హరిహరులు ఒకేచోట కొలువైన క్షేత్రం ‘పుష్పగిరి’
Category : Behind the Scenes Features Sliders Spiritual
హరిహరులు ఒకేచోట కొలువైన పుణ్యక్షేత్రం పుష్పగిరి. దక్షిణకాశీగా పిలిచే ఈ ఆలయాన్ని శైవ, వైష్ణవ భక్తులందరూ దర్శించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏకైక అద్వైతపీఠంగా గుర్తింపుపొందిన ఈ ఆలయం పినాకిని నదికి ఎదురుగా పచ్చని ప్రకృతి మధ్య కనిపిస్తూ… శిల్పకళావైభవానికి ప్రతీకగా నిలుస్తూ… భక్తులను ఆకట్టుకుంటుంది పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయం. ఇక్కడ విష్ణుమూర్తి చెన్నకేశవస్వామిగా, పరమేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడిగా పూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు. ఏడో శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు దర్శించుకున్నారని చెబుతారు. నిత్యపూజలతో కళకళలాడే ఈ ఆలయం కడపలోని పుష్పగిరిలో ఉంది.
స్థల పురాణం
కశ్యప మహర్షి ఓసారి భార్యలైన కద్రువ, వినత కలిసి ఆడుకుంటూ.. పందెంలో ఓడిపోయినవారు గెలిచినవారికి దాసిలా పని చేయాలని షరతు పెట్టుకున్నారట. ఆ పందెంలో వినత ఓడిపోవడంతో కద్రువకు దాసిలా పని చేసేదట. వినతకు జన్మించిన గరుత్మంతుడు తన తల్లికి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలిగించమని కద్రువను కోరాడట. అప్పుడు కద్రువ తనకు అమృతాన్ని తెచ్చిస్తే వినతకు స్వేచ్ఛను ఇస్తానని చెప్పిందట. దేవేంద్రుడి దగ్గరున్న ఆ అమృతాన్ని గరుత్మంతుడు తెచ్చే క్రమంలో జరిగిన పోరులో రెండు అమృతం చుక్కలు ఈ ప్రాంతంలోని పినాకిని నదిలో పడటంతో ఇందులో స్నానాలు చేసిన వారందరూ మరణం లేకుండా, యుక్తవయస్కుల్లా మారిపోయారట. అది చూసి దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని సంప్రదించారు. విష్ణుమూర్తి ఆ నీటిలో పెద్ద పర్వతం ముక్కను వేసినా అమృతం ప్రభావం వల్ల ఆ నీటిలో రాయి మునగకుండా పుష్పం ఆకారంలో పైకి తేలిందట. దాంతో శివకేశవులు తమ పాదాలతో ఆ రాయిని నీటిలోనే ఉండిపోయేలా తొక్కేశారనీ ఆ తరవాతే హరిహరులు ఇక్కడ వెలిశారనీ… అలా ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందనీ అంటారు. ఈ ఆలయాన్ని విద్యారణ్యస్వామి నెలకొల్పినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడున్న పంచనదీ సంగమంగా గుర్తింపు పొందిన పినాకిని నది… ఉత్తరం నుంచి దక్షిణం దిశగా కాశీశ్వరాలయం వైపు పయనించడం వల్లే పుష్పగిరిని దక్షిణకాశీగా పిలుస్తారు.
నిత్య పూజలు…
ఈ ఆలయానికి చెన్నకేశవస్వామే క్షేత్రపాలకుడు. ఇక్కడున్న స్వామి నిలువెత్తు విగ్రహం తిరుమలలోని శ్రీవారి విగ్రహం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ఏడాది మొత్తం జరిగే పూజలు కాకుండా ధనుర్మాసంలో, కార్తికంలో విశేష అభిషేకాలూ, ఉత్సవాలూ జరిపిస్తారు. కొండ మీద ఒకే ఆవరణలో ఉన్న చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం దర్శించుకున్నాక రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ ఉపాలయాలనూ చూడొచ్చు.
ఎలా చేరుకోవాలంటే
పుష్పగిరి క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారు కడప వరకూ బస్సు లేదా రైల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల్లో కర్నూలుకు వెళ్లే రహదారి మార్గంలో ఉప్పరపల్లె మీదుగా 16 కి.మీ. ప్రయాణిస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.