X

‘విరాటపర్వం’ రివ్యూ

టైటిల్‌ : విరాటపర్వం
నటీనటులు : సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్‌, జరీనా వాహబ్‌, ఈశ్వరీరావు, నవీన్‌ చంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు
దర్శకత్వం : వేణు ఊడుగుల
సంగీతం : సురేశ్‌ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : దివాకర్‌మణి, డానీ సాంచెజ్‌ లోపెజ్‌
ఎడిటర్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌
విడుదల తేది : జూన్‌ 17, 2022

డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్, ఈశ్వరి రావు, జరీనా వాహబ్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేష్ బాబుతో పాటు సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేష్ బొబ్బలి సంగీత దర్శకత్వంలో, దివాకర్ మణి, డాని సాంచేజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. రానా, సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ ఆ ఆసక్తిని మరింత పెంచేశాయి. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్‌ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్‌లో విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం…

విరాటపర్వం కథ 1990-92 ప్రాంతంలో సాగుతుంది. ములుగు జిల్లాకు చెందిన వెన్నెల(సాయి పల్లవి) పుట్టుకనే నక్సలైట్లతో ముడిపడి ఉంటుంది. పోలీసులు,నక్సలైట్ల ఎదురుకాల్పుల మధ్య వెన్నెలకు జన్మనిస్తుంది ఆమె తల్లి(ఈశ్వరీరావు). ఆమెకు పురుడు పోసి పేరు పెట్టింది కూడా ఓ మహిళా మావోయిస్టు(నివేదా పేతురాజ్‌). ఆమె పెరిగి పెద్దయ్యాక మావోయిస్ట్‌ దళ నాయకుడు అరణ్య అలియాస్‌ రవన్న(రానా దగ్గుబాటి) రాసిన పుస్తకాలను చదివి ఆయనతో ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం తెలియని వెన్నెల తల్లిదండ్రులు(సాయి చంద్‌, ఈశ్వరీరావు) ఆమెకు మేనబావ(రాహుల్‌ రామకృష్ణ)తో పెళ్లి ఫిక్స్‌ చేస్తారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, తాను రవన్నతోనే కలిసి ఉంటానని తల్లిదండ్రులతో చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది. రవన్న కోసం ఊరూరు వెతికి.. అష్టకష్టాలు పడుతూ చివరకు తన ప్రియుడిని కలుస్తుంది. తన ప్రేమ విషయాన్ని అతనితో పంచుకుంటుంది. కుటుంబ బంధాలను వదిలి, ప్రజల కోసం అడవి బాట పట్టిన రవన్న వెన్నెల ప్రేమను అంగీకరించాడా? వెన్నెల మావోయిస్టులను కలిసే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవన్నపై ప్రేమతో నక్సలైట్‌గా మారిన వెన్నెల చివరకు వారి చేతుల్లోనే చనిపోవడానికి కారణం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే థియేటర్‌లో ‘విరాటపర్వం’ చూడాల్సిందే.

విరాటపర్వం కథలో ఎంతో మంది నటీనటులున్నారు. భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర), శకుంతల (నందితా దాస్) ఇలా ఎన్నెన్నో పాత్రలున్నాయి. కానీ అందరి దృష్టి మాత్రం వెన్నెలగా నటించిన సాయి పల్లవి మీదే పడుతుంది. ఆ తరువాత రవన్నగా రానా పాత్రపై అందరికీ ఆసక్తి పెరుగుతుంది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించేసింది. కొన్ని సీన్లలో కన్నీరు పెట్టించేస్తుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ చేసిన సమయంలో విజిల్స్ వేయిస్తుంది. అలా సాయి పల్లవి పూర్తిగా స్క్రీన్‌ను ఆక్రమించేసుకున్నట్టు అనిపిస్తుంది. రానా సైతం తన ఆహార్యంతోనే అందరినీ మెప్పిస్తాడు. రవన్న కారెక్టర్‌లో దళనాయకుడిగా ఆకట్టుకుంటాడు. రానా నటన, గంభీర్యమైన వాక్చతుర్యం పాత్రను మరింతగా ఎలివేట్ చేసింది. మిగతా పాత్రధారులైన ఈశ్వరీరావు, సాయి చంద్, రాహుల్ రామకృష్ణ, బెనర్జీ, నివేదా పేతురాజ్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో అవలీలగా నటించేశారు.

విరాట పర్వం యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారనే విషయం తెలిశాక.. వెన్నెల పాత్ర ఎవరో కాదు తూము సరళే అని తెలిశాక.. నాడు జరిగిన ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. నాటి సరళ విషాద ఘట్టానికి సంబంధించిన వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే నక్సలైట్లే సరళను చంపేశారని అందరికీ తెలిసిందే. విరాట పర్వం కథను దర్శకుడు ఏ కోణంలో చూపిస్తాడు.. ఆ హత్యను ఎలా సమర్థిస్తాడు.. ఏవిధంగా చూపిస్తాడు..ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు.. అని నిర్ణయిస్తాడు అనే దాని మీద అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే దర్శకుడు వేణు మాత్రం ఇక్కడ ఆ సున్నితమైన అంశాన్ని ఎంతో హృద్యంగా, గుండె బరువెక్కేలా చిత్రీకరించాడు. సరైన జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఓ అందమైన ప్రేమ కథను అల్లేశాడు. ఈ సినిమా విషయంలో ఎంతో లిబర్టీ తీసుకున్నట్టు కనిపిస్తుంది. దళసభ్యులే అనుమానంతో కోవర్టు అని చంపినా దానికి దారి తీసిన కారణాలు, అనుమానం రావడానికి గల సంఘటనలను అద్భుతంగా పేర్చాడు. చివరకు పోలీసులు పన్నిన వలలో భాగంగానే దళ సభ్యులు అలా చేయాల్సి వచ్చిందని చెప్పకనే చెప్పేశాడు. తప్పు ఎవరిది? ఒప్పు ఎవరిది.. ఈ పాపం ఎవరిది అంటూ ఇక చివర్లో వేసిన విషాద గీతంతో తాను చెప్పదల్చుకున్నది చెప్పేశాడు. ప్రేక్షకుల తీర్పుకు వదిలేసినట్టుగా అనిపిస్తుంది.

దర్శకుడు వేణు స్వతహా రచయిత కావడంతో మాటలు తూటాల్లా పేలాయి. ‘మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్’అని రాహుల్‌ రామకృష్ణతో చెప్పించి.. అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో చూపించాడు. ‘మీరాభాయి కృష్ణుడు కోసం క‌న్న‌వాళ్ల‌ను, క‌ట్టుకున్న‌వాళ్ల‌ను వ‌దిలేసి ఎలా వెళ్లిపోయిందో! అలానే నేను నీకోసం వ‌స్తున్నాను’ అంటూ వెన్నెలతో చెప్పించి రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి తెలియజేశాడు. ‘తుపాకీ గొట్టంలో శాంతి లేదు… ఆడపిల్ల ప్రేమలో ఉంది’, ‘చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు’, ‘రక్తపాతం లేనిదెప్పుడు చెపు​.. మనిషి పుట్టుకలోనే రక్తపాతం ఉంది’, నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తల రాతల్లో కచ్చితంగా నేనే ఉన్నా’ లాంటి డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. అలాగే తెలంగాణలో అప్పట్లో ఎలాంటి పరిస్థితులు ఉండోవో, ప్రజల జీవన పరిస్థితి ఏరకంగా ఉండేదో చక్కగా చూపించాడు. మొత్తంగా దర్శకుడు వేణు ఊడుగుల ఓ స్వచ్చమైన ప్రేమ కథను.. అంతే స్వచ్చంగా తెరకెక్కించాడు.

Telugu BOX Office:
Related Post