‘సీతారామం’కి సీక్వెల్.. దుల్కర్ సల్మాన్ ఏమన్నాడంటే..

‘సీతారామం’కి సీక్వెల్.. దుల్కర్ సల్మాన్ ఏమన్నాడంటే..

అన్ని పరిశ్రమల్లోనూ ప్రస్తుతం సీక్వెల్‌ చిత్రాలు విరివిరిగా తెరకెక్కుతున్నాయి. దాంతో, ఏదైనా చిత్రం మంచి విజయం అందుకుందంటే చాలు దాని కొనసాగింపుపై సినీ అభిమానుల నుంచి ప్రముఖుల వరకూ అంతా దృష్టి పెడుతున్నారు. ఇటీవల విడుదలై, హిట్‌ కొట్టిన ‘సీతారామం’ (Sita Ramam) విషయంలోనూ కొనసాగింపు ఉంటే బాగుండని చాలా మంది అనుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ (హిందీ)లో ఓ విలేకరి ఇదే ప్రశ్నను హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ముందు ఉంచగా ఆయన స్పందించారు. ‘‘ఏదైనా సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించి, క్లాసిక్‌గా నిలిస్తే దాన్ని మళ్లీ టచ్‌ చేయకూడదనే విషయాన్ని నేను నటుడినికాకముందే తెలుసుకున్నా. మేం ఈ కథను బాగా నమ్మాం. ‘సీతారామం’ క్లాసిక్‌గా నిలుస్తుందని భావించాం. అనుకున్నట్టుగానే మీరంతా ఈ చిత్రాన్ని మీ హృదయాల్లో దాచుకున్నారు. అందుకే ఈ సినిమాకు కొనసాగింపు ఉండదనుకుంటున్నా. రీమేక్‌ విషయంలోనూ అంతే’’ అని దుల్కర్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ అందమైన ప్రేమకథలో రామ్‌గా దుల్కర్‌, సీతామహాలక్ష్మిగా మృణాల్‌ ఠాకూర్‌ ఒదిగిపోయారు. రష్మిక, తరుణ్‌భాస్కర్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ రాకుమారి(సీత), లెఫ్టినెంట్‌(రామ్‌)ల లవ్‌స్టోరీ దక్షిణాది ప్రేక్షకులతోపాటు ఉత్తరాది వారినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ (తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో) అవుతోంది.


పెళ్లి చేసుకోను.. కానీ బిడ్డని కనాలని ఉంది.. సీతారామం నటి

బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి, పిల్లలు కనడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను నటించిన ‘సీతా రామం’ మూవీ ఇటీవల హిందీలో విడుదలవగా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆమె తాజాగా ప్రముఖ యూట్యూబ్ చానెల్‌ ‘డేటింగ్ దిస్ నైట్స్’ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. 30ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలు డేటింగ్ చేయడం, ప్రేమలో పడటం, బిడ్డను కనడం వల్ల కలిగే ఒత్తిడి తాను ఎదుర్కొలేనని చెప్పింది. అలాగే పాత సిద్ధాంతాలను బద్దలు కొట్టి ప్రేమలో పడకుండానే బిడ్డను కనాలని ఉందన్న బ్యూటీ.. ఈ తరం అమ్మాయిలు కాలం చెల్లిన ఆలోచనలనుంచి బయటపడాలని సూచించింది.

ఈ మేరకు ‘నేను ఎక్కడి నుంచి వస్తున్నానో.. నా మనసులో ఏముందో గమనించి, చేస్తున్న వృత్తిని అర్థం చేసుకునే భాగస్వామి కావాలి. ప్రస్తుతం మన చుట్టు చాలా అభద్రతాభావం ఉంది. కాబట్టి నాకు కావల్సిందల్లా ప్రొటెక్టెడ్ పర్సన్. ఇలాంటి వ్యక్తులు దొరకడం చాలా అరుదు. అలాగే నేను బిడ్డను కనాలని భావించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, అది సెక్స్ ద్వారా కాదు. ఒంటరి తల్లిగా ఉండాలనుకున్నా. దానికి మా అమ్మ సరే అని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. నిజంగా అలా ఉండటం అద్భుతమైనది’ అని ముగించింది మృణాల్.


‘సీతారామం’ భామకి ఆఫర్ల వెల్లువ!

‘సీతారామం’లో సీతగా మైమరపించే నటనతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur)కి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయా..? అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. మన తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్‌కి మొదటి సినిమా గనక భారీ హిట్ సాధిస్తే ఇక అందరూ ఆమె వెనకాలే క్యూ కడుతుంటారు. ఈ విషయం ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి హీరోయిన్స్‌గా పరిచయమైన వారిని చూస్తే అర్థమవుతుంది. ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన కృతిశెట్టి (Krithi Shetty) ఆ సినిమా రిలీజ్ కాకుండానే అరడజను సినిమాలలో నటించే అవకాశం అందుకుంది. ఇలా ఇప్పుడు మృణాల్ ఠాకూర్‌కి కూడా పెద్ద హీరోల సరసన నటించే ఛాన్సులు వస్తున్నాయట.

సీతా రామం (Sita Ramam) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్.. అందంలో మన హీరోలను, మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. సీతగా నటించి అందరి మెప్పు పొందింది. దాంతో ఇప్పటికే కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో మొదలబోతున్న సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ పేరును పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే కాదు ఇప్పుడు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ కి కూడా ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు మృణాల్ పేరునే పరిశీలిస్తున్నారట. మరి అఫీషియల్‌గా ఎప్పుడు కన్‌ఫర్మేషన్ వస్తుందో గానీ, ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ కమిటైందని ఇన్‌సైడ్ టాక్. పెళ్లి సందడి సినిమా తర్వాత యంగ్ బ్యూటీ శ్రీలీల, రొమాంటిక్ మూవీతో పరిచయమైన కేతిక శర్మ ఇలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటున్నారు. ఈ వరుసలో ఇప్పుడు మృణాల్ కూడా చేరిందని చెప్పుకుంటున్నారు.


ఫస్ట్‌ డే కలెక్షన్స్… ఫర్వాలేదనిపించిన ‘సీతారామం’

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన, దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్, భూమిక తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. శుక్రవారం(ఆగస్టు 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో తొలిరోజు ఫర్వాలేదనింపిచే స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. టాక్‌కు తగ్గ కలెక్షన్లు అయితే కాదని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

‘సీతారామం’ ఫస్ట్ డే కలెక్షన్లు ఏరియాల వారీగా…

నైజాం – రూ. 54 ల‌క్షలు

సీడెడ్ – రూ. 16 ల‌క్షలు

ఉత్త‌రాంధ్ర – రూ. 23 ల‌క్షలు

ఈస్ట్ – రూ. 15 ల‌క్షలు

వెస్ట్ – రూ. 8 ల‌క్షలు

గుంటూరు – రూ. 15 ల‌క్షలు

కృష్ణ – రూ. 13 ల‌క్షలు

నెల్లూరు – రూ. 5 ల‌క్షలు

‘సీతారామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రం రూ.3.2 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు రూ. 13.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే సీతారామం చిత్రానికి రూ. 3.05 కోట్లు వ‌సూళ్లు వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్లు ప్రకారం చూస్తే రూ. 5.60 కోట్లు అని సినీ వ‌ర్గాలంటున్నాయి. అయితే శని, ఆదివారాల్లో కలెక్షన్లను బట్టి సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది.


సినిమాలపై ప్రేక్షకులకు విరక్తి కలిగింది.. అశ్వనీదత్ షాకింగ్ కామెంట్స్

సినిమాలపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగిందని, వారిని థియేటర్‌కు రప్పించడం సవాలుగా మారిందని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ (Ashwini Dutt) అన్నారు. సీఎంల వద్దకు వెళ్లి టికెట్‌ ధరలు పెంచుకోవడమే ప్రస్తుత స్థితికి కారణమని అభిప్రాయపడ్డారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం అశ్వినీదత్‌ విలేకరులతో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘నిర్మాతల శ్రేయస్సు కోసమే అప్పట్లో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ధరలు తగ్గించాలని ఓసారి.. పెంచాలని మరోసారి చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. టికెట్‌ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు ‘షూటింగ్స్‌ బంద్‌’ అని ఆందోళన చేస్తున్నారు. కరోనాతో పాటు టికెట్ల ధరలను పెంచడం, తగ్గించడం, సినిమాలకు వ్యయం ఎక్కువయ్యిందని సీఎంలతో ధరలను పెంచుకున్నారు. ధరలు పెంచకముందే ఒక సెక్షన్‌ ప్రజలు థియేటర్‌కు రావడం లేదు. సినిమాహాల్‌ క్యాంటీన్‌లలో ఎనలేని రేట్లు పెట్టారు. ఫ్యామిలీతో సినిమా రావాలంటేనే విరక్తి పుట్టేలా చేశారు. ఈ లోపు ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలపై దండయాత్ర చేస్తున్నారు. కానీ, థియేటర్‌కు జనం రాకుండా ఓటీటీలో సినిమాలు విడుదల చేయకపోతే సినిమాలు చేయడం కష్టం. ఇష్టారీతిన హీరోలకు పారితోషికాలు ఇస్తున్నారనడం సరికాదు. మార్కెట్‌ ధర ప్రకారమే హీరోలు పారితోషికాలు తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్‌ ధరలు పెంచారనేది అవాస్తవం. గతంలో సమస్యలొస్తే ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు వంటి హీరోలు రాలేదు. సమస్యలుంటే ఫిల్మ్‌ ఛాంబరే పరిష్కరించేది. ప్రస్తుత నిర్మాతల్లో స్థిరత్వం లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ విడుదలపై కూడా అశ్వినీదత్‌ స్పందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబరు 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచన ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరితో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని, గ్రాఫిక్స్‌ పనులకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. అవెంజర్స్‌ మూవీ స్థాయిలో ‘ప్రాజెక్ట్‌ కె’ ఉంటుందని అశ్వినీదత్‌ చెప్పారు.