వామినాథన్, వల్లిమనలన్, దేవయానైమనలన్, పళనిఆండవార్, కురింజిఆండవార్, ఆరుముగన్, జ్ఞాన పండిత, శరవణన్, సేవర్ కోడియోన్, వెట్రి వేల్ మురుగా వంటి పేర్లతో పిలుస్తారు.

ఎలా వెళ్లాలి

పళని క్షేత్రం దిండుగల్‌ జిల్లాలో మదురైకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.

విమాన మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి మదురైకి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి చెన్నై సెంట్రల్‌, లేదా మదురై చేరుకోవాలి. మదురై నుంచి కోయంబత్తూర్‌ వెళ్లే రైళ్లు పొల్లాచ్చి మీదుగా, పళని రైల్వేస్టేషన్‌ నుంచే వెళ్తాయి. చెన్నై సెంట్రల్‌- పళని ఎక్స్‌ప్రెస్‌ తిరుచెందూర్‌ నుంచి మదురై మీదుగా పళని చేరుతుంది. అక్కడి నుంచి ఆలయం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్వేస్టేషన్‌ నుంచి దేవాలయానికి ఆటో, బస్సు సౌకర్యం ఉంది.


ఆర్నెల్లకోసారి రంగులు మార్చే వినాయకుడు.. ఇదొక అద్భుతమైన ఆలయం

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం’. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా… ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన ‘వినాయకుడు’ ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలంలో (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయంలో మరో విచిత్రం కూడా వుంది. ఆలయ ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.. నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది. ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.. ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో..ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని ‘మిరాకిల్ వినాయకర్ ఆలయం’ అని కూడా పిలుస్తారు.

ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే గణేశుడి ఈ ఆలయం నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్’ ఆలయం అని పిలుస్తారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడులో పరిధిలోకి వచ్చింది. ఈ ఆలయానికో చరిత్ర కూడా ఉంది. ఆ రోజుల్లో ‘కేరళపురం’ రాజు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం’ బయలుదేరారు. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం సముద్ర కెరటాల్లో తడుస్తూ కనిపించింది. రాజు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుకి అప్పగించబోతే దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మమని అని భావించి రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం’ రాజుకే ఇస్తూ మరొక మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు.

అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి ఈ గణపతి మాత్రం మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపు మూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది నమ్మకం.


నాకు డబ్బుంది.. కానీ జీవితంలో ప్రశాంతం లేదు: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచాన్ని నడిపించేది డబ్బు.. అది లేనిదే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, పేరు ప్రఖ్యాతలు రావని అంటుంటారు. కానీ ఇందులో నిజం లేదని అంటున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్. ఎన్ని రూ.కోట్లు సంపాదించినా తన జీవితంలో ప్రశాంతత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్ కండక్టర్‌గా మొదలైన రజినీకాంత్ ప్రయాణం సూపర్ స్టార్ వరకు వచ్చిన వైనం అందరికీ తెలిసిందే. అయితే పేరు, డబ్బు తన మనసుకు ప్రశాంతతనే ఇవ్వలేదని ఆయన చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలో జరిగిన హ్యాపీ సక్సెస్‌ఫుల్‌ లైఫ్‌ త్రూ క్రియ యోగ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘నేను మంచి నటుడని అందరు అంటుంటారు. కానీ దాన్ని ప్రశంసగా తీసుకోవాలో, విమర్శగా పరిగణించాలో అర్థం కావడం లేదు. నా సినిమాల్లో నాకు ఆత్మ సంతృప్తిని కలిగించిన సినిమాలు బాబా, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి.. ఈ సినిమాలు చూసి నా అభిమానులు చాలా మంది సన్యాసులుగా మారారు, హిమాలయాలకు వెళ్లారు. కానీ నేను మాత్రం ఇక్కడే కొనసాగుతున్నాను. మధ్యలో వెళ్లి వస్తున్నా.. ఇంకా ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇక అక్కడ దొరికే అమూల్యమైన మూలికలు.. తింటే వారానికి సరిపడా శక్తి వస్తుంది. ఆరోగ్యం చాలా ముఖ్యం.. ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు మనకు ఏదైనా అయితే తట్టుకోలేరు. డబ్బు, పేరు, ప్రఖ్యాతలు ఇవేమి నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. అన్నీ ఉన్నా ప్రశాంతత లేదు నాకు. నా జీవితంలో నేను చాలా చూశాను.. కానీ 10 శాతం కూడా ప్రశాంతంగా జీవించలేక పోయాను. సంతోషం, ప్రశాంతత అనేవి జీవితాంతం వుండేవి కావు’ అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు.

రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. తమిళ సినీ పరిశ్రమను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రజనీదే అనడంలో సందేహమే లేదు. ఆయనకు జపాన్, మలేషియా దేశాల్లోనూ అనేక మంది అభిమానులున్నారు. భారతీయ సినిమాలు విదేశాల్లోనూ సత్తా చాటడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. స్టైల్, మ్యానరిజానికి కేరాఫ్‌గా నిలిచే రజనీకాంత్‌ యాక్షన్‌ సినిమాలతో కోలీవుడ్‌ని ఉర్రూతలూగించారు. ప్రస్తుతం ఆయన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తో ‘జైలర్‌’ మూవీలో నటిస్తున్నారు.


ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ‘రామేశ్వరం’

పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో దేశానికి దక్షిణ భాగంలో వున్న మహాక్షేత్రం రామేశ్వరం. లయకారకుడైన శివుడు రామనాథస్వామిగా భక్తులను ఆశీర్వదిస్తుంటారు. తమిళనాడుకు ప్రధాన భూభాగమైన మండపానికి సమీపంలోని రామేశ్వరం ద్వీపంలో వున్న ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనది. శ్రీరాముడు, సీతాదేవిలు స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలను ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. రామేశ్వరం ద్వీపం భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం స్వస్థలం కావడం విశేషం.

సంప్రదాయ నిర్మాణశైలి
రామేశ్వరం ఆలయాన్ని ద్రవిడ సంప్రదాయరీతిలో నిర్మించారు. ఆలయం చుట్టూ పెద్దదైన ప్రహారీ గోడ ఉంటుంది. గోపురాలు కూడా ఎక్కువ ఎత్తులో వున్నాయి. ఈ ఆలయంలోని నడవా… ప్రపంచంలోనే అతిపొడవైన నడవా (కారిడార్‌)గా విశిష్టమైన గుర్తింపు ఉంది. ఆలయంలో ఉత్సవ మూర్తులను ఉంచే మండపాన్ని చొక్కటన్‌ మండపం అంటారు. చదరంగం పట్టిక ఆకారంలో వుండటంతో దీనికి ఈ పేరు వచ్చింది.

క్షేత్ర ప్రాశస్త్యం

సీతను అన్వేషించేందుకు వానరులతో కలసి లంకకు వెళ్లే క్రమంలో శ్రీరాముడు రామేశ్వరం నుంచే రామసేతును నిర్మించారు. తరువాత యుద్ధంలో రావణాసుర సంహారం జరుగుతుంది. బ్రహ్మ హత్య పాతకానికి ప్రాయోశ్చితంగా శ్రీరాముడు శివ పూజ చేయాలని నిర్ణయిస్తాడు. వెంటనే ఆంజనేయుడిని హిమగిరుల నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని కోరుతాడు. అయితే ఆంజనేయుని రాక ఆలస్యం కావడంతో సీతాదేవి సముద్ర ఇసుకతో సైకత లింగాన్ని తయారుచేసి పూజలు నిర్వహిస్తారు. కొంత సమయానికి హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడంతో దానికి పూజలు నిర్వహిస్తారు. ఈ విధంగా రెండు లింగాలు ఆలయంలో వుండటం విశేషం. హనుమ తీసుకువచ్చిన లింగాన్ని విశ్వలింగం అంటారు. మొదట దర్శనంతో పాటు పూజలను ఈ లింగానికి చేయాలని రామచంద్రుల వారి ఆదేశమని పురాణాలు వెల్లడిస్తున్నాయి.

22 తీర్థాలు
రామనాథస్వామి ఆలయంలో 22 తీర్థాలున్నాయి. వీటిలో స్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని ఆలయ చరిత్ర పేర్కొంటుంది. ఈ తీర్థాలు చిన్న చిన్న బావుల్లాగా వుండటం విశేషం. ఈ జలాలతో పుణ్యస్నానం చేస్తే తపస్సు చేసిన ఫలం వస్తుంది. ఆలయం బయట నుంచి కొంత దూరంలోనే సముద్రతీరం కనిపిస్తుంది. ఇక్కడ అలలు లేకుండా ప్రశాంతంగా వుండటం విశేషం. కాశీ యాత్రకు వెళ్లి అక్కడి గంగా జలాలను తీసుకువచ్చి రామేశ్వరంలోని సముద్రంలో కలిపితే కానీ కాశీయాత్ర పూర్తిచేసినట్టు అని పెద్దలు పేర్కొంటారు.

ప్రకృతి ఒడిలో రామేశ్వరం
రామేశ్వరం ఒక ద్వీపం. దీనికి మరో పేరు పంబన్‌ ద్వీపం. పాక్‌ జలసంధి భారత్‌- శ్రీలంకను వేరుచేస్తుంది. ఇక్కడ అటవీప్రాంతం ఎక్కువగా వుండటంతో ఎక్కడచూసినా పచ్చదనం కనపడుతుంది. ఒక వైపు సముద్రం, మరో వైపు పచ్చదనం భక్తులకు ఆహ్లాదం కలిగిస్తాయి. ప్రధాన మందిరమైన అరుల్‌మిగు రామనాథస్వామి ఆలయ ప్రాంగణంలో పలు దేవాలయాలున్నాయి. అమ్మవారు పర్వతవర్ధిని, విశాలక్షి, విష్ణు, వినాయక మందిరాలున్నాయి. అనుప్పు మండపం, సుక్రవర మండపం, సేతుపతి మండపం, కల్యాణ మండపం, నంది మందిరం… తదితర విశిష్ట ప్రదేశాలను ఆలయంలో వీక్షించవచ్చు.

రామసేతు
ద్వీపం చివరి ప్రదేశమైన ధనుష్కోడి వద్దకు వెళితే శ్రీలంక వరకు నిర్మించిన రామసేతు భాగాలు కనిపిస్తాయి. 1964లో వచ్చిన భీకర తుపానులో ధనుష్కోడి పూర్తిగా ధ్వంసమైంది. ఆ శిథిలాలను మనం చూడవచ్చు. ధనుష్కోడి నుంచి శ్రీలంక తలైమన్నార్‌కు చేరుకోవచ్చు.


ఎలా చేరుకోవాలి

  • రామేశ్వరానికి సమీప విమానాశ్రయం మధురై. అక్కడ నుంచి వాహనం లేదా రైలులో ప్రయాణించి చేరుకోవచ్చు. మధురైతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు సౌకర్యముంది.
  • మండపం నుంచి రామేశ్వర ద్వీపానికి బ్రిటిషువారు 1914లో రైలుమార్గం నిర్మించారు. సముద్రంలో దాదాపు మూడు కి.మీ. మేర నిర్మించిన ఈ మార్గం ఇంజినీరింగ్‌ ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. మధ్యలో నౌకలు వెళ్లాల్సి వస్తే కొంచం మేర రైలు మార్గం పైకి లేచి దారి ఇచ్చే విధంగా నిర్మించారు.
పంబన్ బ్రిడ్జి