‘సీతారామం’కి సీక్వెల్.. దుల్కర్ సల్మాన్ ఏమన్నాడంటే..

‘సీతారామం’కి సీక్వెల్.. దుల్కర్ సల్మాన్ ఏమన్నాడంటే..

అన్ని పరిశ్రమల్లోనూ ప్రస్తుతం సీక్వెల్‌ చిత్రాలు విరివిరిగా తెరకెక్కుతున్నాయి. దాంతో, ఏదైనా చిత్రం మంచి విజయం అందుకుందంటే చాలు దాని కొనసాగింపుపై సినీ అభిమానుల నుంచి ప్రముఖుల వరకూ అంతా దృష్టి పెడుతున్నారు. ఇటీవల విడుదలై, హిట్‌ కొట్టిన ‘సీతారామం’ (Sita Ramam) విషయంలోనూ కొనసాగింపు ఉంటే బాగుండని చాలా మంది అనుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ (హిందీ)లో ఓ విలేకరి ఇదే ప్రశ్నను హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ముందు ఉంచగా ఆయన స్పందించారు. ‘‘ఏదైనా సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించి, క్లాసిక్‌గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్‌ చేయకూడదనే విషయాన్ని నేను నటుడినికాకముందే తెలుసుకున్నా. మేం ఈ కథను బాగా నమ్మాం. ‘సీతారామం’ క్లాసిక్‌గా నిలుస్తుందని భావించాం. అనుకున్నట్టుగానే మీరంతా ఈ చిత్రాన్ని మీ హృదయాల్లో దాచుకున్నారు. అందుకే ఈ సినిమాకు కొనసాగింపు ఉండదనుకుంటున్నా. రీమేక్‌ విషయంలోనూ అంతే’’ అని దుల్కర్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ అందమైన ప్రేమకథలో రామ్‌గా దుల్కర్‌, సీతామహాలక్ష్మిగా మృణాల్‌ ఠాకూర్‌ ఒదిగిపోయారు. రష్మిక, తరుణ్‌భాస్కర్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ రాకుమారి(సీత), లెఫ్టినెంట్‌(రామ్‌)ల లవ్‌స్టోరీ దక్షిణాది ప్రేక్షకులతోపాటు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ (తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో) అవుతోంది.


ఫస్ట్‌ డే కలెక్షన్స్… ఫర్వాలేదనిపించిన ‘సీతారామం’

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన, దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్, భూమిక తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. శుక్రవారం(ఆగస్టు 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో తొలిరోజు ఫర్వాలేదనింపిచే స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. టాక్‌కు తగ్గ కలెక్షన్లు అయితే కాదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

‘సీతారామం’ ఫస్ట్ డే కలెక్షన్లు ఏరియాల వారీగా…

నైజాం – రూ. 54 ల‌క్షలు

సీడెడ్ – రూ. 16 ల‌క్షలు

ఉత్త‌రాంధ్ర – రూ. 23 ల‌క్షలు

ఈస్ట్ – రూ. 15 ల‌క్షలు

వెస్ట్ – రూ. 8 ల‌క్షలు

గుంటూరు – రూ. 15 ల‌క్షలు

కృష్ణ – రూ. 13 ల‌క్షలు

నెల్లూరు – రూ. 5 ల‌క్షలు

‘సీతారామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రూ. 13.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సీతారామం చిత్రానికి రూ. 3.05 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్లు ప్రకారం చూస్తే రూ. 5.60 కోట్లు అని సినీ వ‌ర్గాలంటున్నాయి. అయితే శని, ఆదివారాల్లో కలెక్షన్లను బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.