‘పక్కా కమర్షియల్’ రివ్యూ

‘పక్కా కమర్షియల్’ రివ్యూ

చిత్రం: పక్కా కమర్షియల్‌
నటీనటులు: గోపిచంద్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, రావు రమేశ్‌, అజయ్‌ ఘోష్‌, సప్తగిరి, తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: కర్మ్‌ చావ్లా
ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్ధవ్‌
నిర్మాత: బన్నీ వాసు
నిర్మాణ సంస్థలు: యూవీ క్రియేషన్స్‌, జీఏ2 పిక్చర్స్‌
రచన, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: 1-07-2022

గోపీచంద్‌ అంటే యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌. దర్శకుడు మారుతీది సెపరేట్‌ ట్రాక్‌. కుటుంబ కథలకు కామెడీ, కీలక పాత్రలకు ఏదో ఒక సమస్యతో ముడి పెట్టి సినిమాలను తెరకెక్కించి సక్సెస్‌ కొట్టడంలో సిద్ధహస్తులు. అలాంటి వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ‘పక్కా కమర్షియల్‌’ . రాశీఖన్నా కథానాయిక. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?.. యాక్షన్‌ హీరో గోపీచంద్‌ను మారుతి ఎలా చూపించారు?… రివ్యూలో చూద్దాం…

సూర్యనారాయ‌ణ (స‌త్యరాజ్‌) ఓ న్యాయ‌మూర్తి. స‌రైన సాక్ష్యాధారాలు లేక‌పోవ‌డంతో ఓ కేసులో బాధితురాలికే జ‌రిమానా విధిస్తాడు. నేరం చేసిన వివేక్ (రావు ర‌మేష్‌) ఆ కేసులో గెలుస్తాడు. బాధితురాలికి న్యాయం చేయ‌లేక‌పోయాన‌ని కుమిలిపోయిన సూర్యనారాయ‌ణ‌త‌న వృత్తి నుంచి వైదొలుగుతాడు. కిరాణాకొట్టుని న‌డుపుతూ జీవితం సాగిస్తుంటాడు. సూర్య‌నారాయ‌ణ కొడుకు ల‌క్కీ (గోపిచంద్‌)(Gopi chand) కూడా తండ్రిలాగే న‌ల్ల‌కోటే ధ‌రిస్తాడు. కాక‌పోతే తండ్రిలా కాదు, ఇత‌ను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లాయ‌ర్‌. డ‌బ్బు కోసం విలువ‌ల్ని సైతం ప‌క్క‌న‌పెడ‌తాడు. ఓ కేసు విష‌యంలో తండ్రీ కొడుకుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ త‌లెత్తుతుంది. బాధితుడి ప‌క్షాన నిల‌వ‌డం కోసం ఎప్పుడో వ‌దిలిపెట్టిన న‌ల్ల‌కోటుని మ‌ళ్లీ ధ‌రిస్తాడు సూర్య‌నారాయ‌ణ‌. త‌న కొడుకుతోనే కోర్టులో పోరాటానికి దిగుతాడు. మ‌రి ఈ వైరం ఎక్క‌డిదాకా సాగింది?.. (Pakka Commercial Review) చివ‌రికి విలువ‌ల్నే న‌మ్ముకున్న తండ్రి గెలిచాడా లేక‌, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అయిన త‌న‌యుడు గెలిచాడా? తాను న‌టిస్తున్న సీరియ‌ల్ కోసం లా కూడా చ‌దివేసిన లాయ‌ర్ ఝాన్సీ క‌థేమిటన్నది మిగ‌తా సినిమా.

డబ్బుల్లేనిదే ఏ పని చేయను, డబ్బిస్తే అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చేసే లక్కీ పాత్రలో గోపీచంద్ అదరగొట్టేశాడు. ఈ చిత్రంలో గోపీచంద్ యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని యాంగిల్స్‌ను చూపించాడు. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంతో స్టైలీష్‌గా కనిపిస్తాడు. లాయర్ ఝాన్సీ పాత్రలో రాశీ ఖన్నా అందరినీ నవ్విస్తుంది. తనకు తాను ఎక్కువగా ఊహించుకుని ఆ భ్రమలోనే బతికే పాత్రలో రాశీ ఖన్నా అద్భుతంగా నటించింది. రాశీ ఖన్నా బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి. రావు రమేష్ తనకు అలవాటైన విలనిజాన్ని, కామెడీని జొప్పించి మరోసారి మెప్పించాడు. సత్యరాజ్ ఎప్పటిలానే ఎమోషన్ పండించాడు. అజయ్ ఘోష్, ప్రవీణ్, వైవా హర్ష, సప్తగిరి అందరూ కూడా చక్కగా నటించారు.

మారుతి సినిమాలన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైక కథను ముందుకు తీసుకెళ్తాడు. పక్కా కమర్షియల్‌లో కథను పక్కకు పెట్టి కామెడీతో లాక్కోచ్చాడు. హీరోయిజం మీదనే ఎక్కువ దృష్టిపెట్డాడు. టైటిల్‌కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్‌ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఓ ఎమోషనల్‌ సీన్‌తో సినిమా మొదలవుతుంది. లాయర్‌ లక్కీగా గోపిచంద్‌ ఎంట్రీతోనే టైటిల్‌ దగ్గట్టుగా పక్కా కమర్షియల్‌గా సినిమా సాగుతుంది. సీరియల్‌ నటి ‘లాయర్‌ ఝాన్సీ’ ఎంట్రీతో కామెడీ డబుల్‌ అవుతుంది. ఆమె క్యారెక్టరైజేషన్స్‌ విషయంలో మారుతి మరోసారి తన మార్క్‌ చూపించాడు.

సీరియల్‌లో తన క్యారెక్టర్‌ని చంపారంటూ ‘లాయర్‌ ఝాన్సీ’ కోర్టు ఆశ్రయించే సీన్‌ నవ్వులు పూయిస్తుంది. రొటీన్‌ కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్‌ అంతా సోసోగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌ నుంచి అసలు కథ మొదలవుతుంది. వివేక్‌కి దగ్గరైన లక్కీ చివరకు అతన్ని ఎలా జైలు పాలు చేశాడనేది వినోదాత్మకంగా చూపించాడు. సెకండాఫ్‌లో చాలా ఫ్రెష్‌ కామెడీతో నవ్వించాడు మారుతి. సినిమాల్లో వచ్చే ఫైట్‌ సీన్స్‌పై వేసిన సెటైర్‌, రావు రమేశ్‌, అజయ్‌ ఘోష్‌ల మధ్య వచ్చే సీన్స్‌ నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్‌ ప్రేక్షకుడి ఊహకి అందేట్లుగా ఉంటుంది. కథని, లాజిక్స్‌ని పక్కకు పెట్టి చూస్తే.. ‘పక్కా కమర్షియల్‌’ పక్కా నవ్విస్తుంది.