శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడో తెలుసా?

శ్రీకృష్ణుడు ఏకలవ్యుడిని ఎందుకు చంపాడో తెలుసా?

ఏకలవ్యుడు మహాభారతంలో ఒక గొప్ప యోధుడు, అతనికి గొప్ప చరిత్ర ఉంది. అతని గాథ ఇప్పటికీ చాలా మందికి ఆదర్శం. గాండీవదారి అయ్యి కురుక్షేత్ర యుద్ధాన్ని తన విలువిద్య ప్రభంజనంతో శాసించిన అర్జునుడినే మించిన వాడిగా చరిత్ర పుటల్లో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న ఏకలవ్యుని గురించి చాలా విషయాలు నేటి తరం వారికి తెలియదు. ఇంతకీ అసలు ఏకలవ్యుడు ఎవరు?.. ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ణి ఎందుకు శిష్యుడుగా తిరస్కరించాడు? అతను అంతటి విలువిద్య ఎలా సాధించాడు? తన బొటనవేలు ద్రోణాచార్యుని కి ఇవ్వడానికి గల అసలైన కారణం ఏమిటి? ఆ తర్వాత ఏకలవ్యుడు ఏమైపోయారు? అతనికి కృష్ణుడికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? అనే విషయాలు తెలుసుకుంటాం..

ఏకలవ్యుడి గురించి తెలియాలి అంటే ఒకసారి మహాభారతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏకలవ్యుడు నిషాద కులంలో హిరణ్యధన్యుడు, సులేఖ అనే దంపతులకు జన్మించాడు, నిషాద కులస్తులను ఈ కాలంలో ఎరుకల వారిగా, బోయవారిగా పిలుస్తున్నారు. వీరు ప్రధానంగా అడవిలో జీవిస్తూ అక్కడే ఆకులూ, అలములూ, దుంపలను తింటూ వన్యప్రాణులను వేటాడే జీవనం సాగిస్తారు. వీరి ఆహారంలో అధిక భాగం జంతువుల వేట వల్లనే వస్తుంది, అందువల్ల ఈ కులం వారు విలువిద్యలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు.

ఈ నిషాద కులానికి రాజు ఏకలవ్యుడి తండ్రి అయిన హిరణ్యధన్యుడు, తొలుత ఏకలవ్యుడు తన తండ్రి వద్దనే విద్య నేర్చుకున్నాడు అయితే హిరణ్యధన్యుడు జరాసంధుడి వద్ద సామంత రాజుగా ఉండేవాడు దానివల్ల జరాసంధుడు చేసే యుద్దాలలో పాల్గొని ఒక దానిలో వీరమరణం పొందాడు. తండ్రి మరణించడం వల్ల ఏకలవ్యుడు వారి తెగకు చిన్న వయసులోనే రాజయ్యాడు. అయితే తండ్రికి ఉన్న బుద్ధి కుశలం, వేటకి వెళ్ళినప్పుడు అడవి మృగాల నుంచి తన వారిని కాపాడుకునే అంత నేర్పరితనం, విద్య అంత చిన్న వయసులో ఏకలవ్యుడు వద్ద లేకపోవడం వల్ల తనకి సకల విద్యలు నేర్పగల గురువు గురించి వెతుకుతున్న సకల విద్యా పారంగతుడు విలువిద్యలో ఎదురులేని పరాక్రమశీలి అయిన ద్రోణాచార్యులు గురించి తెలుసుకొని అయన వద్దకి వెళ్లి తనకి కూడా సకల శాస్త్ర విద్యలను నేర్పమని అడిగాడు. ఏకలవ్యుడి కోరికను ద్రోణాచార్యుడు తిరస్కరించాడు, ఆ తిరస్కారానికి కారణం అడగగా నేను కేవలం క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పుతాను, నీవు నిషాధ తెగకు చెందిన వాడవు, కాబట్టి నీకు నేర్పలేను అని బయటకు చెప్పిన ద్రోణుడు, ఏకలవ్యుడి ప్రవర్తనలో ఏదో దోషం కనిపించింది అందువల్లనే ఆ క్షణంలో ద్రోణుడు ఏకలవ్యుడు నేర్పించడానికి సుముఖత చూపించలేదు.

అయితే ద్రోణుడి శాస్త్ర విద్య కౌశలానికి ముగ్ధుడయిన ఏకలవ్యుడు ద్రోణుడినే తన గురువుగా భావించి అడవిలో బంకమట్టితో ఆయన విగ్రహం ఒకటి చేసుకుని ఆ బొమ్మే తనకు విద్య నేర్పుతుందని భావించి విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు ద్రోణుడు కురు పాండవులను పిలిచి అడవిలోకి వెళ్లి సరదాగా వేటాడమని, వేటనే క్షత్రియులకు ఆటవిడుపు అని చెప్పి పంపాడు. అయితే అడ్డదిడ్డంగా ఎటు పడితే అటు పరిగెత్తే అడవి జంతువులను బాణంతో గురిచూసి కొట్టడం వల్ల వారి విలువిద్య నైపుణ్యం పెరుగుతుందని అనేది ఇక్కడ ఆయన ఉద్దేశ్యం, ఆయన మాటే పరమావధిగా కురుపాండవులు కొంతమంది సైన్యంతో వేట కుక్కలతో అడవిలోకి వేటకి వెళ్లగా అడవిలోనే ఒకచోట విలువిద్య సాధన చేసుకుంటున్న ఏకలవ్యునిమరియు వింత ఆకారాన్ని చూసి ఒక కుక్క మొరగడం మొదలుపెడుతుంది.

తనను చూసి మొరుగుతుంది కోపంతో ఆ కుక్క తెరిచిన నూరు మూసుకుని లోపు ఏడు బాణాలను ఏకకాలంలో సంధించి దాని నోరు కదపకుండా చేశాడు, దానితో కుక్క మూలుగుతూ కురుపాండవుల వద్దకు రాగా ఆ కుక్కకు పట్టిన గతికి కారణం ఏంటో అన్వేషిస్తూ దానితోపాటు వెళ్ళిన భటుడిని అక్కడ జరిగిన వృత్తాంతాన్ని ద్రోణుని మట్టి బొమ్మ ని గురించి చెప్పాడు. అప్పటివరకు విలువిద్యలో అత్యంత పరాక్రమశాలి అయిన అర్జునుడు ఏక కాలంలో ఐదు బాణాలను మాత్రమే స్పందించగలరు, కానీ ఏకలవ్యుడు ఏడు బాణాలను స్పందించడంతో అక్కడి వారు ఆశ్చర్య పోవడం తో పాటు కౌరవులు అర్జునుడిని హేళన చేశారు. దాంతో అర్జునుడు ద్రోణుడి వద్దకు వెళ్లి అడవిలో జరిగిన వృత్తాంతాన్ని వివరించి అదే సమయంలో ద్రోణుడు ఒక నాడు ప్రపంచంలో నీకంటే సమర్థుడైన విలుకాడు ఉండనంత విధంగా విలువిద్య నేర్పుతానని అర్జునుడికి ఇచ్చిన మాట గుర్తు చేసాడు. దాంతో ఆశ్చర్యపోయిన ద్రోణాచార్యుడు తాను ఎవరికీ అంతటి విద్యను నేర్పలేదని, అయినా తన పేరుతో అంత విద్యను నేర్చుకున్నా వ్యక్తిని చూడాలని నిశ్చయించుకొని ద్రోణుడు ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళాడు, తాను వెళ్లేముందు కుక్కకు జరిగిన దుస్థితిని చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. ద్రోణుడిని చూసిన ఏకలవ్యుడు సంతోషపడి ద్రోణుడికి సన్మానం చేసి తన భక్తిని చూపెట్టాడు.

అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని తో ‘ఏకలవ్య నీవు నేనే నీ గురువు అని చెబుతున్నావు కదా, మరి నా గురుదక్షిణ ఏది అని అడగగా దానికి ఏకలవ్యుడు తప్పకుండా గురువర్యా నా సంపద కాని నా దేహ ప్రాణాల లో ఏది కావాలన్నా చెప్పండి అంటాడు. అది మీకు వెంటనే సమర్పించుకుంటాను అని పలికాడు, అప్పుడు ద్రోణుడు వెంటనే నీ కుడి చేతి బొటన వేలుని ఇవ్వమని అడగగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన బొటన వేలుని కోసి గురుదక్షిణగా ద్రోణాచార్యుని కి ఇచ్చాడు ఏకలవ్యుడు. ద్రోణుడు చేసిన ఈ పనికి భాగవతంలో ఒక వివరణ కూడా ఇచ్చారు. ఏకలవ్యుడు ఎంత గొప్పవాడైనా కాలక్రమంలో అధర్మం వైపు నిలబడి యుద్ధం చేయడం వల్ల ఎంతో అనర్థం జరుగుతుందని భావించిన ద్రోణుడు విలువిద్యకి ఆయువు పట్టు అయిన బొటనవేలును ఇవ్వమని కోరినట్లు భాగవతం చెబుతుంది.

బొటనవేలు పోయినా ఏకలవ్యుడు మిగిలిన నాలుగు వేళ్ళతో బాణాలను సంధించడంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు, అయితే ద్రోణుడు అనుకున్నదే నిజమైంది. ఏకలవ్యుడు ధర్మం వైపు మొగ్గు చూపకుండా అధర్మం వైపు మొగ్గుచూపి ఏకలవ్యుడు జరాసంధునికి మద్దతుగా నిలిచాడు. జరాసంధునికి ఏకలవ్యుని శక్తిసామర్థ్యాలు మీద అపార నమ్మకం అయితే జరాసంధునికి శ్రీకృష్ణునికి ఉన్న వైరం వల్ల జరాసంధుడు చాలాసార్లు కృష్ణుని మీదకి సేనలను పంపాడు కానీ ఏనాడు గెలవలేక పోయాడు ఆ సమయంలో సకల శాస్త్ర విద్య పారంగతుడు అయిన ఏకలవ్యుడిని శ్రీకృష్ణుడి సేనలపైకి పంపాడు.

ఏకలవ్యుడి ధనుర్విద్య నైపుణ్యానికి యాదవ సేనలు పిట్టలు రాలినట్టుగా రలి పోతుంటే అది తెలుసుకున్న కృష్ణుడు తానే స్వయంగా కదన రంగం లోకి వచ్చి ఏకలవ్యుడిని మట్టు పెట్టాడు, అంతటితో ఒక మహావీరుని అధ్యాయం ముగిసింది. ద్రోణుడు కాదన్నా పట్టుదలతో గురువు లేకుండా అపార విలువిద్య నేర్చుకొని పట్టుదల గల వ్యక్తిగా ద్రోణుడు అడిగిన వెంటనే క్షనమయిన ఆలోచించకుండా తన బొటన వేలుని కోసి ఇచ్చి గురు భక్తిని చాటి చాటుకున్న వ్యక్తిగా మహా వీరుడిగా పేరుగాంచిన ఏకలవ్యుడు ధర్మ అధర్మ విచక్షణ లేక అధర్మం వైపు మొగ్గు చూపి చూపడం వల్ల ఆఖరికి కృష్ణుడి చేతిలో మరణించక తప్పదు తప్పలేదు.


శ్రీకృష్ణ జన్మాష్టమి… శ్రీ కృష్ణుడు జపించిన ఉత్తమ మంత్రమేమిటో తెలుసా?

శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి, హిందూ ఇతిహాసాలలో ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడు. శ్రీ కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని, లేదా జన్మాష్టమి, లేదా గోకులాష్టమి, లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు.. వసుదేవుడి భార్య అయిన దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదేరోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది.

చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ౹
బంగారు మొలతాడు పట్టుదట్టి౹
సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు౹
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలుతు౹౹

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, స్వామికి నైవేద్యం పెడతారు. ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి, పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినమనికూడా వివరించింది.

దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ… అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్ధేశం చేశారు శ్రీ కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా… దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం, కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంస్కృతి, సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి.

శ్రీ కృష్ణుడు జపించిన ఉత్తమ మంత్రమేమిటో తెలుసా?

జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీ కృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది. పూర్వం శ్రీ కృష్ణ భగవానుడు తనకు కావలసిన కోరికలను సిద్ధింప జేసుకోవడం కోసం ముక్కంటిని తలచి తపస్సు చేయాలనుకున్నాడు. వెంటనే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న పరమ శివభక్తుడైన ఉపమన్యు మహర్షి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని మాటను చెప్పాడు. అప్పుడు ఆ మహర్షి అధర్వ వేద ఉపనిషత్తులోని “నమశ్శివాయ” అనే పంచాక్షర మంత్రాన్ని ఉపదేశించి, 16నెలల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు. ఇలా నమశ్శివాయ మంత్రముతో 16 నెలల పాటు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను కృష్ణుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. కృష్ణుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరాలు కావాలో? కోరమంటాడు. అప్పుడు కృష్ణుడు 8 వరాలను కోరుకుంటానని చెప్పి వాటిని శివుడి ముందుంచాడు. అచంచలమైన గొప్పకీర్తి, స్థిరమైన శివసన్నిధి లభించాలి. నిత్యం శివధర్మంలో బుద్ధి నిలవాలి. నిత్యం తాను శివభక్తితో ఉండాలి. శత్రువులంతా సంగ్రామంలో నశించాలి. ఎక్కడా శత్రువుల వల్ల తనకు అవమానం కలుగకూడదు. తనకు తొలిగా జన్మించిన కుమారులకు ఒక్కొక్కరికి పదిమంది పుత్రులు కలగాలి. యోగులందరికీ తాను ప్రియుడు కావాలి. ఈ వరాలను తనకిమ్మని కృష్ణుడు కోరగానే ముక్కంటి వాటినన్నింటిని అనుగ్రహిస్తాడు.

ఇదేవిధంగా శ్రీ కృష్ణ పరమాత్మ చేసిన తపస్సుకు పార్వతీదేవి సంతసించి కావలసినన్ని వరాలను కోరమని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు.. బ్రాహ్మణుల మీద ఎప్పటికీ ప్రజలకు ద్వేషం కలగకూడదు. తన తల్లిదండ్రులు సర్వకాలాలలోను సంతోషంగా ఉండాలి. తానెక్కడ ఉన్నా సర్వ ప్రాణుల మీద తనకు అనురాగం కలగాలి. మంగళకరమైన బ్రాహ్మణ పూజను తాను సర్వదా చేస్తుండాలి. తాను వంద యజ్ఞాలను చేసి ఇంద్రుడు లాంటి దేవతలను సంతోష పెట్టాలి. తన గృహంలో ఎల్లప్పుడూ వేల సంఖ్యలో యతులకు, అతిథులకు శ్రద్ధతో పవిత్రమైన భోజనాన్ని సమర్పించే అవకాశం కలగాలి. అలాగే తాను వేలసంఖ్యలో భార్యలకు ప్రియమైన భర్త కావాలి. తనకు వారంటే ఎప్పటికీ అనురాగం ఉండాలి. వారి తల్లిదండ్రులంతా లోకంలో సత్య వాక్యాలను పలుకుతూనే ఉండాలి. అనే వరాలను కృష్ణుడు శక్తిమాతను అడిగాడు. వాటిని శ్రీ కృష్ణుడికి వెంటనే అనుగ్రహించి ఆ మరుక్షణంలోనే పార్వతీ పరమేశ్వరులిద్దరు అంతర్ధానమయ్యారని శివపురాణం చెబుతోంది.

“నమశ్శివాయ” మంత్రంచే కృష్ణుడు సిద్ధింప చేసుకున్న వరాలలో కొన్ని మాత్రమే ఆయనకు సంబంధించినవి. మిగతా వరాలను పరిశీలిస్తే సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కోరుకున్నవే అవుతాయి. అందుచేత శ్రీ కృష్ణ భగవానుడు కొంతవరకు తమ స్వార్థాన్ని ఆకాంక్షిస్తూ వరాలు కోరినా.. ఎంతో కొంత సామాజిక శ్రేయస్సును కూడా అభిలాషించాలన్న ఓ ఉత్తమ ప్రబోధం ఈ కథలో కనిపిస్తుంది. లోక కళ్యాణార్థం భూమిపై అవతరించిన శ్రీ కృష్ణ భగవానుడిని శ్రీ కృష్ణాష్టమి రోజున నిష్టతో పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం..

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు…